● నేడు టీఎన్‌పీఎస్‌సీ గ్రూప్–4 నోటిఫికేషన్ విడుదల ● సుమారు 10 వేల ఖాళీల భర్తీకి అంచనా ● డిసెంబర్ 20న పరీక్ష
సాక్షి, చైన్నె: తమిళనాడులో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభ్యర్థులకు తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ శుభావార్తను ప్రకటించింది. గ్రూప్–4 పరీక్షకు సంబంధించిన అధికారిక నోటిఫికేషన్‌ను మంగళవారం విడుదల చేయనుంది. ఈసారి సుమారు 10,000 ఖాళీలను భర్తీ చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
నేడు నోటిఫికేషన్ విడుదల
అక్టోబర్ 6 న టీఎన్‌పీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్ వివరాలను ప్రచురించనున్నారు. షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 20న గ్రూప్–4 రాత పరీక్ష జరగనుంది. జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, షార్ట్‌హ్యాండ్ టైపిస్ట్ (గ్రేడ్–3), విలేజ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, బిల్ కలెక్టర్, ఫారెస్ట్ గార్డ్ తదితర పోస్టులు ఇందులో ఉంటాయి. గత 2024 గ్రూప్– 4 పరీక్షలో కేవలం 4,662 ఖాళీలు మాత్రమే ఉండగా.. ఈసారి పట్టణ మౌలిక సదుపాయాల శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు, రవాణా సంస్థల ఖాళీలను కూడా కలపడంతో 10వేలకు పోస్టులు భర్తీ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ పరీక్షకు ప్రధాన అర్హ త 10వ తరగతి పాస్ అయి ఉండటమే. అయితే 10వ తరగతి అర్హత అయినప్పటికీ, డిప్లొమా, డిగ్రీ, పీజీ పూర్తి చేసిన లక్షలాది మంది అభ్యర్థులు ఈ పరీక్షకు పోటీపడుతుంటారు. గతేడాది 13.89 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా.. ఈ ఏడాది ఈ సంఖ్య 15 లక్షలకు చేరవచ్చని అంచనా వేస్తున్నా రు. పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులు మంగళవారం విడుదల కానున్న నోటిఫికేషన్‌ను పరిశీలించి దరఖాస్తు చేసుకోవచ్చని టీఎన్‌పీఎస్సీ వర్గాలు పేర్కొన్నాయి.
దీపావళికి బాణసంచా షాక్
సాక్షి, చైన్నె : దీపావళి పండుగ సమీపిస్తున్న వేళ వినియోగదారులకు శివకాశి పరిశ్రమల యాజమాన్యాలు షాక్ ఇచ్చాయి. ముడిసరుకుల కొరత, ప్రభుత్వ నిబంధనల ఆంక్షల కారణంగా ఫ్యాక్టరీలలో బాణసంచా (టపాసులు) ధరలు 15 శాతం వరకు పెంచేశారు.. మరోవైపు, పండుగ కోసం తాత్కాలిక టపాసుల దుకాణాలకు అనుమతులు (లైసెన్సులు) జారీ చేసే ప్రక్రియ రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైంది. వివరాలు.. బాణసంచాకు పెట్టింది పేరు విరుదునగర్ జిల్లా శివకాశి. ఇక్కడ వందలాది పరిశ్రమలలో బాణసంచా తయారు చేస్తున్నా రు. ప్రమాదాల నివారణే లక్ష్యంగా ఇక్కడ ఇటీవల కాలంగా కట్టుదిట్టంగా భద్రతా ప్రమాణాలను అనుసరించే దిశగా యాజమాన్యాలపై అధికారులు ఒత్తిడి తెస్తూ వస్తున్నారు. శివకాశి ప్రాంతంలో 1,100కు పైగా లైసెన్స్‌డ్ ఫ్యాక్టరీలు ఉన్నప్పటికీ.. బేరియం నైట్రేట్ వాడకంపై నిషేధం, ఫ్యూజుల తయారీ నిబంధనల కారణంగా ప్రస్తుతం కేవలం 60 రకాల బాణసంచా మాత్రమే ఉత్పత్తి అవుతోంది. మే, జూన్, జూలై, ఆగస్టు నెలల్లో పలు ఫ్యాక్టరీలలో ఉత్పత్తి పూర్తిగా జరగలేదు. దీంతో డిమాండ్‌కు సరిపడా సరుకు ఈ ఏడాది తయారు కాలేదు. ఉత్పత్తి వ్యయం విపరీతంగా పెరగడం, లారీ అద్దెలు భారం కావడం వంటి కారణాలతో ఫ్యాక్టరీ స్థాయిలోనే ధరలు 15 శాతం వరకు పెరిగాయి. దీని ప్రభావంతో రిటైల్ మార్కెట్లో టపాసుల ధరలు 20 నుంచి 25 శాతం వరకు పెరిగే ఛాన్స్ ఉందని వ్యాపారులు చెబుతున్నారు.
తాత్కాలిక లైసెన్సులు షురూ
విరుదునగర్ జిల్లాలో ఏడాది పొడవునా శాశ్వత దుకాణాలకు లైసెన్సులు ఉండగా.. దీపావళి అమ్మ కాల కోసం రాష్ట్రవ్యాప్తంగా తాత్కాలిక దుకాణాల ఏర్పాటుకు అధికారులు అనుమతులు ఇస్తున్నారు. దీంతో ఇతర జిల్లాల వ్యాపారులు, పెద్ద కార్పొరేట్ కంపెనీలు తమ ఉద్యోగులకు గిఫ్ట్ బాక్స్‌లు ఇవ్వడానికి శివకాశికి భారీగా తరలివస్తున్నారు. పండుగ నాటికి ప్రజలు కోరుకునే ఫ్యాన్సీ టపాసుల కొరత ఏర్పడే అవకాశం ఉందని తయారీదారులు హెచ్చరిస్తున్నారు. ధరలు ఎక్కువగా ఉన్నప్పటికీ ఈసారీ దీపావళి అమ్మకాలు కోట్లల్లో జరిగే అవకాశం కనిపిస్తున్నది. బాణా సంచాలు టోకుగా కొనుగోలు నిమిత్తం బుకింగ్‌ల వేగం పెరిగింది.
విద్యార్థులకు 2వ సెమిస్టర్ పాఠ్యపుస్తకాల పంపిణీ
కొరుక్కుపేట: త్రైమాసిక పరీక్షల సెలవులు ముగియడంతో సోమవారం విద్యార్థులందరి కోసం పా ఠశాలలు తిరిగి తెరుచుకున్నాయి. 9 రోజుల సెలవు ల తర్వాత విద్యార్థులు తరగతులకు హాజరయ్యారు. సెలవుల తర్వాత తిరిగి వచ్చిన ప్రభుత్వ, ప్రభు త్వ సహాయక పాఠశాలల విద్యార్థులకు సోమవారం రెండవ సెమిస్టర్ పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు. తమిళనాడు వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రభుత్వ సహాయక పాఠశాలల్లో 1వ తరగతి నుండి 7వ తరగతి వరకు చదువుతున్న లక్షలాది మంది విద్యార్థులు ఉచిత పాఠ్యపుస్తకాలను అందుకున్నారు. కాగా చైన్నె జిల్లాలో 517 ప్రభుత్వ పాఠశాలలు, 300 ప్రభుత్వ సహాయక పాఠశాలలు, 400 కార్పొరేషన్ పాఠశాలలు పనిచేస్తున్నాయి.


