54 అవార్డులు గెలుచుకున్న వెళ్లకుదిరై
తమిళసినిమా: వెళ్లకుదిరై చిత్ర యూనిట్‌కు పలువురు సినీ ప్రముఖులు అభినందనలు తెలిపారు. నిజం సినిమా పతాకంపై హరీష్ ఓరి నిర్మించి కథానాయకుడిగా నటించిన చిత్రం వెళ్లకొదిరై. అభిరామిబోస్ కథానాయకిగా నటించిన ఈ చిత్రానికి చరణ్ రాజ్ సెంథిల్‌కుమార్ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించారు. భరత్ ఆశీవగన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. ఒక కొండ ప్రాంత ప్రజల జీవన విధానాన్ని తెరపై ఆవిష్కరించిన చిత్రం ఇది . కాగా ఇది 62 అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శింపబడి 54 అంతర్జాతీయ అవార్డులను గెలుచుకుంది. కాగా ఈ చిత్ర ఆడియో, ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని శనివారం చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్లో నిర్వహించారు. ఫెఫ్సీ అధ్యక్షుడు ఆర్కే.సెల్వమణి, దర్శకుడు భాగ్యరాజ్, ఆర్వీ ఉదయ్‌కుమార్, పేరరసు, అజయ్‌బాల, డ్రీమ్ వారియర్ గుహన్, ధనుంజయన్, విధార్థ్ పాల్గొన్నారు. అభిరామి బోస్ మాట్లాడుతూ తాను ఇంతకుముందు మరాఠీ హిందీ చిత్రాల్లో నటించినా,వెళ్లకుదిరై చిత్రం తనకు ప్రత్యేకమని పేర్కొన్నారు. చిత్ర దర్శకుడు చరణ్‌రాజ్ చింతల్‌కుమార్ మాట్లాడుతూ తమ ఊరు కొండపైకి వెళ్లడానికి రోడ్డు లేక ప్రజలు కష్టపడుతున్న ఇతివ్రతంతో చిత్రం చేయాలని నిర్మాత కోరడంతో రూపొందించిన చిత్రం ఇదని చెప్పారు. దర్శకుడు పేరరసు మాట్లాడుతూ చరణ్‌రాజ్ సెంథిల్‌కుమార్ ఉత్తమ దర్శకుడు అని ఈ చిత్రం విడుదలైన తరువాత చెప్పాల్సిన అవసరం లేదని ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డులను పొందిన ఆయన కచ్చితంగా ఉత్తమ దర్శకుడేనని పేర్కొన్నారు.


