కొరుక్కుపేట: భూత వాహనం పై శూలిని అలంకారంలో శ్రీ వాసవీ అమ్మవారు భక్తులను కటాక్షించారు. చైన్నె నగరంలో 300 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో శరన్నవరాత్రి మహోత్సవాలు –2026 వైభవంగా సాగుతున్నాయి. మూడవ రోజు మంగళవారం వేదపారాయణం, శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మూల మంత్ర హోమం ,అభిషేకం, విన్నపములు, దీపారాధనలను శాస్త్రోక్తంగా చేపట్టారు. నవరాత్రి వేడుకల్లో మూడో రోజు మంగళవారం శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారు భూత వాహనం పై శూలినీ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం జరిగిన భక్తి కార్యక్రమాలలో భాగంగా లలిత మనోహరీ బృందం, లలిత సహస్రనామ పారాయణం బృందం, ఎం వి ఎం ఎస్ కె పి డి స్కూల్ ల భక్తిగీతాలు, శ్రీరామచంద్రన్ షెహనాయ్ కచ్చేరి, కలైమామణి కళా శ్రీ డాక్టర్ ఎం.నర్మదా వయోలిన్ కచ్చేరి ఆకట్టుకున్నాయి. భక్తులందరికీ ప్రసాద వినియోగం చేయగా ఎస్‌కేపీడీ అండ్ చారిటీస్ సెక్రటరీ కిషోర్ కుమార్ ఏర్పాట్లు పర్యవేక్షించారు.


