మనసున్న మాస్టారు
తిరువొత్తియూరు: తూత్తుకుడి నుంచి చైన్నెకి పాఠశాల ప్రధానోపాధ్యాయుడి ఆధ్వర్యంలో 18 మంది విద్యార్థులు విమానంలో ప్రయాణించారు. వివరాలు.. పండారంపట్టిలో ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే టి.ఎన్.టి.టి.ఎ. ప్రాథమిక పాఠశాల ఉంది. ఇందులో తూత్తుకుడి సమీపంలోని పుదుక్కోట్టై ప్రాంతానికి చెందిన నెల్సన్ పొన్ రాజ్ ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు పొందిన ఆయన ఈ పాఠశాలను డిజిటల్ కేంద్రంగా మార్చి విద్యార్థులకు కంప్యూటర్ శిక్షణ ఇవ్వడంతోపాటూ తన సొంత ఖర్చులతో పాఠశాలకు కొత్త భవనాలను కూడా నిర్మించారు. గతేడాది ఆయన వద్ద చదువుకున్న కొందరు విద్యార్థులు తమ తలల మీదుగా తరచూ విమానం ఎగురుతోందని, అయితే తాము అందులో వెళ్లగలమా? అని సరదాగా అడిగారు. అయితే, దీని గురించి ఆయన ఆలోచించకుండా సుమారు 18 మంది విద్యార్థులను గతేడాది తన సొంత ఖర్చులతో చైన్నెకి విమానంలో తీసుకెళ్లారు. అదేవిధంగా ఈ ఏడాది కూడా తన విద్యార్థులను విమానంలో తీసుకెళ్లడానికి నిర్ణయించారు. ఈక్రమంలో పూర్వ విద్యార్థులు 8 మంది, ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులు 10 మంది కలిపి మొత్తం 18 మందిని శనివారం విమానంలో చైన్నెకి తీసుకెళ్లారు. ఈయనతో పాటూ పనిచేస్తున్న సెకండరీ గ్రేడ్ టీచర్ మారిచెల్వి, చరిత్ర పరిశోధకుడు ముత్తాలంకురిచి కామరాజ్ కూడా వెళ్లారు. తూత్తుకుడి విమానాశ్రయంలో శనివారం విద్యార్థిని, విద్యార్థులను కలెక్టర్ ఇళంబగవత్ ఆధ్వర్యంలో తీసుకెళ్లారు. ఇక విద్యార్థులు చైన్నెలోని కన్నిమారా లైబ్రరీ, మ్యూజియం, సచివాలయం, నాయకుల సమాధులను సందర్శించారు. తర్వాత మెట్రో రైలు ద్వారా ఎగ్మోర్‌కు వచ్చి అక్కడి నుంచి ముత్తునగర్ రైలు ద్వారా ఆదివారం ఉదయం తూత్తుకుడికి తిరిగి చేరుకున్నారు.


