సాక్షి, చైన్నె: సీఎం విజయ్ ఆదేశాల మేరకు ఈశాన్య రుతుపవనాలను సమర్థవంతంగా ఎదుర్కోవడం , తమిళనాడులో డెంగీ వ్యాధి నిర్మూలనకు తీసుకోవాల్సిన కఠిన చర్యలపై విజన్ డాక్యుమెంట్ కార్యాచరణ ప్రణాళిక అమలు అనే అంశంపై చైన్నెలోని కలైవానర్ అరంగం వేదికగా తొలి ప్రాంతీయ సదస్సు నిర్వహించారు. గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎన్. ఆనంద్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి గ్రామీణాభివృద్ధి, పంచాయతీల శాఖ ముఖ్య కార్యదర్శి ధర్మేంద్ర ప్రతాప్ యాదవ్, అదనపు డైరెక్టర్లు, కలెక్టర్లు, ఇంజనీరింగ్ అధికారులు సహా దాదాపు 1,000 మందికి పైగా అధికారులు హాజరయ్యారు.
ప్రధాన నిర్ణయాలు – మార్గదర్శకాలు
తమిళనాడు తన నీటి అవసరాల కోసం ప్రధానంగా ఈశాన్య రుతుపవనాలపై ఆధారపడి ఉన్నందు న.. వర్షాలు ప్రారంభం కావడానికి ముందే కొత్త చెరువుల నిర్మాణం, సాంప్రదాయ జలాశయాల పూడికతీత, మరియు కాలువల పునర్నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. వర్షాకాలంలో గ్రామీణ ప్రాంతాలకు సురక్షితమైన తాగునీటి సరఫరా నిరంతరాయంగా అందేలా చూడాలని, ప్రతి 15 రోజులకు ఒకసారి నీటి ట్యాంకులు, ఓవర్ హెడ్ ట్యాంక్‌లను తప్పనిసరిగా శుభ్రం చేయాలని స్పష్టం చేశారు. అలాగే ప్రతి ఒక్కరికీ తగిన మోతాదులో తాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలి.
డెంగీ నిర్మూలనకు కఠిన చర్యలు
వర్షాకాలంలో దోమల వ్యాప్తిని అరికట్టేందుకు జిల్లా కలెక్టర్ అనుమతితో ప్రత్యేక కార్మికులను నియమించాలని, నీరు నిలిచిపోయే ప్రాంతాలు, వ్యర్థాలు పేరుకుపోయే ప్రదేశాలను గుర్తించి తక్షణమే తొల గించాలని, పంచాయతీల్లో బూడిద పొడి, దోమల మందులు, క్రిమిసంహారకాలు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. రోడ్లపై చెట్లు కూలిపోతే వాటిని తొలగించడానికి విద్యుత్ రంపాలను సిద్ధంగా ఉంచడం, వరద నివారణ కేంద్రాలు, ఆశ్రయా ల ఏర్పాటు, ప్రజల ఫిర్యాదులకు సత్వర స్పందన ఉండేలా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. గ్రామీణ స్థాయి పరిపాలనలో పారదర్శకత ఉండాలని, టెండర్లలో అవకతవకలకు పాల్పడే అధికారులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామాల అభివృద్ధిలో అధికారుల పాత్ర కీలకమని మంత్రి పేర్కొన్నారు.


