
స్థిరాస్తి విక్రయాలకు సంబంధించి ఆదాయపు పన్ను శాఖకు చెల్లించాల్సిన లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ (ఎల్‌టీసీజీ) ట్యాక్స్ ఎగవేయాలని పథకం వేసిన హైదరాబాద్ వ్యాపారి కొన్ని నకిలీ బిల్లులు సృష్టించారు. రూ.21.6 లక్షలు చెల్లించాల్సిన చోట రూ.7200 చెల్లిస్తే చాలన్నట్లు తయారు చేశారు. ఓ బిల్లులోని ఫాంట్‌పై అనుమానం వచ్చిన ఐటీ అధికారులు ఏఐ టూల్ వినియోగించారు. ఈ నేపథ్యంలో ఆ బిల్లుపై ఉన్న తేదీ నాటికి మైక్రోసాఫ్ట్ ఆఫీస్‌లో ఆ ఫాంట్ లేదని నివేదిక వచ్చింది. దీని ఆధారంగా ఐటీ అధికారులు సదరు వ్యాపారికి నోటీసులు ఇచ్చి ప్రశ్నించారు. గత్యంతరం పరిస్థితుల్లో సదరు వ్యాపారి రూ.21.6 లక్షలు చెల్లించి కేసు నుంచి బయటపడాల్సి వచ్చింది.
హైదరాబాద్‌లోని ఆదాయపు పన్ను శాఖ కార్యాలయం కేంద్రంగా జరిగిన ఈ వ్యవహారం పూర్వాపరాలు ఇలా... ఆదాయపు పన్ను శాఖ నిబంధనల ప్రకారం ఎల్‌టీసీజీ ద్వారా వచ్చే లాభంలో 30 శాతం పన్నుగా చెల్లించాలి. అయితే ఈ మొత్తాన్ని మరో స్థిరాస్తి పైన లేదా దాని అభివృద్ధి కోసం వెచ్చిస్తే ఆ మొత్తానికి మినహాయింపు పొందవచ్చు. హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యాపారి 2000కు ముందు రూ.68 లక్షలు వెచ్చించి శివార్లలో ఉన్న ఓ పాత ఇంటిని ఖరీదు చేశారు. దీనికి మరమ్మతులు చేసి అదనపు హంగులు చేర్చారు. దీంతో పాటు రియల్ ఎస్టేట్ బూమ్ కారణంగా రూ.1.4 కోట్లకు విక్రయించారు. ఇలా సదరు స్థిరాస్తి విక్రయం ద్వారా 2002లో రూ.72 లక్షలు లాభం పొందారు. దీనిపై క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్‌గా రూ.21.6 లక్షలు చెల్లించాల్సి ఉంది.
అయితే 2002–08 మధ్య తనకు చెందిన మరో ఇంటి అభివృద్ధి కోసం రూ.71 లక్షలకు పైగా వెచ్చించినట్లు నకిలీ బిల్లులు సృష్టించారు. వీటిని ఆదాయపు పన్ను శాఖకు సమర్పిస్తూ చేస్తూ తనకు క్యాపిటల్ గెయిన్‌గా కేవలం రూ.24 వేలు మిగిలినట్లు చూపించారు. ఇందులో 30 శాతం యడం ద్వారా ఆ మేరకు మినహాయింపు పొంది మిగిలిన రూ.7200 చెల్లించారు. ఈ వ్యవహారాన్ని సందేహించిన ఆదాయపు పన్ను శాఖ అధికారులు సదరు వ్యాపారికి నోటీసులు జారీ చేస్తుండగా దానికి ఆయన నుంచి సమాధానాలు వెళ్తున్నాయి. ఇలా దాదాపు 16 ఏళ్లుగా వీరి మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు నడిచాయి.
ఈ బిల్లుల్లోని లోటుపాట్లను గుర్తించడానికి ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఏఐ టూల్ వినియోగించారు. వ్యాపారి సమర్పించిన బిల్లుల్లో 2002 జూలై 6 తేదీతో రూ.7.6 లక్షలది కూడా ఉంది. దీన్ని విశ్లేషించిన ఏఐ టూల్ అందులోని ఫాంట్‌లో ఉన్న లోపాన్ని ఎత్తి చూపింది. ఆ బిల్లు మైక్రోసాఫ్ట్ ఆఫీస్‌లోని కాలిబ్రి అనే ఫాంట్‌తో ముద్రించి ఉంది. డిజిటల్ సాన్స్–సెరిఫ్ టైప్ ఫేస్ ఫాంట్ అని గుర్తించిన ఏఐ టూల్ మరికొన్ని కీలకాంశాలను బయటపెట్టింది.
దీన్ని 2002–2004 మధ్య డచ్ డిజైనర్ లూకాస్ డి గ్రూట్ రూపొందించారని, 2006లో విండోస్ విస్టాతో ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారని తేల్చింది. మైక్రోసాఫ్ట్ ఆఫీస్‌లో ఆ ఫాంట్ 2007 నుంచి మాత్రమే అందుబాటులోకి వచ్చినట్లు స్పష్టం చేసింది. వర్డ్‌లో టైమ్స్ న్యూ రోమన్‌ని, పవర్‌పాయింట్, ఎక్సెల్, ఔట్‌లుక్‌ల్లో ఏరియల్‌న ఫాంట్‌కి బదులు ఇది అందుబాటులోకి వచ్చినట్లు ఆ టూల్ నివేదించింది. కంప్యూటర్ ప్రపంచంలోకి 2006లో అందుబాటులోకి వచ్చిన ఫాంట్‌తో 2002లో బిల్లు ముద్రితం కావడం అసాధ్యమని స్పష్టం చేసింది. ఈ నివేదిక ఆధారంగా ఐటీ అధికారులు సదరు వ్యాపారికి మరోసారి నోటీసులు జారీ చేశారు. దీంతో గత్యంతరం లేక ఆ వ్యాపారి మొత్తం రూ.21.6 లక్షలు చెల్లించిన అధికారులకు క్షమాపణ చెప్పి వెళ్లారు.
- శ్రీరంగం కామేష్