– రూ. 8.45 కోట్ల కేటాయింపు
సాక్షి,చైన్నె: తమిళనాడులో పఠనాసక్తిని ప్రోత్సహించేందుకు అన్ని జిల్లాల్లో పుస్తక ప్రదర్శనలు నిర్వహించాలని విద్యాశాఖ కార్యదర్శి జె. ఇన్నోసెంట్ దివ్య ఉత్తర్వు జారీ చేశారు. గతంలో విద్యా పరంగా జిల్లాలను ఎ, బి, సి అనే 3 కేటగిరీలుగా విభజించారు. ఈ మేరకు పుస్తక ప్రదర్శనలు నిర్వహిస్తూ వస్తున్నారు. గతంలో ఏ కేటరిగికి 17.50 లక్షలు, బీ కేటగిరికి 14 లక్షలు, సీ కేటగిరికి రూ.12 లక్షలు కేటాయించేవారు. ఆదిశగా అన్ని జిల్లాలో తాజాగా కూడా పుస్తక ప్రదర్శనల నిర్వహణకు సిద్ధమయ్యారు. ఇందు కోసం రూ. 8.45 కోట్లు కేటాయించారు. పబ్లిక్ లైబ్రరీ డైరెక్టర్ ఈ నిధిని జిల్లా ఖజానాల నుండి ముందస్తుగా స్వీకరించి ముందస్తు చర్లయు, పుస్తక పరిశీలన, తనిఖీలు నిర్వహించవచ్చనని ఆ ఉత్తర్వులలో పేర్కొన్నారు.
తట్టంచవాడి ఎమ్మెల్యేగా అశోక్ ఆనంద్ ప్రమాణ స్వీకారం
సాక్షి, చైన్నె : పుదుచ్చేరిలో తట్టంచవాడి ఉప ఎన్నికలో గెలుపొందిన ఎన్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అశోక్ ఆనంద్ బుధవారం సీఎం రంగస్వామి సమక్షంలో శాసనసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన చేత తాత్కాళిక స్పీకర్ అన్భళగన్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఏప్రిల్లో జరిగిన అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల్లో, సీఎం రంగస్వామి తట్టంచవాడి , మంగళం అనే రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఇందులో, తట్టంచవాడి నియోజకవర్గం నుంచి తప్పుకుంటూ సీఎం రంగస్వామి రాజీనామా చేయడంతో ఈనెల 6న ఉప ఎన్నిక జరిగింది. ఇందులో అశోక్ ఆనంద్ (ఎన్ఆర్ కాంగ్రెస్)కు 13,350 ఓట్లు, వినాయగం (కాంగ్రెస్)కు 4,876 ఓట్లు రాగా, ఎన్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి అశోక్ ఆనంద్ 8,474 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
ప్రమాణ స్వీకారం
పుదుచ్చేరి శాసనసభ ప్రాంగణంలో బుధవారం సీఎం రంగస్వామి సమక్షంలో తాత్కాలిక స్పీకర్ అన్బళగన్ ఎమ్మెల్యేగా ఎన్నికై న అశోక్ఆనంద్చేత ప్రమాణ స్వీకారం చేయించారు. సీఎం రంగస్వామి, మంత్రులు, ఎమ్మెల్యేలు, సంకీర్ణ పార్టీ నాయకుల సమక్షంలో అశోక్ ఆనంద్ కొత్త ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. సీఎంతో సహా అందరూ ఆయనను శాలువ కప్పి అభినందించారు.ఈ ప్రమాణ స్వీకారంతో అశోక్ ఆనంద్ మూడోసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు.
కేంద్ర మంత్రి వర్గంలోకి నైనార్ నాగేంద్రన్?
సాక్షి, చైన్నె : కేంద్ర సమాచార ప్రసార, పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి ఎల్. మురుగన్ ఆకస్మిక రాజీనామా తమిళనాట రాజకీయంగా చర్చకు దారి తీసింది. మంత్రి పదవితో పాటు తన రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటన చేయడంతో దీని వెనుక బలమైన కారణాలు ఉండవచ్చు అన్న ప్రశ్న తెర మీదకు వచ్చింది. తమిళనాడులోని గ్రామాల్లో పర్యటించి ప్రజలకు మరింత సేవ చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొంటున్నా, అధిష్టానం ఆదేశాల మేరకే ఆయన తప్పుకోవాల్సి వచ్చిందన్న ప్రచారం జరుగుతోంది. 2021 నుంచి ఆయన కేంద్ర మంత్రి పదవిలో ఉన్నప్పటికీ , రాష్ట్రంలో పార్టీబ లోపేతానికి కృషి చేసింది అరుదేనన్న ఆరోపణలు ఉన్నాయి. అలాగే, అసెంబ్లీ ఎన్నికలు, లోక్ సభ ఎన్నికలలో సైతం ఆయన ఓటమి పాలైన నేపథ్యంలో అనేక మంది రాష్ట్రానికి చెందిన సీనియర్లు తమ అసంతృప్తిని కొత్త ఇన్చార్జ్ వద్ద వెళ్లగక్కినట్టు సమాచారం. కాగా మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నికై న మురుగన్ పదవీకాలం 2030 ఏప్రిల్ 30 వరకు ఉన్నప్పటికీ, ఆయన ముందస్తుగానే తన ఎంపీ పదవికి రాజీనామా చేయడం గమనార్హం.
కేంద్ర కేబినెట్లో నైనార్ నాగేంద్రన్?
ఎల్. మురుగన్ రాజీనామాతో ప్రస్తుతం కేంద్ర మంత్రివర్గంలో తమిళనాడు నుంచి ప్రాతినిధ్యం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో తమిళనాడు బీజేపీ సీనియర్ నాయకుడు నైనార్ నాగేంద్రన్ కు కేంద్ర మంత్రివర్గంలో అవకాశం కల్పించవచ్చని ప్రచారం జరుగుతోంది. మురుగన్ ఖాళీ చేసిన రాజ్యసభ స్థానం ద్వారా నైనార్ నాగేంద్రన్ను పార్లమెంట్కు పంపి, ఆపై కేంద్ర మంత్రిగా బాధ్యతలు అప్పగించే యోచనలో అధిష్టానం ఉన్నట్లు సమాచారం. ఒకవేళ ఆయన కేంద్ర మంత్రి అయితే, తమిళనాడు బీజేపీకి కొత్త అధ్యక్షుడిని నియమించే అవకాశం ఉంది.


