– డీజీపీ ఆదేశం
సాక్షి, చైన్నె : ఆన్‌లైన్ మోసాలపై ప్రజలు తీవ్ర అప్రమత్తంగా ఉండాలని, మరోవైపు బ్యాంకు ఖాతాలపై నిఘా కఠినతరం చేయాలని డీజీపీ మహేష్ కుమార్ అగర్వాల్ ఆదేశించారు. పెరుగుతున్న సైబర్ నేరాలను అరికట్టే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమైందన్నారు. ఆన్‌లైన్ ఆర్థిక మోసాల నివారణ, మోసపూరిత సొమ్ము రికవరీకి సంబంధించి చైన్నెలో తమిళనాడు పోలీసుల ఆధ్వర్యంలో కీలకమైన రాష్ట్ర స్థాయి సంప్రదింపుల సమావేశం జరిగింది. డీజీపీ మహేష్ కుమార్ అగర్వాల్ అధ్యక్షతన జరిగిన ఈ అత్యున్నత సమావేశంలో అదనపు డీజీపీ (సైబర్ క్రైమ్) అబిన్ దినేష్ మోదక్‌తో పాటు పలువురు సీనియర్ అధికారులు, వివిధ బ్యాంకుల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా డీజీపీ పలు కీలక ఆదేశాలు జారీ చేశారు సైబర్ నేరగాళ్లు ఇతరుల పేర్లతో తెరిచి చలామణి చేస్తున్న మ్యూల్ బ్యాంక్ ఖాతాలను గుర్తించి, వాటిపై పూర్తి స్థాయిలో నిఘా పెట్టాలని బ్యాంకు అధికారులను ఆదేశించారు. అనుమానాస్పద లావాదేవీలను ఎప్పటికప్పుడు గుర్తించి నిరోధించడానికి అత్యాధునిక ఏపీఐ టెక్నాలజీని ఉపయోగించాలని సూచించారు. ప్రస్తుత బ్యాంకు ఖాతాలను సైబర్ మోసాలకు వినియోగించకుండా అడ్డుకోవడానికి బ్యాంకులు పటిష్టమైన ఆడిటింగ్ విధానాలను అమలు చేయాలని స్పష్టం చేశారు. బ్యాంకు శాఖలు, ఏటీఎం కేంద్రాలు, అధికారిక వెబ్‌సైట్లు అలాగే మొబైల్ యాప్‌ల ద్వారా సైబర్ నేరాల పై ప్రజలకు నిరంతరం అవగాహన కల్పించాలని సమావేశంలో స్పష్టం చేశారు. ఆన్‌లైన్ మోసాల బారిన పడకుండా పౌరులు అప్రమత్తంగా ఉండాలని, బ్యాంకు అధికారులు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించి సైబర్ నేరాల కట్టడికి పోలీసు శాఖకు సహకరించాలని ఈ సమావేశం ద్వారా పిలుపునిచ్చారు.


