
పూర్తి సహకారం
పెట్టుబడిదారులకు
పరిశ్రమలో సీఎం పర్యటన
విస్తృతంగా పెట్టుబడులు
తూత్తుకుడిలో జరిగిన పెట్టుబడిదారుల సమావేశంలో సీఎం స్టాలిన్ సమక్షంలో రూ. 32,554 కోట్ల పెట్టుబడి, 49,845 మందికి ఉపాధి కల్పన దిశగా 41 అవగాహన ఒప్పందాలు జరిగాయి. అలాగే మూడు సంస్థలలో వివిధ పదవులకు ఎంపికై న వారికి ఉద్యోగ నియమాక ఉత్తర్వులను అందజేశారు. పరిశ్రమల శాఖ నేతృత్వంలో పెట్టుబడిదారుల సమావేశం తూత్తుకుడిలో జరిగింది. ఈ సందర్భంగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన సంస్థలతో సీఎం స్టాలిన్ సమక్షంలో ఒప్పందాలు జరిగాయి. తూత్తుకుడి జిల్లా కులశేఖర పట్నంలో ఇస్రో లాంచ్ ప్యాడ్ పనులు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ దృష్ట్యా అంతరిక్ష రంగంలో ఒక ప్రధాన కేంద్రంగా తూత్తుకుడిని తీర్చిదిద్దేవిధంగా దక్షిణ కొరియాకు చెందిన సంస్థ రూ.1720 కోట్లు, 20 వేల మందికి ఉపాధి కల్పన దిశగా ముందుకు వచ్చింది. మోబియస్ ఎనర్జీ రూ.1000 కోట్లు పెట్టుబడికి నిర్ణయించింది. తేనిలో సౌరశక్తి ప్లాంట్‌ల ఏర్పాటుతో పాటుగా 19 అవగాహన ఒప్పందాలపై కూడా ఈ సందర్భంగా సంతకాలు జరిగాయి. తూత్తుకుడిలో నిర్మాణాలు పూర్తి చేసుకున్న ప్రో హెల్త్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, తిరునల్వేలి కెమికల్, బ్రిటానియా ఫుడ్ ప్రాసెసింగ్, యీమాక్ ఎలక్ట్రానిక్స్‌లో ఉత్పత్తులను సీఎం స్టాలిన్ ఈ సందర్భంగా ప్రారంభించారు. టాటా పవర్ సోలార్, ఇన్ఫినస్, పిన్నాకిల్ ఇన్ఫోటెక్‌లలో వివిధ పదవులకు ఎంపికై న వారికి సీఎం స్టాలిన్ నియామక ఉత్తర్వులను అందజేశారు.
తూత్తుకుడిలో ఈవీ కార్ల తయారీ పరిశ్రమను ప్రారంభిస్తున్న సీఎం స్టాలిన్
సాక్షి,చైన్నె :దక్షిణ తమిళనాడులోని జిల్లాలను ఆర్థికంగా బలోపేతం చేయడం, పారిశ్రామికంగా విస్తృత అవకాశాల కల్పన, యువతకు ఉపాధి దిశగా ద్రావిడ మోడల్ ప్రభుత్వం విస్తృత చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తూత్తుకుడిలోని శీలనత్తం పారిశ్రామిక వాడలో రూ.1300 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు వియత్నాంకు చెందిన విన్ ఫాస్ట్ సంస్థ ముందుకు వచ్చింది. విన్‌ఫాస్ట్ ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి ప్లాంట్ కోసం 2024 జనవరిలో పునాదులు వేశారు. 18 నెలలో అన్ని పనులు ముగించారు. సోమవారం జరిగిన కార్యక్రమంలో ఈ ప్లాంట్‌ను సీఎం స్టాలిన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమం నిమిత్తం ఉదయాన్నే చైన్నె నుంచి తూత్తుకుడికి చేరుకున్న సీఎం స్టాలిన్‌కు విమానాశ్రయంలో డీఎంకే వర్గాలు బ్రహ్మరథం పట్టాయి. రోడ్డు మార్గంలో శీలనత్తంకు చేరుకున్న సీఎం స్టాలిన్ విన్‌ఫాస్ట్ పరిశ్రమను ప్రారంభించారు. పరిశ్రమలోని అన్ని యూనిట్లను పరిశీలించారు. ఇక్కడ సంవత్సరానికి 50 వేల కార్ల ఉత్పత్తి సామర్థ్యంతో నిర్మాణాలు జరిగి ఉండడం విశేషం. ఉత్తర తమిళనాడులో కార్లు, ద్విచక్ర వాహనాల ఉత్పత్తి పరిశ్రమలు ఉన్నప్పటికీ, దక్షిణ తమిళనాడులో ఇదే తొలి పరిశ్రమ కావడం గమనార్హం. ఈ కార్యక్రమంలో మంత్రులు కేకేఎస్‌ఎస్‌ఆర్ రామచంద్రన్, అన్బరసన్, గీతాజీవన్, అనిత ఆర్ రాధాకృష్ణన్, మనో తంగరాజ్, టి.ఆర్.పి.రాజా, ఎంపీ కనిమొళి కరుణానిధి, విన్‌ఫాస్ట్ సీఈఓ ఫామ్ చాన్ చౌ, శాసనసభ సభ్యులు వి.మార్కండేయన్, ఎస్.అమృతరాజ్, సి.షణ్ముగయ్య, ముత్తురామలింగం, అబ్దుల్ వహాబ్, ఎళిలన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మురుగానందం, తమిళనాడు గైడ్ లైన్స్ డైరెక్టర్ దార్వెజ్ అహ్మద్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అలర్మేల్ మంగై, తూత్తుకుడి కలెక్టర్ ఇలం భగవత్, విన్ ఫాస్ట్ ఇండియా డైరెక్టర్ ప్రహ్లాదన్ త్రిపాఠి తదితరులు పాల్గొన్నారు.
వియత్నాం అద్బుతం
వియత్నాంకు చెందిన విన్‌ఫాస్ట్ 18 నెలలో అద్బుతాన్ని ప్రదర్శించిందని ఈ సందర్భంగా సీఎం స్టాలిన్ కితాబునిచ్చారు. ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తిలో అగ్రగామి సంస్థగా ఉన్న విన్ ఫాస్ట్ తమిళనాడుపై ఉంచిన నమ్మకానికి సీఎం ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. భారతదేశ మొత్తం ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తిలో 40 శాతం తమిళనాడులోనే జరుగుతున్నట్టు వివరించారు. భారతదేశానికే తమిళనాడు ఆటోమోటివ్ తయారీ, ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి రాజధానిగా మారిందన్నారు. 2024 జనవరిలో జరిగిన ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సులో తూత్తుకుడిలో రూ.16,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సంస్థలు ముందుకు వచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూ, దక్షిణ తమిళనాడులోని జిల్లాలకు ఈ రోజు స్వర్ణ దినోత్సవం. ఇది తమిళనాడు దినోత్సవమని వ్యాఖ్యలు చేశారు. నాన్ మొదల్వన్ పథకం మేరకు శిక్షణ పూర్తి చేసుకున్న 200 మందికి పైగా డిప్లొమో విద్యార్థులకు ఇక్కడ ఉద్యోగ నియామక ఉత్తర్వులను సైతం అందజేశామని పేర్కొంటూ గ్లోబల్ పెట్టుబడి ద్వారా ఈ ప్రాంత సమగ్ర అభివృద్ధి వైపుగా దూసుకెళ్లనున్నట్టు ధీమా వ్యక్తం చేశారు. తూత్తుకుడి పరిసరాలకు ప్రయోజనం చేకూర్చే విడిభాగాల తయారీ ప్రాజెక్టులతో సహా వివిధ అవకాశాలు దరి చేరనున్నాయని వివరించారు. చైన్నె, కాంచీపురం, కోయంబత్తూరు, హోసూర్ తదుపరి తూత్తుకుడి ఆటోమోటివ్ పరిశ్రమ కేంద్రంగా కొనసాగుతుందన్నారు. రాణిపేటలో ఇటీవల ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి పరిశ్రమకు పునాది వేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ, తమిళనాడు ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి రాజధానిగా ప్రపంచానికి చాటే రోజులు రాబోతున్నాయన్నారు. హ్యుండయ్, నిస్సాన్, టాటా మోటార్స్, బీఎండబ్ల్యూ, బీవైడీ, ఓలా, ఏథర్, టీవీఎస్, ఆంపియర్ వంటి ప్రముఖ పరిశ్రమలు ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేస్తున్నాయని వివరించారు. ఈ రంగంలోనే కాకుండా విద్య, వైద్యం, సమాచార సాంకేతికతలో కూడా పెట్టుబడులను ఆహ్వానిస్తున్నామని పిలుపునిచ్చారు. పెట్టుబడి ప్రాజెక్టులకు ప్రభుత్వం అవసరమైన అన్ని మద్దతులను అందిస్తుందని, సంపూర్ణ సహకారం అందించేందుకు సన్నద్ధంగా ఎల్లప్పుడూ ఉంటామని స్పష్టం చేశారు.
● సీఎం స్టాలిన్ స్పష్టం
● తూత్తుకుడిలో ఈవీ కార్ల తయారీ పరిశ్రమ
● విన్ ఫాస్ట్‌లో ఉత్పత్తులకు శ్రీకారం

పూర్తి సహకారం