కాశ్మీర్‌లో అనుమతి.. తమిళనాట నిరాకరణా? | - | Sakshi
Sakshi News home page

కాశ్మీర్‌లో అనుమతి.. తమిళనాట నిరాకరణా?

Oct 15 2026 8:30 AM | Updated on Oct 15 2026 8:30 AM

ఆర్‌ఎస్‌ఎస్‌ ర్యాలీకి అనుమతిపై

హైకోర్టు ప్రశ్న

సాక్షి, చైన్నె: తీవ్రవాద ముప్పు పొంచి ఉన్న జమ్మూ కాశ్మీర్‌లోనే ఆర్‌ఎస్‌ఎస్‌ ర్యాలీకి అనుమతి ఇస్తున్నప్పుడు, శాంతి వనంగా ప్రసిద్ధి చెందిన తమిళనాడులో ఎందుకు అనుమతి నిరాకరిస్తున్నారని రాష్ట్ర పోలీసులను మద్రాసు హైకోర్టు ప్రశ్నించింది. ఆర్‌ఎస్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి జగదీశన్‌ దాఖలు చేసిన పిటిషన్‌లో ఆర్‌ఎస్‌ఎస్‌ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఈనెల 18, 25 లేదా నవంబర్‌ 1 తేదీలలో తమిళనాడు వ్యాప్తంగా ర్యాలీలు నిర్వహించడానికి అనుమతి కోరుతూ తాను డీజీపీకి దరఖాస్తు చేసుకున్నట్లు వివరించారు. ఈ దరఖాస్తుకు సంబంధించి ఎటువంటి స్పందన రానందున, ర్యాలీకి అనుమతి కోరుతూ ఈ పిటిషన్‌ దాఖలు చేసినట్లు కోర్టుకు విన్నవించారు. జస్టిస్‌ వి. లక్ష్మీ నారాయణన్‌ ఎదుట బుధశారం పిటిషన్‌ విచారణకు వచ్చింది. పిటిషనర్‌ తరఫున హాజరైన సీనియర్‌ న్యాయవాది ఎన్‌.ఎల్‌. రాజావాదిస్తూ, ప్రతి సంవత్సరం ఆర్‌ఎస్‌ఎస్‌ ఊరేగింపునకు అనుమతి ఇవ్వాలని మద్రాస్‌ హైకోర్టు ఆదేశించిందని గుర్తు చేశారు.అ యితే, అనుమతి నిరాకరించబడిందన్నారు. పోలీసుల తరఫున హాజరైన ప్రధాన పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ విజయ్‌ నారాయణ్‌ మాట్లాడుతూ, అనుమతి కోసం 21 రోజుల ముందుగా దరఖాస్తు చేసుకోవాలనే నిబంధన ఉన్నప్పటికీ, అక్టోబర్‌ 3వ తేదీనే దరఖాస్తు చేసుకున్నారని వాదించారు. ఈ ర్యాలీ కోసం అనుమతి కోరిన మార్గం, అనుమతి ఇవ్వడం సాధ్యం కాని ప్రాంతంలో ఉందని, పండుగ సమయంలో అనుమతి ఇవ్వడం వలన ప్రజలకు అసౌకర్యం కలుగుతుందని కూడా వాదించారు.

న్యాయమూర్తి తీవ్ర వ్యాఖ్యలు

ఈ సందర్భంగా న్యాయమూర్తి ప్రశ్నిస్తూ, ‘‘ప్రతి సంవత్సరం ఆర్‌ఎస్‌ఎస్‌ ర్యాలీకి అనుమతి ఇవ్వాలని మద్రాస్‌ హైకోర్టు ఆదేశించినప్పటికీ, సుప్రీంకోర్టు దానిని ధృవీకరించినప్పటికీ, ఎందుకు అనుమతి నిరాకరిస్తున్నారు? అని వ్యాఖ్యలు చేశారు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఆర్‌ఎస్‌ఎస్‌ ఊరేగింపునకు అనుమతి నిరాకరిస్తున్నారెందుకు అని ప్రశ్నించారు. తీవ్రవాద ముప్పు ఉన్న జమ్మూ కాశ్మీర్‌లో ఆర్‌ఎస్‌ఎస్‌ ర్యాలీలకు అనుమతి ఇస్తున్నారని, అదే సమయంలో శాంతి వనంగా ప్రసిద్ధి చెందిన తమిళనాడులో ఎందుకు అనుమతి నిరాకరిస్తున్నారని న్యాయమూర్తి ప్రశ్నించారు. అనుమతి నిరాకరించడం ద్వారా ప్రభుత్వం అనవసర ప్రచారం కల్పిస్తున్నదని న్యాయమూర్తి వ్యాఖ్యలు చేశారు. అనంతరం ఈ విషయంపై రాష్ట్ర ప్రధాన క్రిమినల్‌ ప్రాసిక్యూటర్‌ జాన్‌ సత్యన్‌తో చర్చలు జరపాలని న్యాయమూర్తి పిటిషనర్‌ న్యాయవాదులను ఆదేశించి, కేసు విచారణను గురువారానికి వాయిదా వేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement