టెట్‌ ఫలితాలు విడుదల | - | Sakshi
Sakshi News home page

టెట్‌ ఫలితాలు విడుదల

Oct 14 2026 1:47 AM | Updated on Oct 14 2026 1:47 AM

● వరద ముప్పునకు చెక్‌ ● భారీగా నీటి నిల్వ

– 80.8% మంది అర్హత

సాక్షి, చైన్నె: తమిళనాడు ఉపాధ్యాయ ఎంపిక బోర్డు ఇప్పటికే విధుల్లో ఉన్న ఉపాధ్యాయుల కోసం నిర్వహించిన ప్రత్యేక ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఫలితాలను అధికారికంగా విడుదల చేసింది. హైకోర్టు అనుమతితో సోమవారం అర్ధరాత్రి ఈ ఫలితాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. పరీక్ష రాసిన 59,535 మంది ఇంటర్మీడియట్‌ ఉపాధ్యాయులలలో 47,582 మంది 80.8% ఉత్తీర్ణత సాధించారు. అలాగే, గ్రాడ్యుయేట్‌ ఉపాధ్యాయులు 1,50,929 మంది పరీక్ష రాయగా 61,153 మంది (38.3%) అర్హత పొందారు. అర్హత సాధించిన అభ్యర్థులు 5 రోజుల్లోగా బోర్డు అధికారిక వెబ్‌సైట్‌ (www.trb.tn.gov.in) ద్వారా తమ అర్హతా పత్రాలను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని సూచించారు. కాగా జనరల్‌ కేటగిరీ అభ్యర్థులు 150 మార్కులకు గానూ 90 మార్కులు, బీసీ, ఎంబీసీ, బీసీఎం కేటగిరీ అభ్యర్థులు 75 మార్కులు, ఎస్సీ, ఎస్టీ, పీడబ్యుడీ అభ్యర్థులు 60 మార్కులు సాధించాల్సి ఉంటుందన్నారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం 1 నుండి 8 తరగతుల వరకు బోధిస్తున్న ఉపాధ్యాయులకు టెట్‌ తప్పనిసరి కాగా, కోర్టు ఆదేశాల మేరకే తుది జవాబు కీలను పరిశీలించి మూల్యాంకనం పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు.

పూర్తి స్థాయి గవర్నర్‌గా రాజేంద్ర విశ్వనాథ్‌ ఆర్లేకర్‌

– సీఎం విజయ్‌ అభినందనలు

సాక్షి, చైన్నె : తమిళనాడుకు పూర్తి స్థాయి గవర్నర్‌గా రాజేంద్ర విశ్వనాథ్‌ ఆర్లేకర్‌ అధికారికంగా నియమితులయ్యారు. గత ఆరు నెలలుగా ఆయన తమిళనాడుకు తాత్కాలిక (ఇన్‌చార్జ్‌) గవర్నర్‌గా సేవలందిస్తూ వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనను కేరళ గవర్నర్‌ బాధ్యతల నుండి పూర్తిగా తప్పించి, తమిళనాడుకు పూర్తి స్థాయి గవర్నర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నియామకంపై సీఎం విజయ్‌ ఆయనకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.‘తమిళనాడు గవర్నర్‌గా నియమితులైన రాజేంద్ర విశ్వనాథ్‌ అర్లేకర్‌కు నా అభినందనలు. రాష్ట్ర అభివృద్ధి, హక్కులు , ప్రజల సంక్షేమం కోసం ఆయన చేసే కృషి విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నాను అని సీఎం విజయ్‌ తన సందేశాన్ని విడుదలచేశారు. తమిళనాడు గవర్నర్‌గా పనిచేసిన ఆర్‌.ఎన్‌. రవి మార్చిలో పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌గా బదిలీ అయ్యారు. ఆ తర్వాత కేరళ గవర్నర్‌గా ఉన్న రాజేంద్ర విశ్వనాథ్‌ ఆర్లేకర్‌కు తమిళనాడు ఇనన్‌చార్జ్‌ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. తాజాగా ఆయనను పూర్తికాల గవర్నర్‌గా నియమించారు. రాజేంద్ర విశ్వనాథ్‌ ఆర్లేకర్‌ 1954 ఏప్రిల్‌ 23న గోవాలోని పనాజీలో జన్మించారు. వాస్కో డా గామాలోని సెయింట్‌ జోసెఫ్‌ కళాశాలలో ప్రాథమిక విద్యను అభ్యషించారు. ఆతర్వాత అదే ప్రాంతంలోని ఎంఈఎస్‌ కళాశాలలో వాణిజ్య శాస్త్రంలో డిగ్రీని పూర్తి చేశారు. ఆయన తండ్రి జనసంఘ్‌ గోవా రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండే వారు. తొలుత ఆర్‌ఎస్‌ఎస్‌తో సంబంధాం కలిగి ఉన్న అర్లేకర్‌, 1989లో బిజేపీలో చేరారు. 2003లో గోవా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2012–17 వరకు గోవా అసెంబ్లీ స్పీకర్‌గా పనిచేశారు. ఆయన హిమాచల్‌ ప్రదేశ్‌, బిహార్‌, కేరళ గవర్నర్‌గా పనిచేశారు.

అమరంపేడు చెక్‌ డ్యామ్‌ సిద్ధం

సాక్షి, చైన్నె: ఈశాన్య రుతుపవనాల సమయంలో వరద ముప్పును తగ్గించడంతో పాటు, వృథాగా పోయే వర్షపు నీటిని నిల్వ చేసేందుకు కాంచీపురం జిల్లా కుండ్రత్తూరు సమీపంలోని అమరంపేడులో ప్రతిష్టాత్మక చెక్‌ డ్యామ్‌ నిర్మాణం పూర్తయింది. రూ. 16.50 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్ట్‌ను జలవనరుల శాఖ విజయవంతంగా పూర్తి చేసింది. కాగా ఈశాన్య రుతుపవనాల సమయంలో అమరంపేడు ప్రాంతంలోకి సుమారు 3,500 క్యూబిక్‌ అడుగుల నీరు ప్రవహిస్తుంది. ఇక్కడి నుంచి సోమంగలం వద్ద అడయార్‌ ఉపనదిలోకి నీరు వెళ్తుంది. దీనివల్ల ప్రతిసారీచైన్నె శివారులోని వరదరాజపురం, ముడిచ్చూర్‌ నివాస ప్రాంతాలు ముంపునకు గురవుతుంటాయి. ఈ నష్టాన్ని నివారించేందుకే ఈ చెక్‌ డ్యామ్‌ను నిర్మించారు.

భారీ నీటి నిల్వ సామర్థ్యం: అమరంపేడు చెరువు సామర్థ్యం 104 మిలియన్‌ లీటర్లు, ఇరుంబేడు సరస్సు సామర్థ్యం 400 మిలియన్‌ లీటర్లుగా ఉన్నాయి. ఈ రెండు చెరువుల కాలువలను కలుపుతూ నిర్మించిన ఈ కొత్త చెక్‌ డ్యామ్‌ ద్వారా దాదాపు 424.8 మిలియన్‌ లీటర్ల నీటిని నిల్వ చేయవచ్చు. ఇరుంబేడు వద్ద 100 మీటర్ల పొడవుతో, 7 స్లూయిస్‌ గేట్లతో ఈ చెక్‌ డ్యామ్‌ను బలోపేతం చేశారు. నీటి విడుదల కోసం డ్యామ్‌లో ప్రత్యేకంగా షట్టర్లతో కూడిన స్లూయిస్‌ గేట్లను ఏర్పాటు చేశారు. ఈ చెక్‌ డ్యాం నిండితే అడయార్‌ కాలువ ద్వారా సముద్రంలో కలిసిపోయే నీరు ఆదా అవుతుంది. ఆ నీరు క్రమంగా చెంబరబాక్కం చెరువును చేరుకుంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement