ఎస్‌ఐఆర్‌పై సమరం
సాక్షి, చైన్నె:ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా, చట్ట విరు ద్ధంగా జరుగుతున్న ఎస్‌ఐఆర్‌ను ఆపాల్సిందేనని డిమాండ్ చేస్తూ మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా డీఎంకే కూటమి పోరు బాటకు సన్నద్ధమైంది. అలాగే, సవరణను వాయిదా వేయాలని పట్టుబడుతూ డీఎంకే నేత ఆర్‌ఎస్ భారతీ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అఽధికారికి కూటమి పార్టీల తరపున వినతి పత్రాన్ని సమర్పించారు. వివరాలు.. 2026లో తమిళనాట జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్‌ఐఆర్) కేంద్ర ఎన్నికల కమిషన్ చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈనెల 4వ తేదీ నుంచి నెల రోజుల పాటుగా రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటా పరిశీలనలకు జరుగుతోంది. అయితే, ఈ సవరణ ప్రక్రియకు సంబంధించి అందజేస్తున్న దరఖాస్తు ఫారం రూపంలో తీవ్ర గందరగోళం నెలకొంది. వాటిని ఎలా పూర్తి చేయాలో అన్నది బూత్ లెవల్ అధికారులకే అనేక చోట్ల తెలియడం లేదు. వీటిని ఎలా పూర్తి చేయాలో అన్నది వీడియో రూపంలో తెలియజేయాల్సిన పరిస్థితి ఎన్నికల కమిషన్‌కు ఏర్పడింది. అలాగే ఇంతవరకు అనేక చోట్ల ఇంటింటి సర్వే ముందుకు సాగలేదు. ఇక చైన్నె నగరంలో సర్వే అవస్థలు అంతా ఇంతా కాదు. బూత్ లెవల్ ఆఫీసర్లు ఇళ్ల వద్దకు వెళ్లగా జనం రోజు వారీ పనుల నిమిత్తం వెళ్లి పోవడంతో వేసిన తాళాన్ని చూసి వెను దిరగాల్సిన పరిస్థితి అనేక చోట్ల నెలకొని ఉంది. ఎస్‌ఐఆర్ ప్రక్రియ గురించి రాష్ట్రంలో అనేక చోట్ల సమాచారం శూన్యం. అదే సమయంలో ఈ ప్రక్రియపై దృష్టి పెడుతూ డీఎంకే, అన్నాడీఎంకే, కాంగ్రెస్ తదితర పార్టీలు తమ తరపున బూత్ స్థాయిలలో ప్రతినిధులను రంగంలోకి దించి ఉండడం గమనార్హం. ఇక డీఎంకే కూటమి తరపున ఎస్‌ఐఆర్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ సుప్రీం కోర్టులో మంగళవారం విచారణకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదే సమయంలో ఎస్‌ఐఆర్ కొనసాగాలని కోరుతూ అన్నాడీఎంకే తరపున సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు కావడం గమనార్హం.
నేడు తొలి విడత పోరు
ఎస్‌ఐఆర్‌కు వ్యతిరేకంగా గత వారం డీఎంకే అఖిల పక్ష సమావేశంలో తీసుకున్న నిర్ణయాల ఆధారంగా, తమిళనాట ఆప్రక్రియను ఆపాలని కోరుతూ నినాదాలు మిన్నంటుతున్నాయి. ఈ పరిస్థితులలో మంగళవారం ఎస్‌ఐఆర్‌కు వ్యతిరేకంగా సమర భేరి మోగిస్తూ డీఎంకే కూటమి పార్టీలు పోరుబాటకు సిద్ధమయ్యాయి. తొలి విడతగా రాష్ట్రవ్యాప్తంగా అని జిల్లాల కేంద్రాలలో భారీ నిరసనకు నిర్ణయించాయి. డీఎంకే నేతలు, ఎంపీలు,మంత్రులు, కాంగ్రెస్ నేత సెల్వ పెరుంతొగై,ఎండీఎంకే నేత వైగో, వీసీకే నేత తిరుమావళవన్, సీపీఎం నేత షణ్ముగం, సీపీఐ నేత వీర పాండియన్, తమిళర్ వాల్వురిమై కట్చి నేత వేల్ మురుగన్, ఇండియన్ యూనియన్ ముస్లింలీగ్ నేత ఖాదర్ మొహిద్దీన్, మనిదనేయమక్కల్ కట్చినేత జవహిరుల్లా, కొంగునాడు మక్కల్ దేశీయ కట్చినేత ఈశ్వరన్ తదితర పార్టీల నేతల నేతృత్వంలో నిరసనలు హోరెత్తించేందుకు సిద్ధమయ్యారు.
ఎస్‌ఐఆర్‌పై సమరం


