సాక్షి,చైన్నె:మరో 24 గంటలలో ఈశాన్య రుతు పవనా లు రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశాలు ఉన్నాయి. ఈ పవనాలతో తీవ్ర వర్షాలు పడే అవకాశం ఉంది. ఇందుకు శుభ సూచికంగా బుధవారం చైన్నె శివారులలో పలు చోట్ల మోస్తరు వర్షం పడింది. అదే సమయంలో ఈ పవనాల సీజన్లో అప్రమత్తత అవశ్యమని, తీవ్రమైన ప్రకృతి వైపరీత్యం సంభవిస్తే తమిళనాడుకు రూ. 6,000 కోట్ల నష్టం తప్పదని కౌన్సిల్ ఫర్ డిజాస్టర్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ( సీడీఆర్ఐ) హెచ్చరిక చేయడం గమనార్హం. ఈ ఏడాది నైరుతి రుతు పవనాలు ముఖం చాటేసిన విషయం తెలిసిందే. దీంతో ఈశాన్య రుతు పవనాలపై ఎదురు చూపులు పెరిగాయి. ఈ పరిస్థితులలో గురువారం లేదా శుక్రవారం రాష్ట్రంలో ఈశాన్య రుతుపవనాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో తమిళనాడులోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ముందస్తుగా ఎల్లో అలర్ట్ జారీ చేశారు. వర్షాకాలంలో సంభవించే వరదలు, తుఫానుల వల్ల కలిగే నష్టాలను తగ్గించడానికి తమిళనాడు ప్రభుత్వం ముందుజాగ్రత్త చర్యలు , ఆర్థిక ప్రణాళికలను సమగ్రంగా అమలు చేయాలని అధికారులు పేర్కొన్నారు.
అలర్ట్ నివేదిక
అదే సమయంలో వాతావరణ వైపరీత్యాలు , వాటి ఆర్థిక ముప్పుపై సీడీఆర్ఐ సమగ్ర అధ్యయన నివేదికను విడుదల చేసింది. 2015 చైన్నె వరదల వల్ల దాదాపు 40 లక్షల మంది ప్రజలు తీవ్ర ప్రభావానికి గురయ్యారు. లక్ష మందికి పైగా తమ ఇళ్లను వదిలి వెళ్లాల్సి రాగా, 1.16 లక్షల ఇళ్లు దెబ్బతిన్నాయి. ఈ వరదల వల్ల అప్పట్లో రూ. 14,602 కోట్ల నష్టం వాటిల్లింది. 2011 థానే తుఫాను, 2015 చైన్నె వరదలు, 2018 గజా తుఫానుల వలన విద్యుత్ నిత్యవసర సేవల వ్యవస్థలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి.ఈ పరిస్థితులలో తాజాగా సైతం ఈ సీజన్లో విపత్తులకు ఆస్కారం ఉందన్న హెచ్చరికలు జారీ అయ్యాయి. వైపరీత్యాల ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని ముందస్తు ఆర్థిక ప్రణాళికలు రూపొందించుకోవాలని తమిళనాడు ప్రభుత్వానికి సూచించారు.


