
తిరుక్కురల్‌ను జాతీయ గ్రంథంగా ప్రకటించాలి
– ప్రధాని మోదీకి కవి వైరముత్తు విజ్ఞప్తి
తిరువొత్తియూరు: కవి వైరముత్తు తన ఎక్స్ పేజీలో ప్రధాని మోదీని ’ట్యాగ్’ చేసి పోస్ట్ చేశారు. అందులో ‘‘ ప్రధాని గారు, మీ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగానికి ప్రజల అభిప్రాయాలను ఆహ్వానించిన మీ గౌరవానికి నా ప్రజాస్వామ్య నమస్కారం. తమిళనాడు నుంచి ఒక భారతీయుడిగా రాస్తున్నాను. మీరు ఎల్లప్పుడూ ప్రశంసించే తిరుక్కురల్ జాతి, భాష, మతం, దేశం దాటిన ప్రపంచానికి మార్గదర్శక సూత్రాల గ్రంథం. మానవత్వం అనే ఒకే లక్ష్యాన్ని అది చాటి చెబుతుంది. ఆ పవిత్ర గ్రంథాన్ని భారతదేశ జాతీయ గ్రంథంగా ప్రకటించాలి అనేది తమిళుల చిరకాల కల నెరవేరని కోరికగా వుంది. భారతదేశ 79వ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో తిరుక్కురల్‌ను భారతదేశ జాతీయ గ్రంథంగా ప్రకటిస్తున్నట్లు మంచి ప్రకటన చేయాలని కోరుతున్నాం. మీరు కోరిన విధంగా నమో యాప్‌లో కూడా దీనిని పోస్ట్ చేయనున్నాం. ఇది ప్రపంచ సంస్కృతికి భారతదేశం ఇచ్చే బహుమతిగా భావించబడుతుంది. తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. ఆగస్టు 15న టీవీ ముందు ఆతృతగా ఎదురుచూస్తాం’’ అని పేర్కొన్నారు.
ఆర్‌ఎల్‌డీ అధ్యక్షుడిగా
జి.రాజారామన్
సాక్షి, చైన్నె: రాష్ట్రీయ లోక్‌దళ్(ఆర్‌ఎల్‌డీ) తమిళనాడు కమిటీని ప్రకటించారు. జాతీయ రాజకీయాలలో ఉత్తరప్రదేశ్, రాజస్తాన్ తదితర రాష్ట్రాలలో రాణిస్తున్న ఆర్‌ఎల్‌డీ కార్యకలాపాలను తమిళనాడులో విస్తరింప చేయడానికి ఆ పార్టీ అధిస్టానం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడితోపాటుగా ఇతర కమిటీని ఐటీసీ వెల్‌కమ్ హోటల్ వేదికగా ప్రకటించారు. ఆర్‌ఎల్‌డీ తమిళనాడు అధ్యక్షుడిగా జి.రాజారామన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్. రవి పిళ్‌లై, కోశాధికారిగా తిరునావుకరసులను నియమించారు. మిగిలిన కొత్త ఆఫీస్ బేరర్లు, ఇతర కమిటీల నాయకులను రాష్ట్ర అధ్యక్షుడు త్వరలో ప్రకటిస్తారని జాతీయ ప్రధాన కార్యద ర్శి త్రిలోక్ త్యాగి వెల్లడించారు. ఆర్‌ఎల్‌డీ ప్రధా న కార్యాలయం(ఒడిశా)లో ఉన్నట్టు, ఇక్కడి నేతలు అక్కడి నుంచి వచ్చే సూచనలు, సలహాల మేరకు రాజకీయంగా సేవలు అందిస్తారని వివరించారు. తమిళనాడు–పుదుచ్చేరి నాయకుల ద్వారా కారక్రమాలు విస్తృతం చేయనున్నట్టు ప్రకటించారు. పేద ప్రజలు, రైతాంగానికి, ఇతర వర్గాలకు అన్ని రకాలుగా ఆర్‌ఎల్‌డీ ప్రోత్సాహం, సహకారం అందిస్తుందని వివరించారు.
చైన్నెలో మళ్లీ
డబుల్ డెక్కర్ బస్సులు
సాక్షి, చైన్నె : చైన్నె నగరంలో మళ్లీ డబుల్ డెక్కర్ బస్సులు సేవలు అందించనున్నాయి. ఇందుకోసం 20 మార్గాలను ఎంపిక చేశారు. వివరాలు.. 1970లో చైన్నెలో తొలి సారిగా డబుల్ డెక్కర్ బస్సులను పరిచయం చేశారు. పది సంవత్సరాలు ఈ బస్సులు సేవలు అందించాయి. ఆతదుపరి సరికొత్త హంగులతో మళ్లీ డబుల్ డెక్కర్ బస్సులు 1977లో రోడ్డెక్కాయి. 2008 వరకు పది సంవత్సరాలు ఈ బస్సులు సేవలు అందించాయి. ఆ తదుపరి నగరాభివృద్ధిలో భాగంగా వంతెనల నిర్మాణాల మీద దృష్టి పెట్టడంతో డబుల్ డెక్కర్ బస్సుల స్థానంలో త్రిబుల్ డోర్ బస్సులు రాగా, ఆతర్వాత డీలక్స్ అంటూ సేవలు అందించాయి. చివరకు ప్రస్తుతం ఎలక్ట్రిక్, గ్యాస్‌తో నడిచే బస్సులు రోడ్డు మీదకు వస్తున్నాయి. ఈ పరిస్థితులలో వంతెనలు లేని మార్గాలలో మళ్లీ డబుల్ డెక్కర్ బస్సుల సేవలను అందించే దిశగా ఎంటీసీ వర్గాలు కసరత్తు చేస్తున్నాయి. తొలి విడతగా 20 డబుల్ డెక్కర్ ఎలక్ట్రిక్ బస్సులను కొనేందుకు ఆమోదం లభించడంతో ఆ దిశగా ప్రయత్నాలను అధికారులు మొదలెట్టి ఉన్నారు. పర్యాటకంగా సేవలను అందించే దిశగా ఈ బస్సులను ప్రైవేటు భాగస్వామ్యంతో నడిపేదిశగా చర్యలు చేపట్టి ఉన్నారు. త్వరలో టెండర్ల ప్రక్రియను ముగించి ఈ ఏడాది చివరిలో డబుల్ డెక్కర్ బస్సులను రోడ్డెక్కించే విధంగా ఎంటీసీ వర్గాలు ఉరకలు తీస్తున్నాయి.

తిరుక్కురల్‌ను జాతీయ గ్రంథంగా ప్రకటించాలి