అభివృద్ధి పనులకు శంకుస్థాపన
తిరువళ్లూరు: తిరువళ్లూరు జిల్లా ఆవడి కార్పొరేషన్ పరిధిలో చేపట్టనున్న 64 పనులకు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నెహ్రూ, ముస్లిం మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి నాజర్ శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు. తిరువళ్లూరు జిల్లా ఆవడి కార్పొరేషన్ పరిదిలోని జ్యోతినగర్, అన్ననూర్, రేవానగర్, హౌసింగ్‌బోరు ప్రాంతాలలో వర్షపు నీరు వెళ్లడానికి రూ.29.67 కోట్లతో కాలువలు నిర్మించనున్నారు. దీంతో పాటు మరో రూ.9.76 కోట్లతో మరిన్ని పనులను చేపట్టనున్నారు. ఈ పనులకు శంకుస్థాపన కార్యక్రమం కలెక్టర్ ప్రతాప్ అధ్యక్షతన నిర్వహించారు. మంత్రులు నెహ్రు, నాజర్ హాజరై శంకుస్థాపన చేశారు. మంత్రి నెహ్రూ మాట్లాడుతూ ముఖ్యమంత్రి స్టాలిన్ ఇస్తున్న సహాకారంలో అభివృద్ధి పనులను వేగవంతం చేస్తున్నట్టు తెలిపారు. మున్సిపల్‌శాఖ మేనేజింగ్ డైరెక్టర్ మధుసూదన్‌రెడ్డి, కలెక్టర్ ప్రతాప్, ఆవడి కమిషనర్ శరణ్య, మేయర్ ఉదయకుమార్, డిప్యూటి మేయర్ సూర్యకుమార్, తిరునిండ్రవూర్ చైర్‌పర్సన్ ఉషారాణి పాల్గొన్నారు.


