
సోషల్ మీడియాదే కీలక పాత్ర
తిరుత్తణి: అసెంబ్లీ ఎన్నికల్లో సోషల్ మీడియాదే కీలకమని, ఈమేరకు డీఎంకే విజయానికి యువజన విభాగం శ్రేణులు సోషల్ మీడియాను విరివిగా వినియోగించి ప్రచారం చేపట్టాలని మంత్రి నాజర్ అవగాహన కల్పించారు. తిరువళ్లూరు వెస్టు డీఎంకే యువజన విభాగం ఆధ్వర్యంలో తిరుత్తణి నియోజకవర్గం స్థాయిలోని 330 బూత్‌లకు సంబంధించిన యువజన విభాగం సోషియల్ మీడియా విభాగ శ్రేణులకు అవగాహన తరగతులు తిరుత్తణిలో ఆదివారం నిర్వహించారు. తిరువళ్లూరు జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్యే చంద్రన్ అధ్యక్షత వహించారు. జిల్లా యువజన విభాగం తన్వీనర్ కిరణ్ స్వాగతం పలికారు. ముఖ్య అతిథిగా జిల్లా మంత్రి నాజర్ పాల్గొని యువజన విభాగం సోషల్ మీడియా విభాగం శ్రేణులకు అవగాహన కల్పించారు. గతంలో గ్రామ గ్రామానికి ప్రచారానికి వెళ్లడం, పత్రికలు, టీవీలు ద్వారా ప్రచారం చేసుకునే అవకాశం వుండేదని, అయితే మారిన క్రమంలో ప్రతి ఒక్కరి వద్ద అత్యాధునిక సెల్‌ఫోన్లు రావడంతో సామాజిక మాధ్యమాల పాత్ర చాలా వరకు పెరిగిందని, ఎప్పటికప్పుడు అన్ని ఘటనలూ ప్రజలకు అందుబాటులోకి వచ్చాయని, విమర్శలు, ప్రతి విమర్శనలను తిప్పి కొట్టేందుకు, ప్రభుత్వ పథకాలు ప్రజల వద్దకు చేర్చేందుకు సామాజిక మధ్యమాలు కీలకంగా మారయన్నారు. ఎన్నికల్లో సామాజిక మాధ్యమాల పాత్ర విలువైనది కావడంతో యువత ఉత్సాహంగా సామాజిక మాధ్యమాలు వినియోగించుకోవాలని సూచించారు.