పుదుచ్చేరిలో దీపావళి ప్యాకేజీ | - | Sakshi
Sakshi News home page

పుదుచ్చేరిలో దీపావళి ప్యాకేజీ

Oct 15 2026 8:30 AM | Updated on Oct 15 2026 8:30 AM

● 3 లక్షల కుటుంబాలకు వర్తింపు ● మంత్రి ప్రకటన

సాక్షి, చైన్నె: పుదుచ్చేరి పౌర సరఫరాలు, సామాజిక సంక్షేమ శాఖ మంత్రి వి.పి. శివకొళుందు అధ్యక్షతన కారైకల్‌ పెరుంతలైవర్‌ కామరాజ్‌ పరిపాలనా భవనంలో బుధవారం జరిగిన సమీక్షా సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పుదుచ్చేరి రాష్ట్రంలోని 3 లక్షల రేషన్‌ కార్డుదారులకు దీపావళి ప్యాకేజీలు అందించనున్నట్లు ప్రకటించారు. ఈ సమావేశంలో పుదుచ్చేరి వ్యవసాయ శాఖ మంత్రి రాజశేఖరన్‌, ప్రతిపక్ష నాయకుడు ఎ.ఎం.హెచ్‌. నజీమ్‌, ఎమ్మెల్యేలు మీనాక్షి సుందరం, వి. విఘ్నేశ్వరన్‌, సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్‌ పి. రాగిణి మరియు శాఖా అధికారులు పాల్గొన్నారు. ముందుగా ప్రతిపక్ష నాయకుడు, ఎమ్మెల్యేలు మాట్లాడుతూ వివిధ శాఖలలో ఖాళీగా ఉన్న పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని, కోసం ఆర్థిక సహాయం కోరుతూ దాఖలైన 157 దరఖాస్తులకు ఇంకా నిధులు కేటాయించలేదని వివరించారు. శాఖా అధికారులు సీనియర్‌ సిటిజన్‌ ప్రయోజనాల దరఖాస్తులను కేవలం సీనియారిటీ ఆధారంగా మాత్రమే పరిగణించకూడదని, సిఫార్సు చేయబడి, ఫార్వార్డ్‌ చేయబడిన దరఖాస్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని వారు డిమాండ్‌చేశారు. అనంతరం మంత్రి వి.పి. శివకొళుందు మాట్లాడుతూ నెల రోజులలో పుదుచ్చేరి రాష్ట్రంలోని అన్ని రేషన్‌ షాపులు తెరుచుకుని, పూర్తిస్థాయిలో పనిచేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాష్ట్రంలో ఎరుపు, పసుపు రంగు కార్డులతో సహా 3 లక్షల రేషన్‌ కార్డుదారులకు రూ. 690 విలువైన దీపావళి పండుగ ప్యాకేజీని అందించనున్నామన్నారు. ఇందులో భాగంగా చెరో రెండు కేజీల చక్కెర, పొద్దుతిరుగుడు నూనె, ఒక కేజీ వేరుశనగ, చెరో అర కేజీ మైదా, అర కిలో రవ్వ ఉంటాయని, వీటిని రేషన్‌ షాపుల ద్వారా పంపిణీ చేస్తామని ఆయన తెలిపారు.

ప్రతిపక్ష నేత ఆసక్తికర వ్యాఖ్య..

కాగా, సమావేశంలో ప్రతిపక్ష నాయకుడు నజీమ్‌ మాట్లాడుతూ, ‘‘కారైకల్‌కు చెందిన మహిళ నాగై, మైలాడుతురై వంటి సమీప తమిళనాడు ప్రాంతాలకు చెందిన వరుడిని వివాహం చేసుకోవడం ఆనవాయితీ’’ అని వ్యాఖ్యానించారు. ఆ మహిళలు ప్రసవం కోసం ఇక్కడికి వస్తున్నారని, అయితే, ఆమెకు పుట్టిన ఆడపిల్లకు సీఎం బాలికా సంరక్షణ పథకం కింద రూ. 50 వేల డిపాజిట్‌ ఇవ్వకపోవడం ఎలా న్యాయం? అలాగైతే, మీరే పుదుచ్చేరిలోనే వరుడిని ఏర్పాటు చేయండి అని ఆయన అనడంతో అక్కడున్న వారంతా బిగ్గరగానవ్వడం గమనార్హం. నజీమ్‌ మరో డిమాండ్‌ గురించి అధికారులను ప్రశ్నించగా, మంత్రి నవ్వుతూ ముఖ్యమంత్రి మీరు చెప్పేదేదైనా అంగీకరిస్తారు. అలాంటప్పుడు అధికారులను ఎందుకు విమర్శిస్తున్నారు? అనడంతో అందరూ మరో మారు నవ్వేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, మంత్రి శివకొళుందు ఈ వ్యవహారంపై స్పందించారు. బాలిక కోసం డిపాజిట్‌ మొత్తం గురించిన అభ్యర్థన ఒక సహేతుకమైన ఆలోచన, దీనిని అధికారులతో సంప్రదించి పరిశీలించి ఒక పరిష్కారం కనుగొంటాం.. అని హామీ ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement