
ఆగిఉన్న టిప్పర్‌ను ఢీకొని అన్నదమ్ముల మృతి
తిరుత్తణి: పట్టణ సమీపంలో జాతీయ రహదారి వద్ద ఆగి ఉన్న టిప్పర్‌ను కారు ఢీకొన్న ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌లోని పీలేరు పట్టణానికి చెందిన అన్నదమ్ములు మృతి చెందగా వారి కొడుకు పరిస్థితి విషమంగా ఉంది. కనకమ్మసత్రం పోలీసుల కథనం మేరకు..ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లా పీలేరుకు చెందిన హుమన్‌బాషా(65) అనారోగ్యంతో బాధపడతుండడంతో చైన్నెలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందేందుకు సోమవారం అతని కుమారుడు హబీబ్ ఉమర్ సాయి(35), తమ్ముడు షేక్ షాజాహాన్(59) కారులో తీసుకెళ్లారు. కారును హాబీబ్ ఉమర్ సాయి నడిపాడు. తిరుత్తణి సమీపంలోని చైన్నె–తిరుపతి జాతీయ రహదారిలో ఆర్కాడుకుప్పం వద్ద ఆగిఉన్న టిప్పర్‌ను కారు అదుపుతప్పి వెనుక వైపు ఢీకొంది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది. ప్రమాదంలో షేక్ షాజాహాన్ అక్కడికక్కడే మృతి చెందాడు. కారులో చిక్కుకుని ప్రాణాలతో పారాడిన హుమన్‌బాషా, అతనికి కుమారుడు హజీబ్ ఉమర్ సాయిని స్థానికులు సాయంతో పోలీసులు వెలికి తీసి 108 ఆంబులెన్స్‌లో తిరుత్తణి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చిక్సిత పొందుతూ హుమన్‌బాషా సైతం మరణించాడు. తీవ్రంగా గాయపడిన హబీబ్ ఉమర్ సాయికి మెరుగైన చికిత్స కోసం తిరువళ్లూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కనకమ్మసత్రం పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.