సాక్షి, చైన్నె : జపాన్‌లో జరిగిన ఆసియా క్రీడలలో పతకాలు సాధించి రాష్ట్రానికి పేరు తెచ్చిన అథ్లెట్లను తమిళనాడు ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. స్క్వాష్, అథ్లెటిక్స్ తదితర పోటీల్లో విజయం సాధించి స్వదేశానికి తిరిగి వచ్చిన జోష్నా చిన్నప్ప, వేలవన్ సెంథిల్‌కుమార్, షమీనా రియాజ్, రాజేష్ రమేష్ తదితర అథ్లెట్లను క్రీడాశాఖ మంత్రి ఆదవ్ అర్జున్ వ్యక్తిగతంగా అభినందించారు. చైన్నెలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన అభినందన సభలో మంత్రి ఆదవ్ అర్జున్ క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడారు. ఆసియా క్రీడల్లో పతకాలు సాధించిన క్రీడాకారులకు సీఎం విజయ్‌తో విందు ఏఏర్పాటు చేయనున్నామన్నారు. ఈ కార్యక్రమంలో హాస్టల్ విద్యార్థులు కూడా పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. క్రీడాకారులకు రాష్ట్ర ప్రభుత్వం అందించే బహుమతి మొత్తాన్ని, అదే స్థాయిలో వారిని తీర్చిదిద్దిన కోచ్‌లకు కూడా అందించాలని సీఎం విజయ్‌ను కోరతామని, ఆయన కచ్చితంగా అంగీకరిస్తారని మంత్రి తెలిపారు. రానున్న 4 ఏళ్లలో తమిళనాడు వ్యాప్తంగా అత్యాధునిక వసతులతో క్రీడా నగరాలు అభివృద్ధి చేయబడతాయన్నారు. 8 ఏళ్ల వయస్సు నుంచే క్రీడలను ప్రోత్సహించి, ఒలింపిక్స్ లేదా అంతర్జాతీయ వేదికలపై పతకం సాధించే వరకు ప్రభుత్వమే అథ్లెట్లకు అండగా నిలుస్తుందని భరోసానిచ్చారు. క్రీడాకారులు సోషల్ మీడియా రీల్స్, యూట్యూబ్ వీడియోలకు సమయం కేటాయించకుండా, తమ ప్రతిభను, నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడంపై పూర్తి దృష్టి పెట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో క్రీడాశాఖ అధికారులు, వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొని పతక విజేతలను అభినందించారు.


