అక్షరాలా లక్ష టన్నులు

60,000 Trucks Wastage Of Secretariat Hyderabad - Sakshi

60 వేల ట్రక్కులకు సరిపడా సచివాలయ భవనాల కూల్చివేత వ్యర్థాలు

పునర్వినియోగానికి వీలుగా రాంకీ రీసైక్లింగ్‌ యూనిట్లకు చేరవేత

నెల రోజులుగా నిత్యం వంద ట్రక్కులతో తరలింపు.. మరో పక్షం రోజులపాటు కొనసాగే అవకాశం

సాక్షి, హైదరాబాద్‌: ఎంతోమంది ముఖ్యమంత్రుల అధికారిక కార్యకలాపాలకు వేదిక. ఎన్నో కీలక నిర్ణయాలకు సాక్షి. పాలనాపరమైన సంస్కరణలకు కేంద్ర బిందువు, ఎంతోమంది సమస్యల పరిష్కారానికి నెలవు. రెండు తెలుగు రాష్ట్రాలు ఒక్కటిగా ఉండగా ప్రధాన పరిపాలన కేంద్రం. అదే సచివాలయం. కొత్త సచివాలయాన్ని వాగ్దానం చేస్తూ ఇటీవల కాలగర్భంలో కలిసిపోయింది. హుస్సేన్‌సాగర్‌ తీరంలో ప్రశాంతంగా కనిపించే సచివాలయ భవన సముదాయం ఇప్పుడు మట్టిదిబ్బగా మారింది. కొత్త భవనం కోసం నెల క్రితం ప్రభుత్వం పాత భవనాల సముదాయాన్ని  కూల్చేసిన సంగతి తెలిసిందే. కూల్చి వేతలు చాలా వేగంగానే సాగాయి. మధ్యలో భారీ వర్షాల వల్ల కొంత ఇబ్బంది కలిగింది. వ్యర్థాల తరలింపు గత నెలరోజులుగా సాగుతోంది. తరలింపు మరో పక్షం రోజులు పట్టే అవకాశముంది.

కూల్చివేతతో ఏర్పడ్డ వ్యర్థాల పరిమాణం ఏకంగా లక్ష టన్నులు ఉండటమే దీనికి కారణం. ఇంతవరకు నగరంలో ఒకచోట లక్ష టన్నుల పరిమాణంలో కూల్చివేత వ్యర్థాలు ఏర్పడటం ఇదే ప్రథమం. ఆ వ్యర్ధాలను తొలుత నగర శివారులోని క్రషర్ల వల్ల ఏర్పడ్డ భారీ గోతులలో వేయాలని భావించారు. క్రషర్ల గోతులతో ఎన్నో ఇబ్బందులు రావటమే కాకుండా పర్యావరణం పరంగానూ అవి సమస్యలకు కారణమవుతున్నాయి. వాటిని పూడ్చాలంటే భారీ పరిమాణంలో మట్టి అవసరం. అంత మట్టి దొరకక గోతులు అలాగే ఉన్నాయి. సచివాలయ కూల్చివేత వ్యర్థాలతో వాటిని పూడ్చాలని భావించినా.. ఆ తర్వాత అధికారులు మనసు మార్చుకున్నారు. వ్యర్థాలను పునర్వినియోగంలోకి తేవాలని నిర్ణయించి, నగర శివారులో ఉన్న రాంకీ సంస్థ ఆధ్వర్యంలోని రీసైక్లింగ్‌ యూనిట్లకు తరలిస్తున్నారు. 

60 వేల ట్రక్కుల లోడ్‌..: ఏకంగా లక్ష టన్నుల వ్యర్థాలు ఏర్పడటంతో వాటి తరలింపు పెద్ద సమస్యగా మారింది. ఆ వ్యర్థాలు ఏకంగా 60 వేల ట్రక్‌ లోడ్ల పరిమాణంలో ఉండటమే దీనికి కారణం. నెల రోజులుగా నిత్యం వంద ట్రక్కులతో దీన్ని రీసైక్లింగ్‌ యూనిట్లకు తరలిస్తున్నారు. ఇందుకు ప్రభుత్వం రాంకీ సంస్థకు ఒక టన్నుకు రూ.91 చొప్పున ఛార్జీ కూడా చెల్లిస్తోంది. ఆ వ్యర్థాల నుంచి మళ్లీ వినియోగించే సామగ్రిని రాంకీ సంస్థ రూపొందిస్తోంది. వాటిని కొత్త సచివాలయ నిర్మాణంలో వినియోగించాలా వద్దా అన్న విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. నగరంలో ప్రస్తుతం ఇసుక లభించటం కష్టంగా మారింది.

దీంతో కూల్చివేత వ్యర్థాల నుంచి భారీ మొత్తంలో పునర్వినియో గించేలా ఇసుకను రూపొందిస్తున్నారు. దాన్ని ప్రధాన నిర్మాణాల్లో కాకుండా అనుబంధ నిర్మాణాలకు వినియోగిస్తారు. ప్రధాన నిర్మాణాలకు కూడా ప్లాస్టరింగ్‌కు వినియోగిస్తారు. వ్యర్థాలలోని ఇనుము, ప్లాస్టిక్‌ను కూడా పునర్వినియోగించేలా మారుస్తున్నారు. ప్రహరీలు, ఇతర నిర్మాణాలకు కావాల్సిన భారీ ప్రీ ఫ్యాబ్రికేటెడ్‌ బ్లాక్‌లను కూడా రూపొందిస్తున్నారు. ఇక ఫుట్‌పాత్‌లు, ఫ్లోరింగ్‌కు వాడుకునేలా జీఎస్‌బీ మెటీరియల్, ఫుట్‌పాతలపై పరిచే ఇంటర్‌లాకింగ్‌ టైల్స్‌ తయారు చేస్తున్నారు.

95 శాతం వ్యర్థాలు పునర్వినియోగం..
కూల్చివేత వ్యర్థాల్లో 95 శాతం వరకు మెటీరియల్‌ పునర్వినియోగానికి వీలుగా ఉంటుంది. ఐదు శాతం మాత్రం సిల్ట్‌గా వృథా అవుతుంది. ఇక నిర్మాణంలో మంచి నాణ్యమైన మెటీరియల్‌ ఉంటే పునర్వినియోగ మెటీరియల్‌ 98 శాతం వరకు ఉంటుందని రాంకీ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. సచివాలయ వ్యర్థాలS నుంచి 98 శాతం వరకు రీసైక్లింగ్‌ మెటీరియల్‌ ఉంటుందన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top