72 ఏళ్ల వృద్ధురాలు... 23 రోజులు ‘డిజిటల్‌ అరెస్ట్‌’! | 72 Year Old Woman Digitally Arrested for Over a Month | Sakshi
Sakshi News home page

72 ఏళ్ల వృద్ధురాలు... 23 రోజులు ‘డిజిటల్‌ అరెస్ట్‌’!

Oct 13 2026 12:23 PM | Updated on Oct 13 2026 12:36 PM

72 Year Old Woman Digitally Arrested for Over a Month

సాక్షి, సిటీబ్యూరో: సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ), క్రైమ్‌ బ్రాంచ్‌ అధికారులమంటూ వీడియో కాల్స్‌ చేసి.. మనీలాండరింగ్‌ కేసులో ఇరుక్కున్నారని బెదిరించి.. అరెస్టు చేస్తామంటూ భయపెట్టి ఓ 72 ఏళ్ల వృద్ధురాలిని సైబర్‌ కేటుగాళ్లు నెల రోజుల పాటు డిజిటల్‌ అరెస్టులో ఉంచారు. బెయిల్‌ బాండ్‌ సహా వివిధ పేర్లు చెప్పి ఏకంగా రూ.2.12 కోట్లు కాజేశారు. ఈ మేరకు సోమవారం కేసు నమోదు చేసిన హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

నాంపల్లిలోని రెడ్‌హిల్స్‌ ప్రాంతంలో నివసించే రిటైర్డ్‌ ప్రభుత్వ ఉద్యోగిని (72) బాధితురాలిగా ఈ మోసం  గత నెల 7 నుంచి 30 వరకు కొనసాగింది. బాధితురాలికి గత నెల 5న గుర్తుతెలియని నంబర్‌ నుంచి ఫోన్‌ వచ్చింది. టెలికమ్యూనికేషన్స్‌ శాఖ ప్రతినిధినని చెప్పిన వ్యక్తి.. ఆమె మొబైల్‌ నంబర్‌ను అక్రమ కార్యకలాపాలకు వినియోగించారని పేర్కొన్నాడు. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారి మాట్లాడతారని చెప్పి మరో వ్యక్తితో వీడియో కాల్‌లో మాట్లాడించారు.

తాను ముంబై క్రైమ్‌ బ్రాంచ్‌ అధికారి కరణ్‌ శర్మ అంటూ పరిచయం చేసుకున్న ఆ వ్యక్తి జెట్‌ ఎయిర్‌వేస్‌ వ్యవస్థాపకుడు నరేశ్‌ గోయల్‌కు సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో అనుమానితురాలిగా పరిగణిస్తున్నట్లు బాధితురాలితో చెప్పాడు. ఆమె పేరుతో కెనరా బ్యాంకు ఖాతా, ఏటీఎం కార్డు ఉన్నాయని, ఆ ఖాతా ద్వారా రూ.2 కోట్లు బదిలీ అయ్యాయని ఆరోపించాడు. 

ఆ ఖాతాను వినియోగించుకునేందుకు అనుమతించి 10 శాతం కమీషన్‌ పొందారనీ భయపెట్టాడు. తనకు ఆ వ్యవహారంతో సంబంధం లేదని బాధితురాలు చెప్పినా నిందితులు వినిపించుకోలేదు. అరెస్టు చేస్తామని, బ్యాంకు ఖాతాలు, ఆస్తులు స్తంభింపజేస్తామని బెదిరించారు. ఈ వీడియో కాల్‌ కట్‌ చేయకూడదని, ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేయకూడదని, ఈ విషయం ఎవరికీ చెప్పకూడదని ఆదేశించారు. మొబైల్‌ను ఛార్జింగ్‌ పెట్టి నిరంతరం అందుబాటులో ఉండాలని కూడా స్పష్టం చేశారు. 

తమ మాటలు నిజమని నమ్మించేందుకు సీబీఐ, ఈడీ, ముంబై క్రైమ్‌ బ్రాంచ్, ఇంటర్‌పోల్, సుప్రీంకోర్టు పేర్లతో పలు పత్రాలు పంపాడు. వాటిలో అరెస్టు ఆదేశాలు, గోప్యత ఒప్పందాలు, ఖాతాల నిలుపుదల ఉత్తర్వులు, కోర్టు నోటీసులుగా కనిపించే పత్రాలు ఉన్నాయి. నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలంటే లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని, ఆధార్‌ కార్డు పంపాలని కోరడంతో బాధితురాలు వాటినీ పంపరు. సెప్టెంబర్‌ 6న 15 ప్రశ్నలతో కూడిన ‘ఇంటరాగేషన్‌ రికార్డు’ను వాట్సాప్‌ ద్వారా పంపిన కేటుగాళ్లు సమాధానాలు రాయాలని ఆదేశించారు. 

దీంతో బాధితురాలు జంగానే దర్యాప్తు జరుగుతోందని నమ్మిన స్వదస్తూరీతో సమాధానాలు పంపారు. ఇదిలా ఉండగా... జార్జ్‌ మాథ్యూస్‌గా చెప్పుకున్న వ్యక్తి ఆర్థిక లావాదేవీల బాధ్యతలు తీసుకున్నట్లు కేటుగాళ్లు చెప్పారు. ఓపక్క కరణ్‌ శర్మగా చెప్పుకున్న వ్యక్తి విచారణ పేరుతో బాధితురాలితో మాట్లాడుతుండగా, జార్జ్‌ మాథ్యూస్‌గా చెప్పుకున్న వాడు ఏ ఖాతాకు ఎంత మొత్తం బదిలీ చేయాలన్నది సూచించాడు. తాము చెప్పిన డబ్బులు బదిలీ చేస్తే 48 నుంచి 72 గంటల్లో తిరిగి ఇస్తామని నమ్మించాడు. 

దీంతో బాధితురాలు సెప్టెంబర్‌ 7న స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఖాతా నుంచి ‘గోపికా వాస్దేవ్‌ మెమోరియల్‌ సొసైటీ’ పేరుతో ఉన్న బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఖాతాకు రూ.93.70 లక్షలు బదిలీ చేశారు. కేటుగాళ్లు నగదు అందినట్లు ప్రభుత్వ రసీదు మాదిరిగా ఓ పత్రాన్ని తయారు చేసి పంపారు. మరుసటి రోజు రూ.24.70 లక్షలకు సంబంధించిన మరో రసీదును కూడా పంపారు. ఈ పత్రాలపై ఈడీ, భారత ప్రభుత్వం, సుప్రీంకోర్టు పేర్లు కూడా ఉన్నాయి. ఆ తర్వాత ‘చట్ట అమలు సంస్థల తనిఖీ కోసం ఆస్తుల సమర్పణ’ అనే పేరుతో మరిన్ని పత్రాలు పంపి వేర్వేరు బ్యాంకు ఖాతాలకు డబ్బులు బదిలీ చేయాలని చెప్పారు. ఆ ఖాతాలు ఆర్‌ఎన్‌ఎంకే సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, శ్రీమతి ప్రభావతి దేవి చారిటబుల్‌ ట్రస్ట్, ఆల్‌ కచార్‌ ఎలక్ట్రిక్‌ ఆటో ఓనర్‌ అండ్‌ డ్రైవర్‌ అసోసియేషన్, హిలాక్సీ ఫౌండేషన్‌ పేర్లతో ఉన్నాయి.

 సెప్టెంబర్‌ 21 తేదీతో ‘బెయిల్‌ బాండ్‌’ పేరుతో మరో పత్రాన్ని సైబర్‌ నేరగాళ్లు బాధితురాలికి పంపారు. బెయిల్‌ కోసం రూ.30 లక్షలు చెల్లించాలంటూ మొత్తం మూడుసార్లు డిమాండ్‌ చేసి రూ.90 లక్షలు స్వాహా చేశారు. ఇలా సెప్టెంబర్‌ 7 నుంచి 30 వరకు ‘డిజిటల్‌ అరెస్టు’లో ఉండి మొత్తం పది లావాదేవీల్లో రూ.2,12,51,000 స్వాహా చేశారు. ఈ మొత్తంలో కొంత బాధితురాలు తన బంగారం అమ్మి కూడా చెల్లించారు.

 జార్జ్‌ మాథ్యూస్‌గా చెప్పుకున్న వ్యక్తి తనతో మాట్లాడేటప్పుడు ‘ఎంపీఎన్‌సీ 105’ అనే రహస్య కోడ్‌ను ఉపయోగించాలని చెప్పినట్లు బాధితురాలు పేర్కొన్నారు. అక్టోబర్‌ 2న ‘ప్రదీప్‌’ పేరుతో సేవ్‌ చేసుకోవాలని మరో మొబైల్‌ నంబర్‌ ఇచ్చారని, అయితే ఆ నంబర్‌కు తాను ఫోన్‌ చేయలేదని పేర్కొన్నారు. అక్టోబర్‌ 3న బాధితురాలితో ఆఖరుసారిగా మాట్లాడిన జార్జ్‌ మాథ్యూస్‌ అనే వ్యక్తి ఆపై స్పందించలేదు. దీంతో బాధితురాలు గూగుల్‌లో వెతికి తాను ‘డిజిటల్‌ అరెస్ట్‌’ పేరుతో జరుగుతున్న సైబర్‌ మోసానికి గురైనట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కామేష్‌
క్రైమ్‌ రిపోర్టర్‌,సాక్షి  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement