పీఎం మోదీ చేతుల మీదుగా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు పూందమల్లి – వడపళని మెట్రో రైలు సేవలకు శ్రీకారం.. జెండా ఊపిన ప్రధాని మోదీ, సీఎం విజయ్ ఒకే రైలులో ప్రయాణం జలకంఠేశ్వరాలయంలో పూజలు
సాక్షి, చైన్నె: చైన్నె మెట్రో రైలు సేవ, ఐఐటీ మద్రాసు కార్యక్రమం, నందబాక్కం వర్తక కేంద్రంలో కార్యక్రమానికి హాజరైన ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి ఆదివారం ఉదయం 11 గంటలకు చైన్నెకి చేరుకున్నారు. చైన్నె విమానాశ్రయంలో ఆయనకు తమిళనాడు గవర్నర్ అర్లేకర్, సీఎం విజయ్, కేంద్ర సహాయ మంత్రి ఎల్. మురుగన్, బీజేపీ అధ్యక్షుడు నైనార్‌నాగేంద్రన్, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిపళని స్వామి, పుదియ నిధి కట్చి నేత ఏసీ షణ్ముగం, మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, కేంద్ర మాజీ మంత్రి పొన్ రాధాకృష్ణన్ స్వయంగా స్వాగతం పలికి, పుష్పగుచ్ఛం, శాలువాను బహూకరించారు. ఈ సందర్భంగా మంత్రి భుస్సీ ఆనంద్‌ను పీఎం మోదీ ప్రత్యేకంగా అభినందించడం గమనార్హం.
బ్రహ్మరథం పట్టిన జనం
ప్రధానమంత్రి మోదీ చైన్నె విమానాశ్రయం నుంచి కారులో పోరూరుకు బయలుదేరారు. ముందుగా పీఎం కాన్వాయ్, ఆతదుపరి సీఎం కాన్వాయ్ ముందుకు సాగాయి. విమానాశ్రయం నుంచి పరంగిమలై సైనిక స్టేడియం వరకు జన సందోహాన్ని చూసిన ప్రధాని మోదీ రోడ్ షో ద్వారా వారిని అభినందిస్తూ ముందుకు సాగారు. మహాబలిపురం, తంజావూరు టెంపుల్స్, రామమందిరం సెట్లతో, తిరువళ్లూవర్‌కు కాషాయ వర్ణంతో కూడిన విగ్రహాలను ఏర్పాటు చేయడమే కాకుండా భరత నాట్య ప్రదర్శనలు, వివిధ కళా రూపాలతో బ్రహ్మరథం పట్టే విధంగా మోదికి ఉత్సాహంగా జనం ఆహ్వానం పలికారు. మోదీ... మోదీ... అని నినాదాలు చేశారు. వెను వెంటనే వచ్చిన సీఎం విజయ్ చూడగానే కేరింతలు కొడుతూ సందడి చేశారు.
మెట్రో సేవలకు శ్రీకారం
పోరూరుకు చేరుకున్న మోదీ, సీఎం విజయ్‌తో కలిసి పూందమల్లి – వడపళణి మెట్రో రైలు సేవలకు శ్రీకారం చుట్టారు. జెండా ఊపి రైలు సేవను ప్రారంభించారు. ఆ తర్వాత, ప్రధానమంత్రి మోదీ ,సీఎం విజయ్ మెట్రో రైలులో పోరూర్ నుంచి పూందమల్లి వరకు ప్రయాణించారు. తమిళనాడు సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత విజయ్, ప్రధానమంత్రితో కలిసి పాల్గొన్న తొలి ప్రభుత్వ కార్యక్రమం ఇదే కావడం గమనార్హం. ముందుగా మెట్రో సేవలను, ఇతర నిర్మాణాల గురించి అధికారులు పీఎంకు వివరించారు. ఇక్కడి కౌంటర్ వద్ద టిక్కెట్లు తీసుకున్న అనంతరం రైలులలో సీఎం, పీఎం ప్రయాణించారు. ఆతదుపరి సాయంత్రం 4 గంటల నుంచి సాధారణ ప్రజలను ప్రయాణ నిమిత్తం అనుమతించారు.
జలకండేశ్వర ఆలయ సందర్శన :
మెట్రో రైలు సర్వీసును ప్రారంభించిన అనంతరం, ప్రధానమంత్రి మోదీ పోరూర్ మెట్రో రైల్వే స్టేషన్ నుంచి కారులో ఐఐటి మద్రాసు క్యాంపస్‌కు వెళ్లారు. అక్కడ ఐఐటి డైరెక్టర్ వి కామకోటితో పాటుగా , ఇతర విద్యా ప్రతినిధులు, అధికారులు ఆహ్వానం పలికారు. ఈసందరన్భంగా మోది, విజయ్‌లు ఐఐటి క్యాంపస్‌లోని జలకండేశ్వర ఆలయంలో దర్శనం చేసుకున్నారు.
చైన్నె మెట్రో రైల్ ఫేజ్ – 2 ప్రాజెక్టులోని 4వ రూట్‌లో భాగంగా, పూందమల్లి
వడపళని మధ్య మెట్రో రైలు సర్వీసును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సీఎం
విజయ్ సంయుక్తంగా ఆదివారం జెండా ఊపి ప్రారంభించారు. సాయంత్రం
4 గంటల నుంచి సాధారణ ప్రజలు ప్రయాణించేందుకు అవకాశం కల్పించారు.
ప్రజలకు అంకితం
ఐఐటీ మద్రాసు ఆవరణలో కొత్తగా స్థాపించిన మెదడు సంబంధిత పరిశోధనా కేంద్రాన్ని పీఎం ప్రారంభించారు. స్టార్టప్‌ల పనితీరును పరిశీలించి, నిర్వాహకులతో మాట్లాడారు. అనంతరం ఐఐటీ మద్రాసు ఆవరణలో జరిగిన బ్రహ్మాండ వేదికపై తమిళనాడులో రూ. 13 వేల కోట్లతో పూర్తి చేసినా, చేపట్టనున్న వివిధ పనులు, పథకాలకు పీఎంమోదీ ప్రారంభోత్సవాలు,శంకుస్థాపనలు చేశారు. ఇందులో సుమారు రూ. 3,700 కోట్ల విలువైన ప్రధాన జాతీయ రహదారి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి, పూర్తయిన ప్రాజెక్టులను ప్రారంభించారు . అలాగే, రూ. 750 కోట్ల విలువైన రైల్వే మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను దేశానికి అంకితం చేయనున్నారు. ఇందులో అమృత్ భారత్ పథకం మేరకు చేపట్టిన పలు రైల్వే స్టేషన్లు ఉన్నాయి. తమిళనాడులో సముద్ర మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి, సరుకు రవాణా సామర్థ్యాన్ని పెంచడానికి ఆయన చైన్నె పోర్టులో నాలుగు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చైన్నెలోని చైన్నె పెట్రోలియం కార్పొరేషన్ మనాలి రిఫైనరీలో గ్రూప్ 3,4 లూబ్ ఆయిల్ బేస్ స్టాక్స్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు.
కోవై, మదురై మెట్రో ప్రాజెక్టులను పునర్ పరిశీలించండి
సాక్షి, చైన్నె: మదురై, కోయంబత్తూరు మెట్రో రైలు ప్రాజెక్టులను పునర్ పరిశీలించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని సీఎం విజయ్ కోరారు. ఐఐటీ క్యాంపస్‌లో జరిగి కార్యక్రమంలో సీఎం విజయ్ ప్రసంగిస్తూ, పూందమల్లి –వడపళని మెట్రో రైలు సేవను ప్రారంభించినందుకు పీఎం మోదీకి కృతజ్ఞతలు తెలియజేశారు. తమిళనాడు ఎన్నో ప్రాచీన సంస్క్కృతులను సజీవంగా ఉంచుకున్న రాష్ట్రం అని, అటువంటి తమిళనాడు తరపున, తమిళనాడు ప్రజల తరపున తాను పీఎం మోదీకి ఆహ్వానం పలుకుతున్నట్టు వ్యాఖ్యానించారు. తమిళనాడులో తమ ప్రభుత్వం అందరి ప్రభుత్వం అని, విద్య, వ్యవసాయంతో సహా తమిళనాడు సమగ్ర సంక్షేమాన్ని లక్ష్యంగా పెట్టుకుని, ప్రభుత్వం సమాజంలోని అన్ని వర్గాల ప్రభుత్వంగా పనిచేస్తున్నట్టు వివరించారు. తాము అధికారంలోకి వచ్చి 100 రోజులకు పైగా అయిందని, అవినీతి రహిత తమిళనాడును నిర్మించడానికి తాము తీవ్రంగా కృషి చేస్తున్నామన్నారు. తమిళనాడు భారతదేశ ప్రగతికి ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేసినప్పుడు, దాని ఫలితాలు ప్రజల జీవితాల్లో నేరుగా ప్రతిబింబించాలన్నదే తమ విధానం అని వ్యాఖ్యానించారు.
పీఎంకు విజ్ఞప్తి
చైన్నె అభివృద్ధి మాత్రమే కాకుండా, దాని అభివృద్ధిని తమిళనాడులోని ప్రతి జిల్లాకు తీసుకురావాలన్నారు. అందుకే , చైన్నె మెట్రో ఫేజ్ 3 ప్రాజెక్ట్, హోసూర్–బెంగళూరు మెట్రో ప్రాజెక్ట్, కోయంబత్తూరు , మదురై మెట్రో రైల్ ప్రాజెక్టులను పునర్ పరిశీలించి, ఆమోదించవలసిందిగా వేదికపై నుంచి పీఎం మోదీకి విజ్ఞప్తి చేశారు. చైన్నె మెట్రో పేజ్ 3లో విమానాశ్రయం – కిలాంబాక్కం, కోయంబేడు – పట్టాభిరామం, పూందమల్లి – సుంగువారి చత్రం మార్గాలు ఉన్నాయని వివరించారు. అలాగే, మద్రాస్ హైకోర్టులో తమిళాన్ని వాదనల భాషగా ప్రకటించాలని విన్నవించారు. కేంద్రం నుంచి తమిళనాడుకు రావాల్సిన నిధులు సక్రమంగా, త్వరితగతిన విడుదలయ్యేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.


