వారి త్యాగాల వల్లే నువ్వు అధికారంలో ఉన్నావ్‌ కేసీఆర్‌: అమిత్‌ షా ఫైర్‌

Amit Shah Comments On KCR Government For September 17 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో సెప్టెంబర్‌ 17న బీజేపీ ఆధ్వర్యంలో విమోచన దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పరేడ్‌ గ్రౌండ్స్‌లో అమిత్‌ షా మాట్లాడుతూ.. సర్దార్ వల్లభాయ్‌ పటేల్‌కు అనేకానేక ప్రణామాలు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినా.. నిజాం రాజ్యంలో అరాచకాలు కొనసాగాయి.

హైదరాబాద్‌ స్వాతంత్ర్యం కోసం ఎంతోమంది బలిదానాలు చేశారు. సర్దార్‌ పటేల్‌ లేకపోతే తెలంగాణ విమోచనం మరింత ఆలస్యమయ్యేది. సర్దార్‌ పోలీస్‌ యాక్షన్‌ ద్వారానే తెలంగాణ విమోచనం అ‍యింది. 108 గంటలపాటు పోలీసు చర్యలో ఎంతో మంది అమరులయ్యారు. నిజాం రాజ్యంలో అరాచకాలను ఇప్పటికీ మరువలేము. ఇంకా కొంతమంది మనుషుల్లో రజాకార్ల భయం ఉంది. భయాన్ని వదిలేసి ధైర్యంగా బయటకు రావాలి.

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలనేది ప్రజల ఆకాంక్ష. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కేసీఆర్‌ విమోచన దినాన్ని అధికారికంగా జరపలేదు. 75 ఏళ్లలో ఏ ప్రభుత్వం కూడా విమోచన దినోత్సవం జరుపలేదు. కొందరు ఇతర పేర్లతో ఉత్సవాలు జరుపుతున్నారు. తెలంగాణ విమోచన పేరుతోనే ఉత్సవాలు జరపాలి.  విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలని ప్రధాని మోదీ నిర్ణయించారు. ప్రధాని నిర్ణయం తర్వాతే ఇప్పుడు అందరూ తెలంగాణ విమోచన దినోత్సవం జరుపుతున్నారు.  ఎవరి త్యాగాల వల్ల మీరు నేడు అధికారంలో ఉన్నారో.. వారికి శ్రద్ధాంజలి కూడా వహించకపోతే తెలంగాణకు ద్రోహం చేసినట్లేనని.. సీఎం కేసీఆర్‌పై విమర్శలు చేశారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top