సినిమా షూటింగ్‌లో కొన్నిసార్లు అనుకోని ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. అలాంటి ఆపదే అగరా షూటింగ్‌లో జరిగింది. ఎంపీ.నక్కీరన్, లిబియాశ్రీ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ కేరళలోని పాలక్కాడు అట్టప్పాడి ప్రాంతాల్లో జరుగుతోంది. ఓ సీన్ చిత్రీకరస్తున్న సమయంలో హీరోహీరోయిన్లు కాలుజారి లోయలో పడిపోయారట! ఈ విషయాన్ని దర్శకుడు వెల్లడించాడు.
100 అడుగుల లోయలో..
జీవాభారతి మాట్లాడుతూ.. కేరళలోని అట్టప్పాడి కొండ ప్రాంతాల్లో హీరో హీరోయిన్లకు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించాం. హీరోయిన్లు ఒకచోట నిలబడి మాట్లాడుకుంటున్న సన్నివేశాన్ని చిత్రీకరిస్తుండగా లిబియాశ్రీ కాలుజారి 100 అడుగుల లోయలోకి పడిపోయారు. ఆమెని కాపాడే ప్రయత్నంలో హీరో నక్కీరన్ కూడా లోయలోకి పడిపోయారు. ఓ పొడవైన తాడును తీసుకొచ్చి వారిని పైకి తీసుకొచ్చాం. వాళ్లు పడ్డ ప్రాంతం పచ్చికతో నిండి ఉండడంతో అదృష్టవశాత్తూ చిన్నచిన్న గాయాలతో బయటపడ్డారు. లిబియాశ్రీ ప్రథమ చికిత్స అనంతరం మళ్లీ షూటింగ్‌లో పాల్గొన్నారు అని తెలిపాడు.
అగరా సినిమాను ఎంపీఎన్ మూవీస్ పతాకంపై ఎంపీ నక్కీరన్ నిర్మిస్తున్నారు. జీవాభారతి కథ, కథనం, మాటలు పాటలు, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. నిశాంత్, జీవాభారతి, కోవై డాక్టర్ కె.కన్నన్, రంగరాజన్ సుబ్బయ్య, సెంథిల్ తంగవేల్, రమేష్‌రాజా, ఆర్.ప్రభు, జి.గణేష్‌కుమార్, సెంథిల్‌కుమార్, ఇనియన్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి యూఎం.స్టీవెన్ సతీష్ సంగీతం, చాయాగ్రహణం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. కోవై డాక్టర్ కె.కన్నన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.


