
కోలీవుడ్‌కు కోర్టు
తమిళసినిమా: తెలుగులో నటుడు నాని నిర్మించిన చిత్రం కోర్టు. నటుడు ప్రియదర్శిని, సాయికుమార్, హర్ష్ రోషన్, శ్రీదేవి, రోహిణి ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి రామ్ జగదీష్ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించారు. గత మార్చిలో విడుదలైన కోర్టు మంచి విజయాన్ని సాధించింది. ఈ చిత్ర తమిళ్ రీమేక్ హక్కులను నటుడు, దర్శక నిర్మాత త్యాగరాజన్ పొందినట్లు సమాచారం. ఈ చిత్రానికి ఆయనే దర్శకత్వం వహిస్తారని తెలిసింది. ఇకపోతే ఇందులో ప్రియదర్శిని పాత్రను నటుడు ప్రశాంత్, సాయికుమార్ పాత్రను త్యాగరాజన్ పోషించనున్నారని, ఇంకా చిత్రంలో యువ హీరోహీరోయిన్లుగా నిర్మాత కదిరేశన్ వారసుడిని, నిర్మాత పీఎల్ తేనప్పన్ వారసురాలిని పరిచయం చేయనున్నట్లు తెలిసింది. అదే విధంగా ఈ చిత్రాన్ని త్యాగరాజన్, ఫైవ్‌స్టార్ కదిరేశన్ కలిసి నిర్మించనున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయని, త్వరలోనే చిత్రం సెట్ పైకి వెళ్లనుందని సమాచారం. ఈచిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉన్నట్లు తెలిసింది. కాగా అందగన్ వంటి విజయవంతమైన చిత్రం తర్వాత ప్రశాంత్ నటించనున్న చిత్రం ఇది కావడం గమనార్హం.