
కాంగ్రెస్ ఎంపీ మెడలోచైన్ స్నాచింగ్
● ఢిల్లీలో ఘటన
సాక్షి, చైన్నె: తమిళనాడులోని మైలాడుతురై కాంగ్రెస్ ఎంపీ సుధా మెడలోని చైన్‌ను ఢిల్లీలో సోమవారం దుండగులు స్నాచింగ్ చేశారు. ఎంపీకే భద్రత కరువైందని సుధా ఆవేదన వ్యక్తం చేశారు. మైలాడుతురై నుంచి ప్రప్రథమంగా న్యాయవాది సుధా గత ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికలలో గెలిచి పార్లమెంట్‌లో అడుగు పెట్టారు. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ఢిల్లీలో ఉన్నారు. సోమవారం ఉదయం ఢిల్లీలోని పోలండ్ రాయబార కార్యాలయం సమీపంలోని తమిళనాడు భవన్ నుంచి వాకింగ్‌కు వెళ్లారు. ఈ సమయంలో ఎంపీ మెడలో ఉన్న బంగారు చైన్‌ను లాక్కుని దుండగులు ఉడాయించారు. వారిని పట్టుకునేందుకు ప్రయత్నించినా, మోటారు సైకిల్‌పై ఉడాయించారు. నాలుగు సవర్ల చైన్ పోవడంతో పోలీసు పెట్రోలింగ్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అలాగే కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు ఆమె లేఖ కూడా రాశారు. ఢిల్లీ చాణుక్యపురిలో విదేశీ రాయబార కార్యాలయం ఉన్న చోట ఒక ఎంపీకే భద్రత లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు స్వల్పగాయం కూడా అయిందని పేర్కొన్నారు. ఢిల్లీలో శాంతి భద్రతలను స్వయంగా పర్యవేక్షిస్తున్న హోం మంత్రి తక్షణం ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని కోరారు. తన చైన్‌ను అపహరించిన వారిని పట్టుకోవాలని, మళ్లీ దానిని ఇప్పించేందుకు చర్యలు తీసుకోవాలని కోరడం గమనార్హం.
డీఎంకే అప్పీలు తిరస్కరణ
సాక్షి, చైన్నె : సభ్యత్వ నమోదులో ఓటీపీ వ్యవహారానికి సంబంధించిన మద్రాసు హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ డీఎంకే దాఖలు చేసిన అప్పీలు పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఓరనియిల్‌లో తమిళనాడు నినాదంతో డీఎంకే సభ్యత్వ నమోదు శర వేగంగా సాగుతున్న విషయం తెలిసిందే. రెండున్నర కోట్ల మంది కొత్త సభ్యులను చేర్చడం లక్ష్యంగా చేపట్టిన ఈ నమోదు వివాదాలకు దారి తీసింది. సభ్యులుగా చేరే వారి ఆధార్, ఇతర గుర్తింపు కార్డులను స్వీకరించడమే కాకుండా, సెల్ నెంబర్లకు ఓటీపీ పంపించి దాని ఆధారంగా ప్రక్రియ జరుగుతున్నట్టుగా వచ్చిన సమాచారంతో అన్నాడీఎంకేతో పాటుగా పలువురు హైకోర్టును ఆశ్రయించారు. ఈ ఓటీపీ వ్యవహారానికి చెక్ పెట్టే విధంగా డీఎంకేకు మద్రాసు హైకోర్టు షాక్ ఇచ్చింది. ఈ వ్యవహారంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వివరణను కోర్టు కోరింది. ఈ ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ డీఎంకే తరఫున సుప్రీంకోర్టులో అప్పీలు పిటిషన్ దాఖలు చేశారు. అలాగే ఓటీపీ వ్యవహారాన్ని పక్కన పెట్టి డీఎంకే సభ్యత్వ నమోదును వేగవంతం చేశారు. ఈ నేపథ్యంలో సోమవారం పిటిషన్ విచారణకు రాగాడీఎంకే విజ్ఞప్తిని తిరస్కరిస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది.
దక్షిణ రైల్వే పీసీఈఈగా గణేష్
సాక్షి, చైన్నె : దక్షిణ రైల్వేకు కొత్త ప్రిన్సిపల్ చీఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్(పీసీఈఈ)గా గణేష్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇది వరకు దక్షిణ రైల్వేలో ప్రిన్సిపల్ చీఫ్ సేఫ్టీ ఆఫీసర్‌గా ఆయన పనిచేశారు. ఇండియన్ రైల్వే సర్వీస్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ 191వ బ్యాంచ్‌కు చెందిన గణేష్‌కు రైల్వేలోని వివిధ రంగాల్లో అపార అనుభవం ఉంది. ఆయన తూర్పు రైల్వే, నార్త్ సెంట్రల్ రైల్వే, చిత్తరంజన్ లోకో మోటివ్ వర్క్స్‌లో చీఫ్ ఎలక్ట్రికల్ లోకో ఇంజినీర్‌గా, దక్షిణ రైల్వేలోని చైన్నె డివిజన్‌కు డివిజన్ రైల్వే మేనేజర్‌గా పనిచేశారు. లక్నోలోని రీసెర్చ్ డిజైన్స్ అండ్ స్టాండర్ ఆర్గనైజేషన్‌లో డైరెక్టర్‌గా ఏడేళ్లు పదవిలో ఉన్న ఘనత కలిగి ఉన్నారు. ఈ కాలంలో ఆయన ఎలక్ట్రిక్ లోకో మోటివ్‌లకు విశిష్ట సేవలను అందించారు. ఇటీవలే ఉద్యోగోన్నతి రైల్వేబోర్డు సభ్యుడిగా పదోన్నతి పొందిన సోమేశ్‌కుమార్ స్థానంలో గణేష్ తాజాగా నియమితులయ్యారు.
టీవీకే మహానాడు వాయిదా
సాక్షి, చైన్నె : తమిళగ వెట్రి కళగం రెండో మహానాడు వాయిదా పడింది. మరో తేదీ మహానాడు జరపాలని నిర్ణయించారు. ఈనెల 25వ తేదీన మదురై వేదికగా విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రికళగం (టీవీకే) మహానాడు జరపాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఏర్పాట్లు శర వేగంగా జరుగుతున్నాయి. అయితే, ఆది నుంచి అనుమతి వ్యవహారంలో పోలీసులు, టీవీకే వర్గాలకు మధ్య వివాదాలు తప్పలేదు. ఈ పరిస్థితుల్లో పోలీసులు ఇచ్చిన సూచనతో తేదీ మార్పు చేసుకోవాల్సి వచ్చింది. సోమవారం మదురై పోలీసుల ఇచ్చిన ఆదేశాలతో తేదీ మార్పునకు విజయ్ నిర్ణయం తీసుకోక తప్పలేదు. సెప్టెంబర్ మొదటి వారంలో ఈ మహానాడు నిర్వహించే అవకాశాలు ఉన్నాయి.

కాంగ్రెస్ ఎంపీ మెడలోచైన్ స్నాచింగ్

కాంగ్రెస్ ఎంపీ మెడలోచైన్ స్నాచింగ్