
మీడియం మెషీన్ గన్ తయారు చేస్తున్న లోకేశ్ మెషీన్స్
హైదరాబాద్ సంస్థకు ఆర్మీ నుంచి రూ. 17.7 కోట్ల విలువైన ఆర్డర్
సాక్షి, హైదరాబాద్: భారత సరిహద్దుల్లో పహారా కాసే జవాన్ల చేతికి మరో ‘సిటీ తుపాకీ’అందనుంది. బాలానగర్ కేంద్రంగా పని చేసే లోకేశ్ మెషీన్స్ లిమిటెడ్ సంస్థ ఇప్పటికే ‘అస్మి’పేరుతో ఓ సబ్ మెషీన్ గన్ (ఎస్‌ఎంజీ) రూపొందించి ఆర్మికి అందించింది. తాజాగా మీడియం మెషీన్ గన్ (ఎంఎంజీ)ను తయారు చేస్తోంది. పుణెలోని రక్షణ అభివృద్ధి, పరిశోధక సంస్థ (డీఆర్డీఓ)లో అంతర్భాగమైన అర్మామెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిషిమెంట్ ఈ గన్‌ను డిజైన్ చేయగా... తయారీకి సంబంధించి ఆర్మీ నుంచి రూ.17.7 కోట్ల ఆర్డర్ లోకేశ్ మెషీన్స్‌కు దక్కింది.
ఈ సంస్థ ఇజ్రాయెల్, జర్మనీ ఆయుధ కర్మాగారాలకు దీటుగా ‘అస్మి’ని ప్రతిష్టాత్మకంగా తయారు చేసింది. ఈ తుపాకీని భద్రతా బలగాలతో పాటు కేంద్ర పోలీసు బలగాలూ వినియోగిస్తున్నాయి. ప్రముఖుల భద్రత కోసం వినియోగించడానికీ అస్మి అనువుగా ఉంది. తాజాగా 7.62 = 51 మి.మీ. క్యాలిబర్‌తో ఉండే ఈ ఎంఎంజీ కూడా నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (నాటో) ప్రమాణాలకు లోబడి, దేశీయ పరిస్థితులకు అనుగుణంగా తయారవుతోంది. ఈ ఎంఎంజీలో క్విక్ ఛేంజ్ బ్యారల్ సిస్టం, త్రీ–పొజిషన్ గ్యాస్ రెగ్యులేటర్ వంటి ఆధునిక హంగులున్నాయి.
తుపాకీ సమర్థమంతంగా పని చేయడానికి ఇవి ఉపకరిస్తాయి. ప్రస్తుతం ఆర్మీ వినియోగిస్తున్న ఎంఎంజీల కంటే ఈ తుపాకీ 25 శాతం తక్కువ బరువు ఉంటుంది. 1800 మీటర్ల దూరంలో ఉన్న టార్గెట్‌ను ఛేదించగలదు. 250 తూటాల బెల్ట్ కెపాసిటీతో పని చేస్తుంది. రెండు బెల్ట్‌లను ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుంది. మైనస్ 40 డిగ్రీల నుంచి 55 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలోనూ నిరాఘంటంగా సేవలు అందిస్తుంది.