
భారీగా పెండింగ్‌లో హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లు
సుప్రీంకోర్టు ఆదేశాలతో మరోసారి కదలిక
పాత, కొత్త వాహనాలకు డీలర్ల వద్దే ఏర్పాటు
సయామ్ పోర్టల్‌లో నమోదుకు అవకాశం
రవాణా శాఖ నిర్ణయం.. వాహనదారుల్లో గందరగోళం
సాక్షి, హైదరాబాద్: ఏళ్లకేళ్లుగా నత్తనడకన నడుస్తున్న హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్ల (హెచ్‌ఎఎస్‌ఆర్‌పీ)లో మరోసారి కదలిక వచి్చంది. భద్రత దృష్ట్యా ప్రతి వాహనానికి హై సెక్యూరిటీ నంబర్‌ప్లేట్ తప్పనిసరి అంటూ సుప్రీంకోర్టు వెలువరించిన ఆదేశాలతో రవాణా శాఖ అప్రమత్తమైంది. పాత, కొత్త వాహనాలన్నింటికీ హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లను ఏర్పాటు చేసుకోవాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ మేరకు గ్రేటర్ హైదరాబాద్‌లో పెండింగ్‌లో ఉన్న సుమారు 20 లక్షలకు పైగా వాహనాలకు ఇప్పుడు హెచ్‌ఎస్‌ఆర్‌పీ తప్పనిసరిగా మారింది. ఈ ఏడాది సెపె్టంబర్ నాటికి ఏర్పాటు చేసుకోవాలని రవాణాశాఖ పేర్కొనడంతో వాహనదారుల్లో గందరగోళం నెలకొంది.
నత్తకు నడకలు నేర్పేలా..
సామాజిక భద్రత, వాహనాల భద్రత దృష్ట్యా 2013లో అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో ఈ పథకాన్ని అమల్లోకి తెచ్చారు. కానీ.. నంబర్ ప్లేట్‌ల తయారీలో తీవ్రమైన కొరత, డిమాండ్ మేరకు సరఫరా లేకపోవడం, అప్పటి ఉద్యమ వాతావరణం తదితర పరిణామాల దృష్ట్యా నిర్లక్ష్యం కొనసాగింది. ఇంచుమించు 2017 వరకు ఆర్టీఏ కార్యాలయాల్లోనే ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసి నంబర్ ప్లేట్‌లను బిగించారు. కానీ.. అప్పటికే లక్షలాది వాహనాలు పెండింగ్‌లో ఉండడంతో హెచ్‌ఎస్‌ఆర్‌పీ నిర్వహణ సవాలుగా మారింది. ఆ తర్వాత ఈ పథకాన్ని షోరూమ్‌లకు బదిలీ చేశారు. బండి కొనుగోలు సమయంలోనే హెచ్‌ఎస్‌ఆర్‌పీ కోసం ఫీజు చెల్లించడం తప్పనిసరి చేశారు.
షోరూమ్‌లకు బదిలీ అయిన తర్వాత కొంతమేరకు బాగానే అమలైంది. కానీ.. నంబర్ ప్లేట్ సహా శాశ్వత రిజి్రస్టేషన్ ఫీజులు కూడా చెల్లించినప్పటికీ కొందరు వాహనదారులు హెచ్‌ఎస్‌ఆర్‌పీని ఏర్పాటు చేసుకోలేదు. తమకు నచి్చన పద్ధతిలో బయట తయారు చేసుకొని అమర్చుకున్నారు. ఇలాంటి వాహనాలు కనీసం 20 లక్షలకు పైగా ఉండవచ్చని అంచనా. కార్లు, లగ్జరీ వాహనాలు, హై ఎండ్ బండ్లకు ఆకర్షణీయమైన పద్ధతిలో నంబర్ ప్లేట్లను ఏర్పాటు చేసుకునేందుకు హెచ్‌ఎస్‌ఆర్‌పీని విస్మరించారు. సుమారు 12 లక్షల ద్విచక్ర వాహనాలు, 5 లక్షల కార్లు, సుమారు 2 లక్షల వరకు క్యాబ్‌లు, ఇతర రవాణా వాహనాలు ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు.
నాణ్యతపై నమ్మకం లేకనే..
హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లలో నాణ్యత లేకపోవడంతోనూ వాహనదారులు విముఖత చూపుతున్నారు. తెలుపు రంగు ప్లేట్లపై నంబర్లను ఎంబోసింగ్ చేసి నలుపురంగు పెయింట్ వేస్తారు. కాగా.. ఈ రంగు ఎక్కువ కాలం ఉండడం లేదు.
ప్లేట్లు సైతం నాసిరకం కారణంగా త్వరగా దెబ్బ తింటున్నాయి. సొట్టలు పడుతున్నాయి. విరిగి ముక్కలవుతున్నట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి.
నంబర్ ప్లేట్లు ఆకర్షణీయంగా లేకపోవడం కూడా మరో కారణం. రూ.లక్షల ఖరీదైన వాహనాలు కొనుగోలు చేసి ఇలాంటి నాసిరకం ప్లేట్లు అమర్చుకొనేందుకు ఆసక్తి కనబర్చడంలేదు.
ప్రత్యేకంగా పోర్టల్ ఏర్పాటు..
సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు ప్రస్తుతం పాత, కొత్త వాహనాలకు హెచ్‌ఎస్‌ఆర్‌పీ అనివార్యమైంది.
మరోవైపు హెచ్‌ఎస్‌ఆర్‌పీ లేని వాహనాలకు అన్ని రకాల పౌరసేవలను నిలిపివేయనున్నట్లు ఆర్టీఏ హెచ్చరిస్తోంది.
ఈ క్రమంలో పాత వాహనాలకు ఏర్పాటు చేసుకొనేందుకు వాహనదారులు సయమ్ (ఎస్‌ఐఏఎం) వెబ్ పోర్టల్‌లో దరఖాస్తు చేసుకొనే సదుపాయం ఉంది.
ఈ పోర్టల్‌లో తమ సమీపంలోని షోరూమ్‌ను ఎంపిక చేసుకోవచ్చు.
నమోదైన స్లాట్ ప్రకారం వెళ్లి నంబర్ ప్లేట్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు.
కొత్తవాహనాలకు మాత్రం బండి రిజి్రస్టేషన్ సమయంలోనే ప్లేట్లను బిగిస్తారు.