● మహిళ సహా ముగ్గురు మృతి ● బంధువుల ఇంటికి వెళ్లి తిరుగు ప్రయాణంలో ఘటన ● ఆర్కేపేట వద్ద విషాద ఘటన
పళ్లిపట్టు: చింతచెట్టును కారు ఢీకొన్న ఘటనలో మహిళ సహా ముగ్గురు ప్రాణాలు కోల్పోయిన సంఘటన ఆర్కేపేట ప్రాంతంలో విషాదాన్ని మిగిల్చింది. ఆర్కేపేట సమీపంలోని చిత్తూరు రాష్ట్ర రహదారిలో వేలన్‌కండ్రిగ వద్ద చింతచెట్టును వేగంగా కారు ఢీకొన్న ప్రమాదంలో కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది. కారులో పయనించిన మహిళ సహా నలుగురిలో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని స్థానికుల సాయంతో ఆర్కేపేట పోలీసులు కారు నుంచి వెలికితీసి 108 ఆంబులెన్స్ సాయంతో తిరుత్తణి ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మహిళ మృతి చెందింది. మరోవ్యక్తి తిరుత్తణి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సంఘటన ప్రాంతానికి చేరుకున్న పోలీసుల విచారణలో హోసూరుకు చెందిన రంగస్వామి భార్య కన్నగి(58), ఆమె కుమారుడు కార్తి(37), వారి బందువులు స్టాలిన్(46), సంపత్‌కుమార్(45) కారులో ప్రయాణించినట్లు తెలిసింది. ఐదుగురు కారులో హోసూరు నుంచి ఆదివారం ఉదయం బయల్దేరి తిర్తుతణి సమీపంలోని నల్లాటూరులో బంధువుల ఇంట్లో ఓ కార్యక్రమంలో పాల్గొని సాయంత్రం తిరుగు పయనమయ్యారు. ఆర్కేపేట వద్ద చిత్తూరు రాష్ట్ర రహదారి వేలన్‌కండ్రిగ వద్ద చింతచెట్టును కారు ఢీకొన్న ఘటనలో స్టాలిన్, సంపత్‌కుమార్ సంఘటన ప్రాంతంలోనే మృతి చెందగా, ఆసుపత్రికి తరలిస్తుండగా కన్నగి ప్రాణాలు కోల్పోయినట్లు ఆర్కేపేట సీఐ జ్ఞానశేఖర్ తెలిపారు. తీవ్ర గాయాలైన కార్తి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆర్కేపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.