రాజీనామాల ఆమోదం రాజ్యాంగబద్ధమే | - | Sakshi
Sakshi News home page

రాజీనామాల ఆమోదం రాజ్యాంగబద్ధమే

Oct 14 2026 1:47 AM | Updated on Oct 14 2026 1:47 AM

స్పీకర్‌ నిర్ణయంలో కోర్టు జోక్యం చేసుకోదు

ఆరుగురు అన్నాడీఎంకే మాజీ

ఎమ్మెల్యేలకు కోర్టులో ఊరట

మద్రాస్‌ హైకోర్టు తీర్పు

స్పీకర్‌ కోర్టులోకి మళ్లీ బంతి

అనర్హతపై 2 నెలల్లో నిర్ణయానికి ఆదేశం

సాక్షి, చైన్నె: అన్నాడీఎంకేకు చెందిన ఆరుగురు ఎమ్మెల్యేల రాజీనామాలను స్పీకర్‌ ఆమోదించడం పూర్తిగా రాజ్యంగ బద్దమేనని మద్రాస్‌ హైకోర్టు స్పష్టం చేసింది. స్పీకర్‌ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లను కోర్టు కొట్టివేసింది. అదే సమయంలో, ఈ వివాదానికి సంబంధించి ఆరుగురు ఎమ్మెల్యేలపై కొనసాగుతున్న అనర్హత ప్రక్రియను రెండు నెలల్లోగా పూర్తి చేయాలని స్పీకర్‌ను న్యాయమూర్తులు జస్టిస్‌ సుశ్రుత్‌ అరవింద్‌ ధర్మాధికారి, జస్టిస్‌ జి. అరుల్‌ మురుగన్‌లతో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది. వివరాలు.. అసెంబ్లీ ఎన్నికల అనంతరం సీఎం విజయ్‌ విశ్వాస పరీక్షలో పార్టీ విప్‌ ఉత్తర్వులను ఉల్లంఘించి ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేసిన అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు మధురాంతకం– మరగదం కుమారవేల్‌, ధారాపురం – సత్యభామ, అంబాసముద్రం – ఇసక్కి సుబ్బయ్య, పెరుందురై – జయకుమార్‌, కరూర్‌ – ఎం.ఆర్‌. విజయభాస్కర్‌, విరాళి మలై – సి. విజయభాస్కర్‌ తదితరులపై అనర్హత వేటుకు ఆ పార్టీ అధిష్టానం నిర్ణయించింది. ఆ పార్టీ విప్‌ అగ్రి కృష్ణమూర్తి అసెంబ్లీ స్పీకర్‌కు అనర్హత వేటు ఫిర్యాదు సైం చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో పైన పేర్కొన్న ఆరుగురు ఒకరి తర్వాత మరొకరు అన్నట్టుగా ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేశారు.టీవీకే చీఫ్‌ విజయ్‌ నేతృత్వంలోని పార్టీలో చేరిపోయారు. వీరికి పార్టీలో తాజాగా కీలక పదువులు అప్పగించారు.ఈ నేపథ్యంలో ఈనెల మొదటి వారంలో మధురాంతకం, ధారాపురంలకు ఉప ఎన్నికలు జరగ్గా, రాజీనామా చేసిన సిట్టింగ్‌లు ఇద్దరు టీవీకే తరపున పోటీ చేసి మళ్లీ విజయం సాధించారు. మిగిలిన నాలుగు స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ నలుగురి ఎన్నికకు వ్యతిరేకంగా కోర్టులలో పిటిషన్లు ఉండటమే ఉప ఎన్నికల నిర్వహణకు జాప్యంగా మారింది. ఈ పరిణామాల నేపథ్యంలో అన్నాడీఎంకే ఎమ్మెల్యే రాజీనామాలను ఆగమేఘాలపై స్పీకర్‌ ఆమోదించడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌పై గత వారం విచారణను హైకోర్టు న్యాయమూర్తులు ముగించారు. మంగళవారం తీర్పు వెలువరించారు.

రాజీనామాల ఆమోదం సముచితమే

ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసే ప్రక్రియ పెండింగ్‌లో ఉన్న సమయంలో వారు సమర్పించిన రాజీనామాలను స్పీకర్‌ ఆమోదించడాన్ని తప్పుపట్టలేమని, అది రాజ్యాంగ నిబంధనల ప్రకారమే జరిగిందని హైకోర్టు తేల్చిచెప్పింది.శాసనసభ స్పీకర్‌ అధికార పరిధిలో తీసుకున్న నిర్ణయాలపై న్యాయస్థానం జోక్యం చేసుకోలేదని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ మేరకు అన్నాడీఎంకే విప్‌ అగ్రి కృష్ణమూర్తి, నేషనల్‌ పీపుల్స్‌ పవర్‌ పార్టీ నాయకుడు ఎం.ఎల్‌. రవి దాఖలు చేసిన పిటిషన్లను కొట్టివేశారు.

రెండు నెలల్లోగా అనర్హత ప్రక్రియ పూర్తి

ఎమ్మెల్యేల పదవులకు రాజీనామా చేసిన వారికి కోర్టులో ఊరట కలిగినా, బంతిని స్పీకర్‌ కోర్టులోకి న్యాయ స్థానం నెట్టింది. అనర్హత వేటు విషయంగా నిర్ణయం స్పీకర్‌కు అప్పగించారు. రాజీనామాలు ఆమోదం పొందినప్పటికీ, అంతకుముందు ఈ ఆరుగురు ఎమ్మెల్యేలపై ప్రారంభించిన అనర్హత విచారణను నిబంధనల ప్రకారం రానున్న రెండు నెలల్లోగా ముగించాలని స్పీకర్‌ను న్యాయస్థానం ఆదేశించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement