
దాంతోపాటే నోటిఫికేషన్ కూడా..
బీసీలకు 42% రిజర్వేషన్ల కల్పన జీవో జారీ చేసిన ప్రభుత్వం
స్థానిక ఎన్నికల నిర్వహణకు ఆదేశిస్తూ ఎస్‌ఈసీకి లేఖ
15 నుంచి 18 రోజుల్లోనే ఎన్నికలు నిర్వహించాలన్న సర్కారు!
పీఆర్ శాఖ అన్ని ఏర్పాట్లూ చేసుకోవాలన్న ముఖ్యమంత్రి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో స్థానిక ఎన్నికల దిశగా కీలక ముందడుగు పడింది. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ జీవో ఆధారంగా వెంటనే స్థానిక ఎన్నికల నిర్వహణకు చర్యలు చేపట్టింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశం తెలియజేయడంతో పాటు వచ్చే 15 నుంచి 18 రోజుల్లో ఈ ఎన్నికలు నిర్వహించాలని ఆదేశిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్‌ఈసీ)కు ప్రభుత్వం లేఖ (కాంకరెన్స్) పంపించినట్టు విశ్వసనీయ సమాచారం. ఈ ఆదేశాలకు అనుగుణంగా ఎస్‌ఈసీ శనివారం ఒకేసారి ఎన్నికల షెడ్యూల్, నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది.
నేడు ఎస్‌ఈసీ కీలక భేటీ
శనివారం ఉదయం 11 గంటలకు ఎన్నికల ఏర్పాట్లపై ఎస్‌ఈసీ కార్యాలయంలో సీఎస్, డీజీపీ, పీఆర్, రెవెన్యూ, ఇతర శాఖల ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో కమిషనర్ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో అన్ని అంశాలపై పూర్తి స్పష్టత వచ్చాక, ఎన్ని విడతల్లో ఎన్నికలు నిర్వహించాలనే దానిపై నిర్ణయం తీసుకుని, సాయంత్రానికల్లా ఎన్నికల షెడ్యూల్, నోటిఫికేషన్ విడుదల చేస్తారని సమాచారం. షెడ్యూల్ విడుదలైతే వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో (హైదరాబాద్, మేడ్చల్ పట్టణ జిల్లాలు మినహా) ఎన్నికల ప్రవర్తనా నియమావళి (ఎలక్షన్ కోడ్) అమల్లోకి వస్తుంది.
అదే జరిగితే మూడురోజుల వ్యవధిలోనే అభ్యర్థుల నుంచి నామినేషన్లను స్వీకరిస్తారని తెలుస్తోంది. గ్రామ పంచాయతీల వారీగా, వార్డుల వారీగా ఫొటోలతో కూడిన ఓటర్ల జాబితాలు ఎస్‌ఈసీ వెబ్‌సైట్ ‘టీ–పోల్’లో ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. ఎన్నికల విధులపై సిబ్బందికి శిక్షణా కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. బ్యాలెట్ పేపర్ల ముద్రణకు చేయాల్సిన ఏర్పాట్లతో పాటు బ్యాలెట్ బాక్సులు సమకూర్చుకోవడం వంటి ఏర్పాట్లకూ ఎస్‌ఈసీ గతంలోనే చర్యలు చేపట్టింది. బ్యాలెట్ బాక్స్‌లు భద్రపరచడం, కౌంటింగ్ కేంద్రాలు, పోలీసు భద్రత తదితరాలపై కసరత్తు పూర్తిచేసింది.
ఏ ఎన్నికలు ముందు?
మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు ముందు నిర్వహిస్తారా? లేక గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తారా? అన్న దానిపై ప్రభుత్వ పరంగా పూర్తి స్పష్టత రావాల్సి ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నందున..వాటి ద్వారా రాజకీయంగా లబ్ధి పొందేందుకు వీలుగా తొలుత పార్టీ గుర్తులపై జరిగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరిపేందుకే మొగ్గుచూపొచ్చని సమాచారం. ఈ ఎన్నికలు ముగిశాక వారం రోజుల వ్యవధిలోనే గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది.
శుక్రవారం సీఎం రేవంత్‌రెడ్డితో పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్.శ్రీధర్, పీఆర్‌ఆర్‌డీ డైరెక్టర్ జి.సృజన సమావేశమయ్యారు. శాఖా పరంగా స్థానిక ఎన్నికలకు అన్ని ఏర్పాట్లూ చేసుకోవాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆదేశించారు.
డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్‌లతో ఎస్‌ఈసీ సమావేశం
మరోవైపు ఎస్‌ఈసీ కార్యాలయంలో డీజీపీ జితేందర్‌తో నిర్వహించిన సమావేశంలో ఎన్నికల కమిషనర్ రాణీ కుముదిని రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిని సమీక్షించారు. అంతా సవ్యంగానే ఉందని, ఎన్నికల బందోబస్తు, ఇతర అవసరాలకు ప్రస్తుతం తమ వద్ద అందుబాటులో ఉన్న పోలీస్ ఫోర్స్ సరిపోతుందని, అదనపు బలగాలు అవసరం లేదని డీజీపీ చెప్పినట్టు సమాచారం.
గతంలో మూడు దశల్లో వేర్వేరుగా గ్రామపంచాయతీ, మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు నిర్వహించారంటూ..ఈసారి ఎన్ని విడతల్లో నిర్వహిస్తే మంచిదని కమిషనర్ ఆరా తీసినట్టు తెలిసింది. రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్‌రెడ్డితోనూ విడిగా భేటీ అయిన కమిషనర్..పలు అంశాలపై సమాచారాన్ని అడిగి తెలుసుకున్నట్టు తెలిసింది. శివధర్‌రెడ్డి కొత్త డీజీపీగా బాధ్యతలు స్వీకరించనున్న నేపథ్యంలో ఆయనతోనూ ఎస్‌ఈసీ సమావేశమైనట్టు తెలిసింది.
తొలుత విద్య, ఉపాధి రంగాలకు సంబంధించి జీవో
ముందుగా విద్య, ఉపాధి రంగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్లపై బీసీ సంక్షేమ శాఖ ఒక నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. ఈ నివేదిక ఆధారంగా ప్రభుత్వం జీఏడీ ద్వారా ఓ జీవో విడుదల చేయగా, దీని ఆధారంగా వెంటనే పీఆర్ శాఖ ద్వారా స్థానిక సంస్థల్లో బీసీలకు రాజకీయంగా 42% రిజర్వే షన్లు కలి్పస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఇందుకు అనుగుణంగా ఏజిల్లాకు ఆ జిల్లాలో కలెక్టర్లు గెజిట్‌లు విడుదల చేస్తే స్థానిక ఎన్నికల నిర్వహణకు మార్గం సుగమం కానుంది.
ఏయే స్థానాలకు ఎన్నికలు
హైదరాబాద్, మేడ్చల్ అర్బన్ జిల్లాలు మినహా 31 జిల్లా ప్రజా పరిషత్ (జెడ్పీపీలు)లకు.. 565 జెడ్పీటీసీ స్థానాలకు (ములుగు జిల్లా
మంగపేట మండలం జెడ్పీటీసీ స్థానంపై కోర్టు కేసు కారణంగా స్టే) 565 మండల ప్రజా పరిషత్‌లకు (మంగపేట మండలంపై కోర్టు కేసు కారణంగా ఎంపీపీ, దాని పరిధిలోని ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికపై స్టే) ఎంపీటీసీ స్థానాలు 5,763 , గ్రామపంచాయతీలు– 12,760 ,వార్డుల సంఖ్య 1,12,534
తెలంగాణ ఏర్పాటయ్యాక మొదటిసారిగా 2019లో పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు
జరిగాయి. అప్పుడు ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాలు 570 చొప్పున, ఎంపీటీసీలు 5,817, గ్రామపంచాయతీలు 12,848గా ఉన్నాయి. దీనిని బట్టి చూస్తే ఇప్పుడు ఒక జెడ్పీ, 5 జెడ్పీటీసీ, 5 ఎంపీపీలు, 54 ఎంపీటీసీ స్థానాలు, 185 గ్రామపంచాయతీలు తగ్గాయి. మేడ్చల్–మల్కాజిగిరిలోని మెజారిటీ గ్రామపంచాయతీలు మున్సిపాలిటీల్లో విలీనం కావడంతో గ్రామీణ జిల్లా ఉనికి లేకుండా పోయింది.