
అన్నదాతకు త్రీ ఫేజ్ పవర్
● తిరునల్వేలిలో పళణి హామీ ● నైనార్ బ్రహ్మాండ విందు
సాక్షి, చైన్నె: 2026లోఅధికారంలోకి రాగానే అన్నదాతకు 24 గంటల త్రీ ఫేజ్ విద్యుత్‌ను అందజేస్తామని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణిస్వామి రైతులకు హామీ ఇచ్చారు. తిరునల్వేలి పర్యటనలో భాగంగా సోమవారం ఉదయం ఆయన రైతు సంఘాల నేతలతో సమావేశమయ్యారు. తమిళనాడుని, తమిళ ప్రజలను రక్షిద్దామన్న నినాదంతో పళణిస్వామి ప్రజాచైతన్య యాత్రను చేపట్టిన విషయం తెలిసిందే. ఈ యాత్ర సోమవారం తిరునల్వేలికి చేరుకుంది. ఈ సందర్భంగా జిల్లా సరిహద్దులలో డీఎంకే, బీజేపీ వర్గాలు పళణికి బ్రహ్మరథం పట్టేలా ఆహ్వానం పలికారు. రైతులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన సేంద్రీయ వ్యవసాయంపై మాట్లాడారు. సేంద్రీయ వ్యవసాయానికి ఆదరణ పెరుగుతున్నట్టు వివరించారు. రైతులను ఆ దిశగా ప్రోత్సహించే విధంగా అన్నాడీఎంకే అధికారంలోకి వచ్చినప్పుడల్లా చర్యలు తీసుకున్నామన్నారు. గతంలో తాము రైతులకు రుణమాఫీ కూడా చేశామని గుర్తు చేశారు. నిరంతరం రైతుల ప్రయోజనాలను కాంక్షించే ఒకే ఒక పార్టీ రాష్ట్రంలో అన్నాడీఎంకే అని, గతంలో తాము నిర్మించిన ప్రాజెక్టులు, వ్యవసాయ ఆధారిత పథకాలను ఈ సందర్భంగా గుర్తు చేశారు. 2026లో తాము అధికారంలోకి రాగానే అన్నదాతలకు రాష్ట్రవ్యాప్తంగా 24 గంటల త్రీ ఫేజ్ విద్యుత్‌ను సరఫరా చేస్తామని ప్రకటించారు. ఇదే తన హామీ అని, ఇది అమల్లోకి రావడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా తన సొంత జిల్లా తిరునల్వేలికి వచ్చిన పళణిస్వామికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ బ్రహ్మాండ విందును ఏర్పాటు చేశారు.109 రకాల వంటకాలతో ఈ విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకు పళణిస్వామితోపాటుగా అన్నాడీఎంకే వర్గాలు, బీజేపీ రాష్ట్ర వ్యవహారాల కో ఇన్‌చార్జ్ సుధాకర్‌రెడ్డి, నేతల తమిళిసై సౌందరారజన్, రాజ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నైనార్ నాగేంద్రన్ మాట్లాడుతూ తమ కూటమి 200 కంటే అధిక సీట్లను గెలుచుకోవడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు.

అన్నదాతకు త్రీ ఫేజ్ పవర్