ఫోర్ట్ స్టేషన్ సమీపంలో ఘటన
తాంబరం – చైన్నె బీచ్ మార్గంలో సేవలకు ఆటకం
ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు..
పార్క్ స్టేషన్ నుంచి
సేవల పునరుద్దరణ
సాక్షి, చైన్నె: చైన్నెలో సబర్బన్ రైలు ప్రయాణికులకు తీవ్ర అంతరాయం కలిగించే ఘటన సోమవారం చోటుచేసుకుంది. తాంబరం నుంచి చైన్నె బీచ్ వైపు వస్తున్న ఎలక్ట్రిక్ సబర్బన్ రైలు చైన్నె ఫోర్ట్ రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పింది.దీంతో రాక పోకలకు ఆటంకం ఎదురయ్యాయి. చివరకు పార్క్ స్టేషన్ నుంచి రైళ్ల సేవలు సాగాయి. వివరాలు.. తాంబరం వైపు నుంచి చైన్నె బీచ్‌కు బయలుదేరిన ఎలక్ట్రిక్ రైలు.. మార్గమధ్యలో చైన్నె ఫోర్ట్ రైల్వే స్టేషన్ దగ్గరికి రాగానే అకస్మాత్తుగా ఒక కోచ్ పట్టాలు తప్పింది. ఈ ఘటనతో ఒక్కసారిగా ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి గాయాలు గానీ, ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
రైలు సర్వీసులకు అంతరాయం
కోచ్ పట్టాలు తప్పడంతో ఆ మార్గంలో రైలు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. బీచ్ స్టేషన్ నుంచి తాంబరం వెళ్లే సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేశారు. సమాచారం అందుకున్న దక్షిణ రైల్వే అధికారులు, సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పట్టాలు తప్పిన కోచ్‌ను తిరిగి ట్రాక్‌పైకి తెచ్చే పను ల్లో నిమగ్నమయ్యారు. ప్రయాణికుల సౌకర్యార్థం దక్షిణ రైల్వే కీలక ప్రకటన చేసింది. తాంబరం – చెంగల్పట్టు వైపు వెళ్లే అన్ని సబర్బన్ రైళ్లను ప్రస్తుతానికి పార్క్ రైల్వే స్టేషన్ నుంచే నడుపుతున్నట్లు అధికారులు వెల్లడించారు. రైలు సర్వీసులు పునరుద్ధరించే వరకు ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలని సూచించారు. మధ్యాహ్నం తర్వాత రైలు సేవలు పునరుద్దరించడంతో ఇబ్బందులు తొలగినట్లయ్యింది.


