
పన్నీరు పునరాలోచించాలి
● దినకరన్ హితవు
సాక్షి, చైన్నె: ఎన్‌డీఏ కూటమి నుంచి వైదొలగే విషయంపై నిర్ణయాన్ని మాజీ సీఎం పన్నీరు సెల్వం పునస్సమీక్షించాలని అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం నేత టీటీవీ దినకరన్ సూచించారు. ఎన్‌డీఏ కూటమినుంచి పన్నీరు సెల్వం నేతృత్వంలోని కార్యకర్తల హక్కుల సాధన కమిటీ బయటకు వచ్చిన విషయం తెలిసిందే. అదే సమయంలో అన్నాడీఎంకే నుంచి చీలికతో ఆవిర్భవించిన అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం దారి ఎటో అన్న చర్చ జరుగుతోంది. అయితే అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం ఎన్‌డీఏతో పయనించేందుకే మొగ్గు చూపుతున్నట్టుంది. ఇందుకు అద్దం పట్టేవిధంగా ఆదివారం ఆ పార్టీ నేత దినకరన్ స్పందించారు. పన్నీరు సెల్వం నిర్ణయం తనకు షాక్‌కు గురి చేసిందన్నారు. పెద్దవారు ఆలోచించి అడుగులు వేయాల్సిన అవసరం ఉందన్నారు. ఏ కారణాలతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారో అన్నది పక్కన పెడితే, ఆయన నిర్ణయాన్ని పునస్సమీక్షించుకుంటే మంచిదని సూచించారు. ఆయన్ను బుజ్జగించే విధంగా నిర్ణయాలు తీసుకోవాలని పరోక్షంగా బీజేపీ వర్గాలకు సూచించారు. కూటమి నుంచి వైదొలగే విషయంపై నిర్ణయాన్ని పరిశీలించి, సమీక్షించి మంచి నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నట్టు పేర్కొన్నారు. అదే సమయంలో బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ మాట్లాడుతూ ప్రధాని అనుమతి కోసం తనకు పన్నీరు సెల్వం ఎలాంటి ఫోన్ చేయలేదని స్పష్టం చేశారు. ఆయన తనకు లేఖ రాసినట్టు పేర్కొంటున్నారని, ఆ లేఖ తనకు ఇంత వరకు అందలేదన్నారు. తనకు ఆ లేఖ అందినప్పుడు అనుమతి వ్యవహారంలో నిర్ణయం తీసుకుంటామన్నారు. అది అందని పక్షంలో అబద్దాలకోరు ఎవరో అన్నది స్పష్టమవుతుందని పరోక్షంగా పన్నీరుకు హితవు పలికారు.