ఖాళీ మద్యం సీసాల సేకరణకు.. సరికొత్త మిషన్‌ | - | Sakshi
Sakshi News home page

ఖాళీ మద్యం సీసాల సేకరణకు.. సరికొత్త మిషన్‌

Jun 17 2026 12:28 AM | Updated on Jun 17 2026 12:28 AM

● టాస్మాక్‌ అధికారుల సన్నాహాలు

సాక్షి , చైన్నె: మద్యం దుకాణాల వద్ద ఖాళీ సీసాలను తిరిగి సేకరించేందుకు అత్యాధునిక యంత్రాలను ఉపయోగించాలని టాస్మాక్‌ యంత్రాంగం భావిస్తున్నది. చైన్నె ఎగ్మూర్‌ పరిధిలోని ఒక టాస్మాక్‌ దుకాణంలో ప్రయోగాత్మకంగా ఓ యంత్రాన్ని అమర్చారు.

హైకోర్టు ఆదేశాలతో శ్రీకారం

అడవులు, పర్యాటక ప్రాంతాలలో ఖాళీ మద్యం సీసాలను పడేయడం వలన వన్యప్రాణులకు ముప్పు వాటిల్లుతోందన్న పిటిషన్‌పై విచారణ జరిపిన మద్రాసు హైకోర్టు, ఖాళీ సీసాలను తిరిగి సేకరించే విధానాన్ని తీసుకురావాలని ఆదేశించింది. దీని ఆధారంగా 2023లో నీలగిరి జిల్లాలో, ఆ తర్వాత మరికొన్ని జిల్లాల్లో టాస్మాక్‌ ఈ విధానాన్ని అమలు చేసింది. అయితే, చైన్నెతో సహా పలు జిల్లాల్లో ఈ సీసాల సేకరణ ప్రక్రియను తాము చేపట్టలేమని, దీనివలన పనిభారం పెరుగుతోందని టాస్మాక్‌ సిబ్బంది వ్యతిరేకించారు. సిబ్బందితో సంబంధం లేకుండా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని వారు డిమాండ్‌ చేశారు.

యంత్రం పనిచేసే విధానం ఇదే

ఈ సమస్యకు పరిష్కారంగా ప్లాస్టిక్‌ బాటిల్స్‌ రీసైక్లింగ్‌ మిషన్‌ తరహాలోనే, మద్యం సీసాల కోసం ప్రత్యేక యంత్రాన్ని టాస్మాక్‌ ప్రవేశపెడుతోంది. ప్రస్తుతం ఈ మిషన్‌ ట్రయల్‌ రన్‌ (టెస్టింగ్‌) దశలో ఉంది. వినియోగదారులు టాస్మాక్‌ దుకాణంలో మద్యం కొనుగోలు చేసేటప్పుడు, బాటిల్‌ ధరపై అదనంగా రూ.10 వసూలు చేసి, ఆ సీసాపై ఒక క్యూఆర్‌ కోడ్‌ ఉన్న స్టిక్కర్‌ను అంటిస్తారు. ఖాళీ సీసాను తిరిగి తెచ్చినప్పుడు, ఆ మిషన్‌ వద్ద ఉన్న స్కానర్‌లో క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేయాలి. అప్పుడు మిషన్‌ తలుపు తెరుచుకుంటుంది. వినియోగదారుడు ఖాళీ సీసాను లోపల వేయగానే, ఆ యంత్రం అదనంగా వసూలు చేసిన రూ.10 నగదును తిరిగి ఇచ్చేస్తుంది. ఈ సరికొత్త సాంకేతికత ప్రస్తుతం ప్రయోగాత్మక దశలో ఉందని, త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురానున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement