క్రమశిక్షణతో కూడిన విద్యను అందించాలి
వేలూరు: విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన విద్యను అందించాలని మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి ఆనంద్ వెంకటేష్ అన్నారు. వేలూరు జిల్లా కాట్పాడిలోని సన్‌బీమ్ పాఠశాలలో కోరల్ ఫెస్టివల్ ప్రారంభోత్సవ కార్యక్రమం పాఠశాల చైర్మన్ హరిగోపాలన్ అద్యక్షతన జరిగింది. ఆయన మాట్లాడుతూ పాఠశాలలోని స్నేహితులు మనకు చివరి వరకు మనస్సులో ఉండిపోతారన్నారు. మనం ఎంత డబ్బు సంపాదించామనే విషయం ముఖ్యం కాదని ఎంత సంతోషంగా ఉన్నామనే విషయాన్ని ప్రతిఒక్కరూ ప్రశ్నించుకోవాలన్నారు. ప్రస్తుతం విద్యార్థులు ఇంటర్నెట్, సోషల్ మీడియాలో మునిగిపోయి విద్యకు దూరమవుతున్నారని తెలిపారు. మీరు పుస్తకాలు చదవడం వల్ల మేధాశక్తి పెరుగుతుందన్నారు. ప్రతిఒక్కరూ విద్యను అభ్యసించాలనే ప్రభుత్వం పలు ప్రయత్నాలు చేస్తుందని వీటిని గ్రామీణ ప్రాంతాల్లోని వారు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం కోరల్ ఫెస్టివల్ చిహ్నాన్ని అవిష్కరించి రూ.60 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన ఫుట్‌బాల్ మైదానాన్ని ప్రారంభించారు. అదేవిధంగా గుడియాత్తంలో ఇండోర్ స్టేడియానికి శంకుస్థాపన చేసి వివిధ క్రీడల్లో రాణించిన 42 మంది విద్యార్థులకు అవార్డులను అందజేశారు. పాఠశాల ప్రిన్సిపల్ తంగప్రకాష్, ఉపాధ్యక్షుడు అరవింద్ పాల్గొన్నారు.


