
కీళ్ల నొప్పులపై అవగాహన ర్యాలీ
తిరువళ్లూరు: ఎముకలు, కీళ్ల నొప్పుల సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో తిరువళ్లూరు వైద్యశాల వద్ద అవగాహన ర్యాలీ, మానవహారం నిర్వహించారు. సోమవారం నిర్వహించిన కార్యక్రమానికి మెడికల్ కళాశాల డీన్ డాక్టర్ రేవతి అధ్యక్షత వహించగా దాదాపు రెండు వందల మందికి పైగా మెడికల్ కళాశాల విద్యార్థులు, ట్రైనీ డాక్టర్లు, ఆర్థో వైద్యులు పాల్గొన్నారు. ప్రభుత్వ వైద్యశాల నుంచి ప్రారంభమైన ర్యాలీ సుమారు రెండు కిలోమీటర్ల మేరకు సాగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డాక్టర్ రేవతి మాట్లాడుతూ సాధారణంగా వృద్ధాప్యంలో చాలా మంది కీళ్లు, ఎముకల వ్యాధులతో బాధ పడుతుంటారని తెలిపారు. ఇటీవల యుక్తవయస్సులో వున్న వారిలో కూడా సమస్యలు ఎదురవుతున్నాయన్నారు. నాణ్యమైన ఆహారం, పనిఒత్తిడి తదితర సమస్యల కారణంగానే సమస్యలు ఎదురవుతోందన్నారు. వ్యాయామం, చెడు అలవాట్లకు దూరంగా వుండడం, నాణ్యమైన పోషకాహారం తీసుకోవడం ద్వారా సమస్యకు దూరంగా ఉండొచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఎంఓలు డాక్టర్ రాజ్‌కుమార్, డాక్టర్ ప్రభుశంకర్, కోసలరామన్, విజయరాజ్, ఆర్థో హెడ్ శరత్‌బాబు తదితరులు పాల్గొన్నారు.