Secunderabad Railway Station: 9 గంటలు.. కలకలం

Agnipath scheme: Protest Turn Violent in Secunderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌/సికింద్రాబాద్‌: త్రివిధ దళాల్లో రిక్రూట్‌మెంట్‌ కోసం కేంద్ర ప్రభుత్వంప్రవేశపెట్టిన అగ్నిపథ్‌ సెగ రాష్ట్రానికీ తాకింది. శుక్రవారం ఉదయం పెద్ద సంఖ్యలో అభ్యర్థులు సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ను ముట్టడించారు. రైలు పట్టాలపై ఆందోళనకు దిగారు. వారిని చెదరగొట్టేందుకు రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ (ఆర్‌పీఎఫ్‌) పోలీసులు లాఠీచార్జికి దిగారు. దీనితో ఆందోళనకారులు విధ్వంసానికి దిగారు. ఆరు ప్లాట్‌ఫామ్స్‌పై దుకాణాలు సహా ప్రతీ దాన్ని ధ్వంసం చేస్తూ వెళ్లారు. రైళ్లపై రాళ్లు రువ్వారు. కొన్ని బోగీలకు నిప్పుపెట్టారు. వారిని నియంత్రించేందుకు ఆర్‌పీఎఫ్‌ పోలీసులు కాల్పులు జరిపారు. దీనితో వరంగల్‌ జిల్లాకు చెందిన రాకేశ్‌ అనే యువకుడు మృతి చెందగా.. మరో 13 మందికి గాయాలయ్యాయి. ఒక పోలీస్‌ కానిస్టేబుల్‌ కూడా గాయపడ్డారు.

శుక్రవారం ఉదయం 9.30 గంటలు
సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో (మౌలాలి వైపు) రేతిఫైల్‌ బస్‌స్టేషన్‌ వెనుక ఉన్న రైల్వేట్రాక్‌పైకి ఒక్కసారిగా 100 మంది ఆందోళనకారులు వచ్చారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ పరీక్ష యథాతథంగా నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. 

9.40 గంటలు
ఆందోళనకారులను చెదరగొట్టేందుకు జీఆర్‌పీ, ఆర్‌పీఎఫ్‌ పోలీసులు లాఠీచార్జి చేశారు. అదే సమయంలో ఒకటో నంబర్‌ ప్లాట్‌ఫామ్‌లోని అన్ని ప్రవేశ ద్వారాల నుంచి ఒక్కసారిగా వందల మంది ఆందోళనకారులు రైల్వేస్టేషన్‌లోకి చొచ్చుకు వచ్చి విధ్వంసం సృష్టించడం మొదలుపెట్టారు.

చదవండి: (సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దాడి వెనక సంచలన విషయాలు) 

10:15
దాదాపు 25 నిమిషాల్లోనే.. ఒకటి నుంచి 6వ నంబర్‌ ప్లాట్‌ఫామ్‌ వరకు ప్లాట్‌ఫామ్‌లపై ఉన్న యంత్రాలు, దుకాణాలను ధ్వంసం చేశారు. గూడ్స్‌ రైళ్లలో పంపేందుకు ఉంచిన పార్శిల్‌ కార్యాలయానికి చెందిన ప్యాకేజీలు, ద్విచక్ర వాహనాలను పట్టాలపై వేసి నిప్పుపెట్టారు. రైలు బోగీలకూ నిప్పంటించారు. 

10:30
ఆందోళనకారులు 6వ నంబర్‌ ప్లాట్‌ఫామ్‌పై విధ్వంసం సృష్టిస్తున్న సమయంలో ప్రత్యేక పోలీసు బృందాలు రైల్వేస్టేషన్‌లోకి ప్రవేశించాయి. వారిని అదుపు చేయడం కోసం కాల్పులు జరిపారు. పలువురు ఆందోళనకారులకు గాయాలయ్యాయి. 

11:00
పోలీసు బృందాలు రైల్వేస్టేషన్‌ ప్లాట్‌ఫామ్‌ల నుంచి
ఆందోళనకారులను బయటకు తరిమాయి. దీనితో వారంతా మౌలాలి వైపున్న రైల్వేట్రాక్‌పైకి చేరుకుని.. పోలీసులపై రాళ్లు రువ్వుతూ ఆందోళన కొనసాగించారు.

మధ్యాహ్నం 12.00 గంటలు
హైదరాబాద్‌ అదనపు సీపీ శ్రీనివాస్, జాయింట్‌ సీపీ రంగనాథ్, డీసీపీ చందనాదీప్తి, అదనపు డీసీపీ వెంకటేశ్వర్లు రైల్వేస్టేషన్‌కు చేరుకుని పరిస్థితులను సమీక్షించారు.

2.00 గంటలు
ఆందోళనకారులతో పోలీసు అధికారులు చర్చలు ప్రారంభించారు. ఆందోళనకారుల నుంచి ఇద్దరు ప్రతినిధులు వస్తే ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ఆఫీసర్‌ కార్యాలయానికి తీసుకెళ్లి చర్చిద్దామని సూచించారు. కానీ ఆందోళనకారులు ముందుకు రాలేదు. ఆర్మీ అధికారి వచ్చి రాత పరీక్ష తేదీ ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. పోలీసుల చర్చల ప్రయత్నాలను కొనసాగించారు. అదే సమయంలో రైల్వేస్టేషన్‌ చుట్టూ భారీ సంఖ్యలో బలగాలను సిద్ధం చేశారు. 

చదవండి: (అగ్నిపథ్‌ నిరసనలు.. విశాఖ రైల్వేస్టేషన్‌ మూసివేత) 

6.15 గంటలు
ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌ సహా పలు విభాగాలకు చెందిన వందల మంది పోలీసులు అన్నివైపుల నుంచి రైల్వేస్టేషన్‌లోకి చొచ్చుకువచ్చారు. ఆందోళనకారులను చుట్టుముట్టి అదుపులోకి తీసుకుని వివిధ పోలీస్‌స్టేషన్లకు తరలించారు. 

7.00 గంటలు
రైల్వే అధికారులు, సిబ్బంది స్టేషన్‌లో పరిస్థితిని చక్కదిద్దే ఏర్పాట్లు మొదలుపెట్టారు. పట్టాలపై వేసిన వాహనాలు, ఇతర సామగ్రిని తొలగించడం వంటి చర్యలు చేపట్టారు. 

రాత్రి 08.30 గంటలు
రైల్వేస్టేషన్‌ నుంచి రైళ్ల రాకపోకలు తిరిగి ప్రారంభంఅయ్యాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top