
హైదరాబాద్: జూబ్లీహిల్స్ శాసనసభ ఉప ఎన్నిక నేపథ్యంలో అనుమతి పొందిన ఆయుధాలను లైసెన్స్‌దారులు తమ సమీప ఠాణాల్లో అప్పగిస్తున్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రకారం వెపన్ లైసెన్స్ హోల్డర్లు తమ ఆయుధాలను పోలీస్‌స్టేషన్‌లో అప్పగించాలని ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాల మేరకు వెపన్ లైసెన్స్‌దారులకు గత రెండు నెలల నుంచే ఆయా పోలీస్‌స్టేషన్ల అధికారులు సమాచారం ఇచ్చారు. వాటిని ఠాణాల్లో గానీ, గుర్తింపు పొందిన సంబంధిత ఆయుధ విక్రయ కేంద్రాల్లో గానీ డిపాజిట్ చేసేందుకు అవకాశం కల్పించారు.
శాంతి భద్రతలు, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించే దిశగా ఎన్నికల సమయంలో తుపాకులను డిపాజిట్ చేయాలనే నిబంధనే ఉన్నది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో దీని పరిధి కిందికి వచ్చే పోలీస్ స్టేషన్లలో లైసెన్స్‌దారులు గత కొద్ది రోజుల నుంచి వాటిని అప్పగిస్తున్నారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ పరిధి కిందికి పంజగుట్ట, మధురానగర్, బోరబండ, జూబ్లీహిల్స్, ఫిలింనగర్, టోలిచౌకి, గోల్కొండ, సనత్‌నగర్ తదితర పోలీస్‌స్టేషన్లు వస్తాయి. జూబ్లీహిల్స్ అసెంబ్లీ పరిధిలోని ఎనిమిది ఠాణాల పరిధిలో 234 లైసెన్స్‌డ్ తుపాకులు ఉన్నాయి. ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం లైసెన్స్‌డ్ తుపాకులు తెప్పించుకుని పోలీస్‌స్టేషన్లలో డిపాజిట్ చేయిస్తున్నారు.
రాజకీయ నాయకులు, వ్యాపార, పారిశ్రామికవేత్తలు, సెలబ్రిటీలు, రియల్టర్లు ఈ ఆయుధాలను కలిగి ఉన్నారు. ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో తుపాకులు ఉన్నవారు బెదిరింపులకు పాల్పడే అవకాశం ఉండడంతో ఎన్నికలు అయ్యే వరకు పోలీసులు వాటిని డిపాజిట్ చేసుకోవాలని ఎన్నికల సంఘం నిబంధనలు తెలియజేస్తున్నాయి. ఆయుధ లైసెన్స్ ఉన్నవారి వివరాలను నేషనల్ డేటా బేస్ ఆఫ్ ఆర్మ్స్ లైసెన్స్ వెబ్‌సైట్‌లో పొందుపరచడమే కాకుండా లైసెన్స్ కలిగిన ప్రతిఒక్కరికీ ఐడీ నెంబర్ కేటాయించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 234 మంది లైసెన్స్‌దారులకు నోటీసులు జారీ చేసి వారి నుంచి తుపాకులను డిపాజిట్ చేయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా ఇప్పటికే 80 శాతం ఆయుధాలు డిపాజిట్ చేయడం జరిగింది.
క్రిమినల్ కేసులు నమోదైతే లైసెన్స్ రద్దు..
ఆయుధ లైసెన్స్ కలిగిన వ్యక్తులపై ఏదైనా సందర్భంలో క్రిమినల్ కేసులు నమోదైతే వారికి ఆయుధ లైసెన్స్‌ను రద్దు చేయనున్నారు. అంతేకాకుండా ఆయుధాన్ని అనవసరంగా ఉపయోగించినా రద్దు చేసే అవకాశాలు ఉన్నాయి. అనుమతి పొందిన ప్రాంతం కంటే ఇతర ప్రాంతాల్లో ఆయుధం సంచరించినా లైసెన్స్‌ను రద్దు చేస్తారు.