సాక్షి, చైన్నె: తమిళనాడులోని టాస్మాక్ దుకాణాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన వేతన పెంపునకు అనుగుణంగా వారి బ్యాంక్ ఖాతాలను అప్‌గ్రేడ్ చేయాలని యాజమాన్యం నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ టాస్మాక్ వైన్ షాపుల్లో పనిచేస్తున్న 22,877 మంది సిబ్బందికి ఈ వేతన పెంపు సెప్టెంబర్ 1 నుండి అమలులోకి వచ్చిన సంగతి తెలిసిందే.కొత్త వేతన సవరణ ప్రకారం సూపర్‌వైజర్ రూ. 28,750 , సేల్స్‌పర్సన్ రూ. 26,340, అసిస్టెంట్ సేల్స్‌పర్సన్ రూ. 24,928 దక్కనుంది. టాస్మాక్ ఉద్యోగుల వేతన ఖాతాలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో నిర్వహించబడుతున్నాయి. అదనంగా పెరిగిన జీతాల స్థాయికి అనుగుణంగా బ్యాంక్ అందించే ప్యాకేజీ వేరియంట్లను కూడా అప్‌గ్రేడ్ చేస్తున్నారు.
లభించే ప్రధాన ప్రయోజనాలు
నెలవారీ నికర జీతం రూ. 25,000 కంటే ఎక్కువ పొందే సూపర్‌వైజర్లు, సేల్స్‌పర్సన్‌ల ఖాతాలను గోల్డ్ ప్యాకేజీకి మారుస్తున్నారు. దీని ద్వారా వారికి రూ. 50 లక్షల వరకు ఉచిత ప్రమాదవశాత్తు మరణ బీమా సౌకర్యం అందుతుంది. అసిస్టెంట్ సేల్స్‌పర్సన్‌ల ఖాతాలను సిల్వర్ ప్యాకేజీగా వర్గీకరించి, వారికి రూ. 30 లక్షల వరకు ప్రమాద బీమా వర్తించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ ఖాతాల అప్‌గ్రేడేషన్ ప్రక్రియను తనిఖీ చేసి, క్షేత్రస్థాయి నుంచి వివరాలను సేకరించి ఈనెల 15వ తేదీలోగా నివేదిక సమర్పించాలని టాస్మాక్ మేనేజింగ్ డైరెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.


