ధన్వంతరి పీఠంలో అన్నదాన భవనం
వేలూరు: రాణిపేట జిల్లా వాలాజ సమీపంలోని ధన్వంతరి ఆరోగ్యపీఠంలో పీఠాధిపతి డాక్టర్ మురళీధరస్వామిజీ 66వ జన్మదినోత్సవం పురస్కరించుకొని పీఠంలో అన్నదాన భవనం ఏర్పాటు చేశారు. భవనాన్ని రాష్ట్ర మంత్రి ఆర్‌గాంధీ ప్రారంభించి భక్తులకు అన్నదానం చేశారు. పీఠాధిపతి 66వ జన్మదినోత్సవం సందర్భంగా గత 66 రోజులుగా పీఠంలో ప్రత్యేక యాగ పూజలు, రెండవ కాల పూజలు, కామధేను శ్రీరంగనాధర్, గజలక్ష్మి, తంగబల్లి విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేశారు. ఇందులో భాగంగా ఆదివారం ఉదయం స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, పుష్పాలంకరణలు చేసి మహా దీపారాధన పూజలు చేశారు. మంత్రి గాంధీ పాల్గొని అన్నదాన భవనాన్ని ప్రారంభించారు. ప్రతిరోజూ భక్తులకు అన్నదానం చేయడం అభినందనీయమన్నారు. మురళీధర స్వామిజీ మాట్లాడుతూ పీఠంలో మూడురోజులపాటు ప్రత్యేక యాగ పూజలతో పాటు స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. సోమవారం ఉదయం ధన్వంతరి పీఠాన్ని బంగారుగుడి పీఠం పీఠాధిపతి శ్రీశక్తిఅమ్మ సందర్శించి పలు యాగ పూజలు చేయనున్నట్లు తెలిపారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. వివిధ పీఠాల పీఠాధిపతులు, ప్రజాప్రతినిధులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


