బల పడుతున్న పవనాలు
సాక్షి, చైన్నె: రాష్ట్రంలో ఈశాన్య రుతుపవనాలు మరింతగా బల పడుతున్నాయి. ఈ ప్రభావంతో భారీ వర్షాలు పడనున్నాయి. గత నెల 16వ తేదీన ముందుగానే ఈశాన్య రుతు పవనాలు రాష్ట్రాన్ని తాకిన విషయం తెలిసిందే. ఈ పవనాలు వచ్చి రాగానే అనేక జిల్లాలపై ప్రభావాన్ని చూపించాయి. ప్రధానంగా పశ్చిమ కనుమల వెంబడి ఉన్న జిల్లాల్లో సాధారణం కంటే అధికంగానే వర్షం పడింది. ఇంకా ఈ జిల్లాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి. ఇక డెల్టా, ఉత్తర తమిళనాడులో కాస్త తక్కువే. అక్టోబరు నెల సాధారణ వర్ష పాతం సంఖ్య ఆశాజనకంగానే నమోదైంది. ఈ పవనాల నేపథ్యంలో ఓ అల్పపీడనం మొదలైంది. మోంథా తుపాను ఆంధ్రా వైపుగా కదిలి వెళ్లడంతో రాష్ట్రంలో వర్షం తగ్గుముఖం పట్టింది. గత వారం రోజులుగా చెదురుమదురుగా అక్కడక్కడ వర్షాలు పడ్డాయే గానీ పూర్తి స్థాయిలో పడలేదు. నవంబర్, డిసెంబరు నెలల్లో తమిళనాడులో అత్యఽధిక వర్షాలు కురుస్తాయి. ప్రధానంగా ఉత్తర తమిళనాడులో ప్రభావం అధికంగా ఉంటుంది. ఈ పరిస్థితులలో బంగాళాఖాతంలో అల్పపీడనం మొదలవడంతో మళ్లీ వర్షాలు కురిసే అవకాశాలు అధికంగా ఉన్నాయని వాతావరణ పరిశోధకులు పేర్కొంటున్నారు. నైరుతీ బంగాళాఖాతంలో ఈసారి అల్పపీడనం మొదలయ్యే అవకాశాలు ఉన్నాయని, ఈ ప్రభావం పూర్తిగా తమిళనాడుపై ఉంటుందని పేర్కొంటున్నారు. ఈ నెల 16వ తేదీ నుంచి ఈశాన్య రుతు పవనాలు మరింతగా బల పడనున్నాయి. ఉత్తర తమిళనాడులోని 12వ తేదీ నుంచి వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ కేంద్రం ప్రకటించింది. అలాగే రామనాథపురం, విరుదునగర్, తూత్తుకుడి, తిరునల్వేలిలో వర్షాలు పడనున్నాయి. 13న కోయంబత్తూరు, నీలగిరుల్లో అధిక వర్షానికి అవకాశాలు ఉండడంతో అధికార యంత్రాంగం మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే పశ్చిమ కనుమల్లోని జిల్లాలతో పాటుగా నీలగిరులలో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. జలాశయాలన్నీ నిండుకుండులుగా మారి ఉండడం గమనార్హం.


