తిరుచ్చిలో ప్రొటోకాల్‌ హైడ్రామా..! | - | Sakshi
Sakshi News home page

తిరుచ్చిలో ప్రొటోకాల్‌ హైడ్రామా..!

Oct 9 2026 6:54 AM | Updated on Oct 9 2026 6:54 AM

● కాంగ్రెస్‌ ఎంపీ చేతిలో నుంచి కొవ్వొత్తి లాక్కున్న టీవీకే ఎమ్మెల్యే.. ● వేదికపైనే రచ్చ ● ప్రొటోకాల్‌ వివాదంతో గందరగోళం

సాక్షి, చైన్నె : తమిళనాడులోని తిరుచ్చిలో జరిగిన ఓ ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. సామూహిక సీమంతాల (బేబీ షవర్‌) వేడుకలో ప్రొటోకాల్‌ వివాదం తారస్థాయికి చేరింది. కాంగ్రెస్‌ ఎంపీ చేతిలో నుంచి టీవీకే ఎమ్మెల్యే బలవంతంగా కొవ్వొత్తిని లాక్కోవడం, దాన్ని నేలమీద విసిరివేయడం కలకలం సృష్టించింది. తిరుచ్చి కలైయరంగంలో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 240 మంది గర్భిణీల కోసం సామూహిక సీమంతాల కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ వేడుకకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఎస్‌. రమేష్‌, తిరుచ్చి కలెక్టర్‌ ప్రతీక్‌ తాయల్‌, ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా మంత్రి ఎస్‌. రమేష్‌ జ్యోతి వెలిగించారు. ఆ తర్వాత కలెక్టర్‌, తోటి ఎమ్మెల్యేలు కొవ్వొత్తులు వెలిగిస్తుండగా.. కాంగ్రెస్‌ ఎంపీ క్రిస్టోఫర్‌ తిలక్‌కు కొవ్వొత్తిని అందజేశారు. అదే వేదికపై ఉన్న తిరువెరుంబూర్‌ టీవీకే ఎమ్మెల్యే నవల్పట్టు విజి.. ఎంపీ క్రిస్టోఫర్‌ తిలక్‌ చేతిలో ఉన్న కొవ్వొత్తిని అకస్మాత్తుగా లాక్కున్నారు.

వేదికపైనే ఆగ్రహం.. కొవ్వొత్తి నేలపాలు:

దీన్ని ఊహించని ఎంపీ క్రిస్టోఫర్‌ తిలక్‌ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. వెంటనే అప్రమత్తమైన మంత్రి రమేష్‌.. ఎంపీ కొవ్వొత్తి వెలిగించాక, మీరే వెలిగించండి అని ఎమ్మెల్యే నవల్పట్టు విజికి సూచించారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఎమ్మెల్యే విజి కోపంతో ఊగిపోయారు. ‘‘మీరు ఏ నియమావళి పాటిస్తున్నారు? దీనికోసం నన్నెందుకు పిలిచారు? నేను వెళ్లిపోతున్నాను’’ అంటూ గట్టిగా అరిచి, తన చేతిలోని కొవ్వొత్తిని నేలమీద విసిరేశారు. దీంతో అక్కడున్న మంత్రితో సహా అందరూ ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు.

సద్దుమణిగిన వివాదం

పరిస్థితి చేయి దాటడం గమనించిన మంత్రి రమేష్‌ స్వయంగా కిందపడిన కొవ్వొత్తిని తీసుకుని, దాన్ని వెలిగించాల్సిందిగా ఎమ్మెల్యేను కోరారు. మంత్రి సర్దిచెప్పడంతో ఎమ్మెల్యే విజి శాంతించి కొవ్వొత్తి వెలిగించారు. అయినప్పటికీ, ఫొటో దిగే సమయంలో సీనియారిటీ, ప్రొటోకాల్‌ పాటించలేదంటూ ఎమ్మెల్యే విజి మరో ఎమ్మెల్యే కదిరవన్‌తో వాగ్వాదానికి దిగారు. కదిరవన్‌ ఆయనను వారించే ప్రయత్నం చేయడంతో అక్కడ మరోసారి ఉద్రిక్తత చోటుచేసుకుంది. చివరకు మంత్రి రమేష్‌, తిరుచ్చి మెట్రోపాలిటన్‌ జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు రెక్స్‌ తదితరులు కలుగజేసుకుని ఇరువర్గాలను శాంతింపజేశారు. ఈ ఘటన అనంతరం మంత్రి రమేష్‌ మీడియాతో మాట్లాడుతూ.. ప్రొటోకాల్‌ ప్రకారం కొవ్వొత్తులు వెలిగించాలని ఎమ్మెల్యే కేవలం కోరారని, అక్కడ ఎలాంటి పెద్ద వివాదం లేదని స్పష్టం చేశారు. అందరం ఐక్యంగా తోబుట్టువుల లాంటివాళ్లమని, అనవసర గందరగోళాలు సృష్టించవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. టీవీకే, కాంగ్రెస్‌ మధ్య బంధం గట్టిగా ఉందని, వివాదాలు లేవని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement