కరుప్పు
జనవరిలో తెరపైకి
తమిళసినిమా: నటుడు సూర్య ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఈయన తాజాగా నటిస్తున్న చిత్రాలలో కరుప్పు ఒకటి. త్రిష నాయకిగా నటిస్తున్న ఈ చిత్రానికి నటుడు ఆర్జే బాలాజీ కథ, దర్శకత్వం బాధ్యతలు నిర్వహిస్తున్నారు. నటి స్వామికి, ఇంద్రస్, యోగిబాబు, శివద, సుప్రీత్ రెడ్డి, అనక, భామ, రవి తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సాయి అభయంకర్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని డ్రీమ్ వారియర్స్ సంస్థ భారీ ఎత్తున నిర్మిస్తోంది. ఇప్పటికే చిత్ర షూటింగ్ చాలా వరకు పూర్తి చేసుకుంది. తాజాగా కై ్లమాక్స్ సన్నివేశాలను చైన్నెలో చిత్రీకరిస్తున్నారు. ఇందులో నటుడు సూర్య మినహా ఇతర నటీనటులు పాల్గొనగా దర్శకుడు ఆర్జే బాలాజీ కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. కాగా ఈ చిత్రంలోని గాడ్ మోడ్ అనే పల్లవితో సాగే పాటను దీపావళి సందర్భంగా విడుదల చేయగా విశేష స్పందన తెచ్చుకుంది. దీంతో కరుప్పు చిత్రాన్ని 2026 జనవరి 23న తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు తాజా సమాచారం. తాజాగా సూర్య తన 46వ చిత్రాన్ని వెంకీ అట్లూరి దర్శకత్వంలో నటిస్తున్నారు. ఇక 47వ చిత్రాన్ని మాలీవుడ్ దర్శకుడు జీతూ మాధవన్ దర్శకత్వంలో ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని నటుడు సూర్య నూతనంగా ప్రారంభించిన నిర్మాణ సంస్థలో నిర్మించనున్నారు. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నట్లు సమాచారం.


