
కలెక్టరేట్‌లో మహిళ ఆత్మాహుతియత్నం
– అడ్డుకుని స్టేషన్‌కు తరలించిన పోలీసులు
తిరువళ్లూరు: తమ భూమిని ఆక్రమించుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పలుసార్లు ఉన్నతాధికారులకు విన్నవించుకున్నా ఫలితం లేకుండాపోయిందని ఆరోపిస్తూ మహిళ సోమవారం ఉదయం కలెక్టర్ కార్యాలయానికి వచ్చి ఆత్మహుతికి యత్నించిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. తిరువళ్లూరు జిల్లా ఆర్కేపేట చెంగట్టనూర్ గ్రామానికి చెందిన గోవిందస్వామి. ఇతను కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇతడికి అదే ప్రాంతంలో సుమారు 47 సెంట్లు భూమి ఉంది. సంబంధిత భూమిని కొందరు ఆక్రమించుకుని ముళ్లకంచె ఏర్పాటు చేయడంతోపాటు నకిలీ డాక్యుమెంట్‌లను తయారు చేశారని వాపోయారు. ఇదే విషయంపై స్థానిక పోలీసులు, రెవెన్యూ అధికారులకు వినతి పత్రం సమర్పించినా ఇంత వరకు చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తూ గోవిందస్వామి, అతడి భార్య పరిమళ, కుమారుడు లోకనాథన్ కలెక్టర్ కార్యాలయానికి వచ్చి వినతి పత్రం ఇవ్వాలని నిర్ణయించారు. అయితే కలెక్టర్ కార్యాలయానికి వచ్చిన వెంటనే తనతోపాటు తెచ్చుకున్న కిరోసిన్‌ను ఒంటిపై పోసుకుని పరిమళ ఆత్మాహుతికి యత్నించింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు మహిళను అడ్డుకుని ఆమైపె నీటిని పోసి డీఆర్‌ఓ సురేష్ వద్దకు తీసుకెళ్ళారు. అక్కడ వినతి పత్రాన్ని ఇచ్చిన తరువాత మహిళను తిరువళ్లూరు టౌన్ పోలీసు స్టేషన్‌కు తరలించి, విచారణ చేపట్టారు. మహిళ ఆత్మాహుతి బెదిరింపులు కలెక్టర్ కార్యాలయం వద్ద కలకలం రేపాయి.