
కోలాహలంగా.. ఆడి పెరుక్కు
కావేరి నదీ తీర పరివాహక ప్రదేశాల్లో ఆడిపెరుక్కు ఆదివారం కోలాహలంగా జరిగింది. భక్తిశ్రద్ధలతో కావేరి తల్లికి ప్రజలు పూజలు చేశారు. రాష్ట్రంలోని భవానీ తదితర నదీ తీరాలలోనూ పూజలు భక్తిభావాన్ని చాటాయి. రాష్ట్రాన్ని, తమ జీవితాల్ని సుభిక్షం చేయాలని కాంక్షిస్తూ సర్వత్రా పూజలు చేశారు.
● కావేరి తీరంలో మిన్నంటిన భక్తిభావం ● ప్రత్యేక పూజలు చేసిన జనం
సాక్షి, చైన్నె: తమిళనాట ఆడి మాసం(ఆషాడం)కు ప్రత్యేక ప్రాముఖ్యతను ఇవ్వడం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మాసంలో భక్తిభావం మిన్నంటుంది. గ్రామ గ్రామన, వీధి వీధిన వెలిసిన అమ్మవారి ఆలయాల్లో ఉత్సవాలు, పూజలు మిన్నంటుతాయి. భక్తిభావంతో అమ్మవార్లను కొలుస్తుంటారు. ప్రతి మంగళ, శుక్ర, ఆదివారాల్లో ఇంటింటా పూజలు చేయడం జరుగుతూ వస్తున్నా యి. అలాగే ఆడి అమావాస్య రోజున పితృదేవుళ్లకు తర్పణాలు పెట్టడం జరిగింది. ఇక, ఈ మాసంలో ఆడి పెరుక్కు సంబరాలను నదీ తీరాల్లో జరుపు కోవడం ఆనవాయితీగా వస్తోంది. ఆడి మాసంలో 18వ రోజును ఆడి పెరుక్కు పర్వదినంగా పరిగణించి కావేరితో పాటూ పలు నదుల తీరాలలో ఈ ఏడాది రెట్టింపు ఆనందంతో ఈ రోజున పూజలతో జన సందోహం నీరాజనాలు పలికారు. రైతాంగం కదిలి వచ్చి ప్రత్యేక పూజలతో తమ పంట పొలాల ను తడిపే నదీ జలాలలకు కర్పూర హారతులు సమర్పించారు. ఈ ఏడాది ఇప్పటికే కావేరి నది ఉధృతంగా ప్రవహిస్తుండడంతో సేలం, ఈరోడ్డు, నామక్కల్, తిరుచ్చి, ధర్మపురి, కృష్ణగిరి, తిరువారూర్, తంజావూరు, పుదుకోట్టై, అరియలూరు, పెరంబలూరు తదితర ఆ నదీ తీరాలలో భక్తి భావం మిన్నంటింది. పూజలతో సందడి..
కర్ణాటక నుంచి కావేరిలో మేట్టూరు వైపుగా నీళ్లు పరవళ్లు తొక్కుతున్న విషయం తెలిసిందే. దీంతో ధర్మపురి జిల్లా పరిధిలో ఆడి పెరుక్కు మిన్నంటింది. కావేరి పరవళ్లు తొక్కుతుండటంతో పెద్దఎత్తున జనం తరలి వచ్చారు. హొగ్నెకల్ పరిసరాలు జనంతో కిక్కిరిశాయి. ఇక సేలం జిల్లా మేట్టూరు నుంచి నీటిని విడుదల చేయడంతో ఆ తీరంలోనూ జనం పెద్దఎత్తున తరలి వచ్చారు. ఈరోడ్, నామక్కల్, తిరుచ్చి – శ్రీరంగం, ముక్కొంబు, పనై కురిచ్చి, వేంగూరు, తిరువాలర్ సేలై, కంబరస పేట, పడితురైలలో ప్రజలు పెద్దఎత్తున పూజలు తరలి వచ్చారు. తంజావూరులోని తిరువయ్యారు. వద్ద కావేరి తీరంలో ఉత్సవ సందడి నెలకొంది. పూంబుహార్ వద్ద, రత్న పురేశ్వర ఆలయం వద్ద, భవానీ, కావేరి, అముదా నదుల సంగమ క్షేత్రం వద్ద ఆడి పెరుక్కు ఘనంగా జరిగింది. ఉదయాన్నే నవ దంపతులు, కుటుంబాలు, యువతీ, యువకులు, పిల్లలు, అన్నదాతలు పెద్దఎత్తున కావేరి తీరానికి తరలి వచ్చారు. కావేరి తల్లికి కృతజ్ఞతలు తెలుపుతూ పూజాధి కార్యక్రమాలు చేశారు. మహిళలు, నవదంపతులు గాజులు, బియ్యం, పసుపు కుంకుమలు, తమల పాకులను కళశాల మధ్య ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. అలాగే పలు రకాల ఫలాలను ఉంచి మొక్కులను తీర్చుకున్నారు. కర్పూర నీరాజనాలు సమర్పించారు. పవిత్ర స్నానం ఆచరించినానంతరం తమ మంగళ సూత్రాల్ని మార్చుకున్నారు. నవ దంపతులు తమ వివాహ సందర్భంగా ఉపయోగించిన పూల మాలల్ని తీసుకొచ్చి కావేరి నదిలో కలిపేశారు. అన్నదాతలు పెద్దఎత్తున తరలివచ్చి విత్తనాల్ని, గత ఏడాది తమ చేతికి అందిన పంటల్ని కావేరి నదీ తీరంలో ఉంచి పూజలు చేశారు. అనంతరం ఆ పరిసరాల్లోని గ్రామ దేవతల ఆలయాల్ని సందర్శించి మొక్కులు తీర్చుకున్నారు. పెళ్లి కాని కన్యలు, యువకులు, పిల్లల భాగ్యం లేని వాళ్లు పసుపు తాడును కావేరి తీరంలో కళశాల మధ్యలో ఉంచి పూజలు చేశారు. పవిత్ర స్నానం అనంతరం ఆ తాడును తమ చేతికి కట్టుకున్నారు. మరి కొందరు అక్కడి వేప, రావి చెట్లకు కట్టారు. ఇక తిరువారూర్, పుదుకోట్టై, నాగపట్నంలలో అక్కడక్కడ కావేరి నది తీరంలోనూ పూజలు కోలాహలంగా జరిగాయి. నవ వధువులు పవిత్ర స్నానం , పూజల అనంతరం తమ తాళి బొట్టును మార్చి కొత్తవి కట్టుకున్నారు.
కావేరి తల్లికి నీరాజనాలు
కావేరి తల్లికి సారే..
ఆడిపెడుక్కు సందర్భంగా తిరుచ్చి శ్రీరంగం శ్రీరంగనాథస్వామి ఆ లయంలో ఉదయం నుంచి ప్రత్యేక పూజలు జరిగాయి. ఆలయం నుంచి ఉదయం బంగారు పల్లకిలో ఊరేగింపుగా కావేరి తీరానికి స్వామి వారు వచ్చారు. అమ్మా మండపంలో స్వామికి వారికి ప్రత్యేక పూజలు జరిగాయి. సాయంత్రం వరకు స్వామి వారు భక్తులకు ఇక్కడే దర్శనం ఇచ్చారు. సాయంత్రం స్వామి వారి తరపున కావేరి తల్లికి పట్టు చీర, పసుపు కుంకమలు, చందనం, పూల మాలలు తదితర సారె సమర్పణ కార్యక్రమం కనుల పండువగా జరిగింది. ఇక మదురైలో వైగై నదీ, తిరునల్వేలి, కన్యాకుమారిలలో తామరభర్ణి నదీ, ఈరోడ్‌లో భవానీ నది, కోయంబత్తూరు నొయ్యల్ నది, తిరువణ్ణామలై, వేలూరులో పాలారు, తెన్‌పైన్నె తదితర నదీ తీరాల్లోనూ ఆడి పెరుక్కు సంబరాలు మిన్నంటాయి. కాగా, కావేరి, భవానీ నదులలో వరద ఉధృతి కారణంగా అనేక చోట్ల జనం నదిలోకి దిగేందుకు వీలుగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కావేరి తీరంలోని అమ్మ పడుగై, పుష్ప మండపం, ఈరోడ్‌లోని మూడు నదుల సంగమ క్షేత్రం ఘాట్‌లో ఇసుకేస్తే రాలనంతగా జనం తరలి వచ్చి పూజలలో లీనమయ్యారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ నేతృత్వంలో భవానీ సంగమ క్షేత్రంలో యాగాది పూజలు అభిషేకాలు నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు.

కోలాహలంగా.. ఆడి పెరుక్కు

కోలాహలంగా.. ఆడి పెరుక్కు