అన్నారం డ్యామేజీలకు మేము బాధ్యులం కాదు  | Sakshi
Sakshi News home page

అన్నారం డ్యామేజీలకు మేము బాధ్యులం కాదు 

Published Thu, Mar 21 2024 6:14 AM

Annaram barrage is under serious threat - Sakshi

బ్యారేజీకి తీవ్రమైన ముప్పు పొంచి ఉంది 

నీటిపారుదల శాఖకు నిర్మాణ సంస్థ ‘ఆఫ్కాన్స్‌’ లేఖ.. డిజైన్‌లో లోపమున్నట్టు మోడల్‌ స్టడీలో తేలింది..  

గేట్ల నుంచి వచ్చే భీకర వరదతో దిగువన లోతైన గుంతలు 

గుంతలు విస్తరించి సెకెంట్‌ పైల్స్, ర్యాఫ్ట్‌ మధ్య అగాధం! 

అందుకే బ్యారేజీలో బుంగలు పడి తరచూ లీకేజీలు 

వర్షాకాలం ప్రారంభానికి ముందే అత్యవసర రక్షణ చర్యలు తీసుకోవాలి 

సాక్షి, హైదరాబాద్‌:  కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన అన్నారం బ్యారేజీకి డిజైన్‌ లోపాలతో తీవ్ర ముప్పు పొంచి ఉందని నిర్మాణ సంస్థ ఆఫ్కాన్స్‌–విజేత–పీఈఎస్‌ జాయింట్‌ వెంచర్‌ తెలిపింది. ఎలాంటి డ్యామేజీలకైనా తాము బాధ్యులం కాదని స్పష్టం చేసింది. బ్యారేజీలో లోపాలు తెలుసుకోవడానికి పుణేలోని సెంట్రల్‌ వాటర్‌ అండ్‌ పవర్‌ రీసెర్చ్‌ స్టేషన్‌లో ఫిబ్రవరి 7న నిర్వహించిన మోడల్‌ స్టడీలో డిజైన్‌లో లోపాలున్నట్టుగా తేలిందని పేర్కొంది. వచ్చే వర్షాకాలం ప్రారంభం కావడానికి ముందే బ్యారేజీకి అత్యవసర రక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరముందని స్పష్టం చేసింది. ఈ మేరకు గత ఫిబ్రవరి 10న నీటిపారుదల శాఖకు లేఖ రాసింది. 

నీళ్లు నిల్వ ఉండేలా డిజైన్‌ చేయలేదు 
బ్యారేజీలు, డ్యామ్‌ల గేట్లు ఎత్తినప్పుడు వరద భీకర వేగంతో కిందికి దూకినట్టుగా ప్రవహిస్తుంది. ఆ వరద నేరుగా దిగువన (అప్రాన్‌ ఏరియా) ఉన్న కాంక్రీట్‌ బ్లాకులపై పడడంతో అవి కొట్టుకుపోయి భారీగా లోతైన గుంతలు పడే ప్రమాదం ఉంటుంది. దీనిని నివారించడానికే బ్యారేజీ దిగువ ప్రాంతంలో తగిన స్థాయిలో నీళ్లు నిల్వ (టెయిల్‌ వాటర్‌ లెవల్‌) చేస్తారు. పైనుంచి పడే వరద ఆ నీటిలో పడటం వల్ల ఉధృతి తగ్గి కాంక్రీట్‌ బ్లాకులకు నష్టం జరగదు. అయితే అన్నారం బ్యారేజీకి దిగువన తగిన రీతిలో నీళ్లు నిల్వ ఉండేలా డిజైన్‌ చేయలేదు. దీంతో గతంలో వచ్చిన వరదలతో దిగువన ఉన్న కాంక్రీట్‌ బ్లాకులు కొట్టుకుపోయి ఆ ప్రాంతంలో లోతైన గుంతలు ఏర్పడ్డాయి.

నిరంతర వరదలతో బ్యారేజీ ర్యాఫ్ట్‌(పునాది) కింద రక్షణగా ఉండే సెకెంట్‌ పైల్స్‌ వరకు ఈ గుంతలు విస్తరించాయి. వీటివల్ల సెకెంట్‌ పైల్స్‌ దెబ్బతిని వాటికి, ర్యాఫ్ట్‌కు మధ్య అగాధం ఏర్పడి ఉండడానికి అవకాశం ఉంది. దీని వల్లనే బ్యారేజీలో బుంగలు పడి నీళ్లు లీక్‌ అవుతున్నాయని ఆఫ్కాన్స్‌–విజేత– పీఈఎస్‌ జాయింట్‌ వెంచర్‌ స్పష్టం చేసింది. కాగా స్టేట్‌ డ్యామ్‌ సేఫ్టీ రివ్యూ ప్యానెల్‌ చైర్మన్‌ ఏబీ పాండ్య, రామగుండం మాజీ ఈఎన్‌సీ నల్లా వెంకటేశ్వర్లు మోడల్‌ స్టడీలో పాల్గొన్నారు.  

సెకనుకు 15–30 మీటర్ల వేగంతో వరద 
వరదలు తగ్గుముఖం పట్టాక తక్కువ మొత్తంలో నీళ్లను కిందికి విడుదల చేసేందుకు వీలుగా బ్యారేజీ గేట్లను తక్కువ ఎత్తులో పైకి లేపుతారు. అయితే బ్యారేజీ పూర్తిగా నిండి ఉండడంతో పీడనం పెరిగి వరద భీకర ఉధృతితో గేట్ల కింద నుంచి దూసుకు వస్తుంది. అన్నారం గేట్లను 10–30 సెంటిమీటర్లు మాత్రమే పైకి ఎత్తినా, సెకనుకు 15–30 మీటర్ల భీకర వేగంతో వరద బయటికి వస్తోందని మోడల్‌ స్టడీలో తేలింది. ఈ నేపథ్యంలోనే బ్యారేజీ రక్షణకు ల్యాబ్‌ సూచనల మేరకు అత్యవసర చర్యలు తీసుకోవాలని నిర్మాణ సంస్థ లేఖలో కోరింది.  

మూడేళ్ల కిందే ముగిసిన డిఫెక్ట్‌ లయబిలిటీ పీరియడ్‌ 
అన్నారం బ్యారేజీ డిఫెక్ట్‌ లయబిలిటీ పీరియడ్‌ 2021 డిసెంబర్‌ 17లోనే ముగిసింది. నాటి నుంచి మూడేళ్ల పాటు కేవలం బ్యారేజీ నిర్వహణ కోసం రూ.6.42 కోట్ల అంచనాలతో అఫ్కాన్స్‌ –విజేత–పీఈఎస్‌ జేవీతో నీటిపారుదల శాఖ ‘ఆపరేషన్‌ అండ్‌ మెయింటినెన్స్‌’ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం కూడా ఈ ఏడాది డిసెంబర్‌ 16తో ముగియనుంది. డిఫెక్ట్‌ లయబిలిటీ పీరియడ్‌లో బ్యారేజీకి జరిగే నష్టాలకు నిర్మాణ సంస్థే పూర్తి బాధ్యత తీసుకుని పునరుద్ధరిస్తుంది.    

Advertisement
 
Advertisement