
ఇతర రాష్ట్ర ఓటర్లతో కొత్త సమస్యలు
వేలూరు: ఇతర రాష్ట్ర ఓటర్ల వల్ల తమిళనాడులో పలు సమస్యలు వచ్చే అవకాశం ఉందని సీనియర్ మంత్రి దురై మురుగన్ అన్నారు. వేలూరు జిల్లా కాట్పాడి నియోజక వర్గం పరిధిలోని వల్లిమలై గ్రామంలో ఆరోగ్యకరమైన స్టాలిన్ పథకాన్ని మంత్రి ప్రారంభించారు. అనంతరం బ్రహ్మపురం గ్రామంలో మీతో స్టాలిన్ పథకాన్ని పరిశీలించి ప్రజలకు సంక్షేమ పథకాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత, మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వంలు సీఎం స్టాలన్‌ను కలిసి మాట్లాడటం వల్ల ఎటువంటి లాభం లేదు, నష్టం లేదన్నారు. సీఎం స్టాలిన్‌కు అనారోగ్యం క్షీణించడంతో వీరు వచ్చి పరామర్శించి వెళ్లారే తప్పా వీటిలో ఎటువంటి రాజకీయం లేదన్నారు. బిహార్‌కు చెందిన కార్మికులకు వారి రాష్ట్రంలోనే ఉపాధి కల్పించి ఉంటే మన రాష్ట్రానికి వచ్చే వారు కాదన్నారు. ప్రస్తుతం ఉపాధి కోసం మన రాష్ట్రానికి వచ్చారని ప్రస్తుతం ఏమి చేయాలో అర్థం కావడం లేదన్నారు. బిహార్‌లో ప్రాణాలతో ఉన్న వారందరినీ మృతి చెందినట్లు ఓటర్ల జాబితా నుంచి పేర్లు తీసి వేశారని అయితే మన రాష్ట్రంలో ఆ విధంగా చేసేందుకు కుదరదన్నారు. వీటిని మన రాష్ట్రంలోని రాజకీయ నాయకులకు పరిశీలించాలన్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన వారు లక్షల సంఖ్యలో తమిళనాడులో ఓటర్లుగా మారే సమయంలో రానున్న రోజుల్లో పలు సమస్యలు వచ్చే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ సుబ్బలక్ష్మి, ఎమ్మెల్యే నందకుమార్, డిప్యూటీ మేయర్ సునీల్‌కుమార్, యూనియన్ చైర్మన్ వేల్‌మురుగన్, సర్పంచ్ రాధాక్రిష్ణన్ కార్యకర్తలు పాల్గొన్నారు.