వృద్ధుల కోసం ‘అన్బుచోలై’
సాక్షి, చైన్నె: వృద్ధుల కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్బుచోలై పేరిట కొత్త పథకాన్నిరూపొందించింది. అన్ని రకాల సేవలు వృద్ధులకు అందించేందుకు వీలుగా ఈ పథకం అమలు కానుంది. తిరుచ్చి వేదికగా సోమవారం సీఎం ఎంకే స్టాలిన్ ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. డీఎంకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినానంతరం ప్రవేశ పెట్టిన అనేక పథకాలు ఇతర రాష్ట్రాలకు సైతం మార్గదర్శకాలైన విషయం తెలిసిందే. ద్రావిడ మోడల్ ప్రభుత్వ పథకాలను తలదన్నే రీతిలో ద్రావిడ మోడల్ 2.ఓలో నూ పథకాలు విస్తృతం అవుతాయని సీఎం ఎంకే స్టాలిన్ పేర్కొంటూ వస్తున్నారు. ఈ పరిస్థితులలో రెండు రోజుల క్షేత్ర స్థాయి పర్యటన నిమిత్తం తిరుచ్చి, పుదుకోట్టైలో సీఎం స్టాలిన్ సోమ, మంగళవారాలలో పర్యటించనున్నారు. తొలి రోజున పుదుకోట్టైలో పర్యటించనున్నారు. ఇక్కడ రూ. 767 కోట్లతో చేపట్టనున్న ప్రగతి పనులకు పునాదులు వేయనున్నారు. మధ్యాహ్నం తిరుచ్చిలో పర్యటించనున్నారు. వృద్ధుల సంక్షేమాన్ని కాంక్షిస్తూ ఇక్కడ అన్బు చోలై పథకాన్ని ప్రారంభించనున్నారు. రూ. 10 కోట్ల వ్యయంతో 25 మంది సీనియర్ సిటిజన్స్‌కు అన్ని రకాల సౌకర్యాలతో ఏర్పాటు చేసిన అన్బుచోలై పథకంను అంకితం చేయనున్నారు. వృద్ధులే సమాజానికి మార్గదర్శక శక్తి అని చాటే విధంగా ఈపథకం అమలుచేయనున్నారు. వృద్ధులు ఆనందంగా, సంతోషంగా జీవించే విధంగా ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ప్రతి కేంద్రంలో కనీసం 50 మంది వృద్ధులకు సేవలను అదించే విధంగా ఏర్పాట్లు చేశారు. ఇందు కోసం తగినంత స్థలం, మౌలిక సదుపాయాలు, డే కేర్ సెంటర్ల సౌకర్యాలు, రవాణా సౌకర్యం తదితర వాటిని కల్పించనున్నారు. అన్బుచోలై కేంద్రాలను సందర్శించే వృద్ధుల కోసం ఆహారం, స్నాక్స్, తదితర వాటితోపాటుగా ఆరోగ్య పరంగా ప్రత్యేక చర్యలు తీసుకుంటారు. సురక్షితమైన వాతావరణంలో వృద్ధులు గడింపేందుకు వీలుగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.


