సాక్షి, చైన్నె : సీఎం విజయ్ ప్రాతినిథ్యం వహిస్తున్న పెరంబూరు పెరంబూర్ నియోజకవర్గంలో వైద్య సేవలను మరింత విస్తృతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రూ. 300 కోట్ల భారీ వ్యయంతో నిర్మించనున్న ప్రభుత్వ మల్టీ–స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం కోసం పెరంబూర్‌లోని ఎరుకన్‌చేరి ప్రాంతంలో 6 ఎకరాల స్థలాన్ని అధికారులు ఎంపిక చేశారు. సీఎం విజయ్ అసెంబ్లీ ఎన్నికలలో తిరుచ్చి తూర్పు, చైన్నె పెరంబూరులలో పోటీచేసి గెలిచిన విషయం తెలిసిందే. ఆయన తిరుచ్చి తూర్పు పదవిని రాజీనామా చేసి, పెరంబూరు ఎమ్మెల్యేగా, తమిళనాడు సీఎంగా కొనసాగుతున్నారు. తన నియోజకవర్గంలో ప్రత్యేకంగా ఎమ్మెల్యే కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రజలు తమ సమస్యలు వినేందుకు , విజ్ఞప్తులు అందజేయడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అలాగే, నెలలో ఓ మారు లేదా, పదిహేను రోజులకు ఒక పర్యాయం సీఎం విజయ్ ఈకార్యాలాయన్ని సందర్శిస్తున్నారు. అలాగే, తన నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధిపరిచే దిశగా తన నిధులను కేటాయించి ఉన్నారు.
ఆసుపత్రి ప్రత్యేకతలు – నిర్మాణ వివరాలు
పెరంబూరు నియోజకవర్గానికి పొరుగన ఉన్న కొళత్తూరు పెరియర్ నగర్‌లో గత ప్రభుత్వ హయంలో బ్రహ్మాండ ఆస్పత్రికి ఆ నియోజవర్గం ఎమ్మెల్యేగా అప్పట్లో వ్యవహరించిన డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ నిర్మించారు. దీనినితలదన్నే రీతిలో పెరంబూరులో సీఎం విజయ్ మల్టీ సూపర్ స్పెషాలిటీఆ స్పత్రి నిర్మాణానికి చర్యలు తీసుకున్నారు. ఈ అత్యాధునిక ఆసుపత్రిని 400 పడకలతో అన్ని ఆధునిక వైద్య సౌకర్యాలతో నిర్మించనున్నారు. పెరంబూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయానికి ఎదురుగా, జి.ఎన్.డి. రోడ్డు సమీపంలోని ఎరుకన్‌చేరిలో తమిళనాడు అభివృద్ధి బోర్డుకు చెందిన 6 ఎకరాల భూమిని ఇందుకు కేటాయించారు. ఈ స్థలంలో ప్రస్తుతం కొన్ని ఆక్రమణలు, ఇతర నిర్మాణాలు ఉండగా, వాటిని తొలగించే ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. కేవలం భవన నిర్మాణ పనులకే రూ. 220 కోట్లు కేటాయించారు మిగిలిన రూ. 80 కోట్లను అత్యాధునిక వైద్య పరికరాలు ఇతర సామగ్రి కొనుగోలుకు వెచ్చించనున్నారు. ఈ భారీ వైద్య కేంద్రాన్ని దాదాపు 2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించనున్నారు. ఈ ఆసుపత్రి నిర్మాణాన్ని ప్రజా పనుల శాఖ చేపట్టనుంది. ఇందుకు సంబంధించిన భూసేకరణ, పర్యావరణ అనుమతులు, ఇతర ప్రాథమిక పనులు రానున్న ఐదు నెలల్లో పూర్తిచేసి పనులను ప్రారంభించనున్నారు. ఈ ఆసుపత్రి అందుబాటులోకి వస్తే పెరంబూర్ పరిసర ప్రాంత ప్రజలకు అత్యుత్తమ వైద్య సేవలు స్థానికంగానే అందుబాటులోకి వచ్చినట్టే.


